రాతలు – కోతలు

మే 21, 2008

నా నవలల్లోంచి-1

Filed under: నా రచనలు. — కస్తూరి మురళీకృష్ణ @ 3:24 ఉద.

నా రచనలలోంచి కొన్ని సన్నివేశాలు మీకు పరిచయం చేయాలన్న ఆలోచనతో ఈ కొత్త శీర్షిక ఆరంభిస్తున్నాను. ఇందులో నా నవలలు,కథలు,వ్యాసాలలోంచి,కొన్ని భాగాలు ప్రచురిస్తాను.

ఈ సారి ఎంచుకున్న భాగం అసిధార అనే నవల లోది.ఇది జాగృతి వార పత్రికలో సీరియల్ గా వచ్చింది.కస్తూరి ప్రచురణలు ప్రచురించారు.(68-71 పేజీల లోదీ భాగం)
***
“రామకృష్ణ అన్నయ్య,రేపు మేమంతా కొండ మీదకు వెళ్దామనుకుంటున్నాము.మాకు తోడొస్తావా?
చదువుతున్న పుస్తకం పక్కనపెట్టి శారద వైపు చూశాదు రామకృష్ణ.
‘మీకు నేనెందుకు తోడు,మీరే బోలెడంతమంది వున్నారుగా?’
మీనాక్షివాళ్ళు వేరే వెళ్తున్నారు.
మీరెవరెవరు?
నేను,మోనిక,లలిత,మాలతి
అయితే వస్తాను.కానీ నేను మీ ఆనందానికి అడ్డూవుతానేమో?అతనికి వాళ్ళతో వెళ్ళాలని వున్నా వెంటనే వస్తాను అంటే బాగుండదని అడిగాడు.
మాకు కాస్త దూరంగా నడువు.మేము ఆఙ్నాపించినపుడు అదృశ్యం అయిపో.నవ్వుతూ అంది శారద.
తమరి ఆఙ్న.సేవకుడిలా తలవంచాడు రామకృష్ణ.
రాత్రంతా తెల్లారటంకోసం ఎదురుచూశాడు.
మరుసటిరోజు ఉదయమే అయిదుగురూ సైకిళ్ళమీద బయలు దేరారు.వాళ్ళని ముందుపోనిచ్చి తాను వెనుక నెమ్మదిగా వెళ్ళసాగాడు రామకృష్ణ.ఇప్పుడతని హృదయంలో అయోమయం ఆరంభమయింది.ఇంతకు ముందు మోనికను చూసినప్పుడల్లా ఎంత అందం అనుకునేవాడు.లలితను చూసినప్పుడల్లా అతని హృదయం స్పందించేది.ఇప్పుడు ఇద్దరినీ పక్కన పక్కన చూస్తున్నాడు.ఎవరి అందం తనని ఎక్కువగా ఆకర్శిస్తోందో అతనికి అర్ధం కావటం లేదు.
ఊరు దాటిన తరువాత గాలి రివ్వు రివ్వున వీస్తోంది.ఎదురుగాలి కావటంతో సైకిళ్ళు తొక్కటం కష్టంగా వుంది.అయినా నలుగురూ ఏదో గబగబ మాట్లాడుతూ తొక్కేస్తున్నారు.రామకృష్ణ వాళ్ళని చూస్తూ వెళ్తున్నాడు.
కొండ క్రింద సైకిళ్ళాపారు.
నేను కాస్సేపు రెస్టు తీసుకోవాల్సిందే.ఓ చెట్టునీడన కూచుండి పోయింది శారద.ఆమె పక్కన మోనిక,లలితలు కూచున్నారు.మాలతి నిలబడి చుట్టూ చూస్తోంది.’ఓ పూతోటలో నాలుగు పూలకు హఠాత్తుగా ప్రాణం వచ్చినట్టుందీఅనుకున్నాడు రామకృష్ణ.అతనికి వాళ్ళదగ్గరకు వెళ్ళాలని వుంది.కానీ ఆ కోరికను అణచుకుని కొండ ఎక్కటం ఆరంభించాడు.
ఉండండి నేనూ వస్తున్నాను,అతని వెనకే వచ్చింది మాలతి.
లలితనో,మోనికనో ఈ మాట అనివుంటే ఎంత బాగుండేది మనసులో అనుకున్నాడు.ఇంతలో అతనికి ఒక ఆలోచన వచ్చింది.
సాధారణంగా సాహిత్యంలో ఒక వ్యక్తికి ఒక స్త్రీ నచ్చుతుంది.ఆ అమ్మాయికీ అబ్బాయి నచ్చితే ఇద్దరూ పెళ్ళిచేసుకుంటారు.జీవితాంతం కలసి వుంటారు.కానీ తాను ఇక్కడ ఎవరు నచ్చారో నిర్ధారించుకోలేకుండా వున్నాడు.
మోనిక అందం మతి పోగొడుతోంది.లలిత అందం హృదయంలో ప్రశాంత భావన కలిగిస్తోంది.ఇది చూస్తే ఒక పురుషుడికి ఒక స్త్రీ అన్న మనవారి సిద్ధాంతం తప్పని అనిపిస్తోంది.అందుకే చలం’వివాహంలో జీవించడం నీచం.రోత.ఒక్క జొన్నన్నం మాత్రమే,గడ్డిని మాత్రమే మేసే మోట బ్రతుకు అది.అనేక ఆనందాలు వున్నాయి మీ ముందు అనుభవించండి నిర్భాగ్యులారా’అని ఘోషించాడు.తను చదివిన ఇంగ్లీషు పుస్తకాల్లో అనేకం ఈ ఒక స్త్రీ ఒక పురుషుడు వాదనను వ్యతిరేకించేవే.
ఇద్దరు అమ్మాయిలను చూస్తేనే తన మదిలో ఇంత సందిఘ్దం నెలకొంటే తన జీవితంలో ఇంకా ఎంతెంతమంది అందమైన వారిని కలుస్తాడో?అప్పుడు ఈమెతోనే నేను జీవితాంతం కలసి ఉంటాను అని ఎవరితో మాత్రం ఎలా అంటాడు?

ఏమాలోచిస్తున్నారు?
ఉలిక్కి పడి మాలతి వైపు చూశాడు.
ఏమీ లేదు
లేదు ఆబద్ధం చెప్తున్నారు.
తరచి చూస్తే ఈమెలో కూడా అందం కనిపిస్తోంది.మాలతి తన పక్కన నడుస్తూంటే రామకృష్ణలో చిత్రమయిన స్పందన కలుగుతోంది.
తనవైపే చూస్తున్న అతడిని చూసీఏం చూస్తున్నారు?’అడిగింది.
ప్రకృతి,స్త్రీ లలో ఎవరిది ఎక్కువ అందమా అని ఆలోచిస్తున్నాను.
మాలతి సిగ్గు పడింది.
కొండ పైకి చేరి కిందకు చూసిన వారి ఊపిరి ఆగిపోయింది.
అద్భుతమయిన దృష్యం అది.
నాలుగు వైపుల విశాలంగా పరచుకుని భూమి కనిపిస్తోంది.ఒక వైపు వ్యవసాయం కోసం భూమిని పలకలు పలకలుగా విభజించారు.ఆ మళ్ళలో పచ్చగా ఎదిగిన పైరు గర్వంగా తలలూపుతోంది.అది గాలికి రెప రెప లాడుతున్న ప్రకృతి పైటలా తోస్తోంది.
మరో వైపు దట్టమైన అడవి.చెట్ల శాఖలపై చిందులేస్తున్న సూర్య కిరణాలు ఆ చెట్ల అందాన్ని మరింత ప్రస్ఫుటం చేస్తున్నాయి.
కొండ పైన గాలి విపరీతమైన వేగంతో వీస్తోంది.
సంతోశంతో ఇద్దరి గుండెలూ ఎగసి పడుతున్నాయి.
హమ్మ,అంటూ వాళ్ళ ఎదురుగా కూలబడింది శారద.
ఆమె వెనకే వచ్చి మరో బండ రాయి మీద కూచున్నారు మోనిక,లలితలు.వాళ్ళు రానంత వరకూ మాలతిది అద్భుతమయిన అందంలా అనిపించిన రామకృష్ణకు ఇప్పుడు మోనికా మీదనుంచి దృష్టి మరల్చాలని లేదు.
అది గమనించిన మాలతి హృదయం అసూయతో భగ్గు మంది.
అంతవరకూ సంతోషంగా వుండి,మూడీగా అయిన లలితను చూసి,ఏమిటీ విషాదంగా వున్నావు?,అడిగింది శారద.
ఏమీ లేదు.ఎందుకో తెలియదు కానీ సంతోషం,విషాదం రెండూ విడదీయరాని భావాలేమో అనిపిస్తోంది.ఆనందం కలిగే సంఘటనల వెనకే విషాదం పొంచి వుంటుంది,అంది లలిత.
గతం వర్తమానాల్లా,అన్నాడు రామకృష్ణ.
నిజం,ఎప్పుడూ వర్తమానమే అయినా,వర్తమానాన్ని ఇది అని అనుభవించలేము.సుఖం అంతే.ఈ క్షణం సుఖం మరుక్షణం గతం అయిపోతుంది.మిగిలేది గతం తాలూకు అనుభూతులే.
మీకు జాన్ స్టైన్ బక్ అంటే ఇష్టమా?అడిగాడు.
మీకూ ఇష్టంలానే వుంది.మీ ఇంట్లో అతడి పుస్తకాలు చూసాను,అంది లలిత.
మాలతి ముఖం తిప్పేసుకుంది.కాలేజీలో కూడా ఆమెకిది అనుభవమే.మగవాళ్ళంతా మోనికా వెంట పడతారు.అలాకాక ఎవరయినా దగ్గరకు వస్తే ఈ లలితతో సాహిత్య చర్చలు చేస్తూ తనని మరచిపోతారు.
స్టైన్ బక్ నవలలు నచ్చని వాడికి భాష రాదు,భావావేశం లేదు అని ఘంటాపధంగా చెప్పగలను.కానీ నాకు చలం అంటే ఇష్టం.మన సమాజంలోని కుళ్ళును ధైర్యంగా ఎత్తి చూపిన వ్యక్తి చలం.అసలు స్త్రీని సరిగ్గా అర్ధం చేసుకున్న ఏకైక రచయిత చలం అని నేను నమ్ముతున్నాను,అన్నాడు రామకృష్ణ.
కానీ చలం స్త్రీ శరీరాన్ని అర్ధం చేసుకున్నంతగా,మనసును అర్ధం చేసుకోలేదనిపిస్తుంది,అంది లలిత.
ఆమె మాటలకు రామకృష్ణ తీవ్రంగా స్పందించాడు.
మీరు చలం గురుంచి అలా అనకండి.అతనిలో వున్న సెన్సిటివిటీ మరే రచయితలో లేదు.ఒక పువ్వును చూసి స్పందించటం,సముద్రం ఒడ్డున కూచుని అలలకు కదిలే ఇసుక లోని రంగుల అమరికను గమనించి ఆనందించటం……అందాన్ని అనుభవించి ఆనందం పొందటంలో చలాన్ని మించి సున్నితమయిన మనసున్న రచయితను నేను చూడలేదు,మోనికా తనవైపు పెద్ద కళ్ళతో చూడటం అతనికి ఆవేశాన్ని కలిగిస్తోంది.
మనం చలం సున్నితత్వం గురించి చర్చింటం లేదు.స్త్రీ పురుష సంబంధాల పట్ల చలం అభిప్రాయాల గురించి చర్చిస్తున్నాం,అంది శారద.చర్చల్లో లలిత అందరినీ బోల్తా కొట్టించటం ఆమెకు ఇష్టం.
స్త్రీ పురుష సంబంధం కూడా కాదు.చలం స్త్రీని అర్ధం చేసుకున్న విధానం గురించి,అంది లలిత.
అవును.మైదానంలో రాజేశ్వరి పాత్ర…రామకృష్ణ మాటలను మధ్యలోనే తుంచింది లలిత.
చలం దృష్టి పురుష దృష్టి.భౌతిక దృష్టి.ఎంత సేపూ స్త్రీ శరీరం,శరీర సౌఖ్యం గురించి తపించి పోవటం తప్ప స్త్రీ మనసు గురించిన ఆలోచన కనిపించదు.
స్త్రీ మోహం కన్న ఉత్తమమయినది,వాంచనీయమయినదీ ఏముందని ప్రశ్నిస్తాడు చలం.ఎందుకు బతుకుతున్నావు అని ప్రశ్నిస్తే ప్రేమించేందుకు,ప్రేమని వెతుక్కునేందుకు అని చెప్పగలగాలి.ఏంచేస్తున్నావు అంటే,రోజూ సంభోగిస్తున్నాను,ప్రేమిస్తున్నాను అని చెప్పగల ధీరులు కావాలి అంటాడు చలం.ఇందులో ఏదీ స్త్రీ మనసు గురించిన ఆలోచన?
రామకృష్ణ గుటకలు మింగాడు.
రాజేశ్వరి పాత్ర ఒక పురుషుడి మనసులోంచే పుడుతుంది.తనపై శ్రద్ధ చూపించిన ప్రతి మఘాడికి స్త్రీ తనని అర్పించుకోవాలని,స్త్రీని పొందటంలో ఎటువంటి బంధాలు,అడ్డంకులూ ఉండకూడదని వాంచించే పురుషుల మనసులో మాటకు రూపకల్పన రాజేశ్వరి పాత్ర.అంతే తప్ప ఇందులో స్త్రీ పట్ల సానుభూతి లేదు.పాశ్చాత్య దేశాల్లో పురుషులు ఏదో అనుభవించేస్తున్నారు.తామేదో నష్టపోతున్నారన్న వ్యక్తిగత బాధకు సమాజోద్ధరణ అన్న రంగుపులమటం,అదే ఆలోచనతో ఉన్న ఎంతోమందికి అది నచ్చటం వల్ల చలం స్త్రీ ఉద్ధరణకు నడుం కట్టేడన్న పేరు వచ్చింది.ఎందుకంటే ఆ ఉద్యమాన్ని నడిపిందీ అసంతృప్తిలో కొట్టుమిట్టాడుతున్న పురుషులే కాబట్టి.మీకింకో విషయం చెప్తా,స్త్రీ స్వేచ్చ,స్త్రీ విమిక్తి అని విమెన్స్ లిబ్ అంటూ గోల చేస్తున్న వారందరి వ్యక్తిగత జీవితాలు గమనించు.వాళ్ళలోని అసంతృప్తులకు,వాళ్ళ అక్రమ ప్రవర్తనకు సమాజోద్ధరణ,స్త్రీ విముక్తి విప్లవం వంటి రంగులు పులమటం కనిపిస్తుంది.స్త్రీ లైంగిక స్వేచ్చ వల్ల నష్ట పోయేది స్త్రీ,లాభ పడేది పురుషుడు.అంది లలిత.
డి హెచ్ లారెన్స్,అనబోయాడు రామకృష్ణ.
చదువుకోటానికి లారెన్స్ నవలలు బాగుంటాయి.అతని ధోరణి వేరు.వీలైతే బెర్ట్రాండ్ రసెల్ కూ,లారెన్స్ కూ నడుమ జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు చదవండి,అంది.
రామకృష్ణ నోరిప్పలేదు.
మీతు వీలయితే విశ్వనాథ సత్యనారాయణ రాసిన చెలియలికట్ట చదవండి.దాన్లో మీకు స్త్రీ శారీరిక సౌఖ్యం బాధ కనబడదు.స్త్రీ మనస్తత్వాన్ని అర్ధం చేసుకుని,సమాజ హృదయాన్ని అవగతం చేసుకుని,స్త్రీని ఒక మనిషిలా గౌరవించటం కనిపిస్తుంది,అంది.
వెళ్దామా?విసుగ్గా అంది మాలతి.
నువ్వు మా అన్నయ్య వివేకానంద తో వాదిస్తే వినాలనివుంది,అంది శారద.
వీళ్ళమధ్య వాదన ఏముంటుంది.వాడు నోరిప్పితే విశ్వనాథ అంటాడు.ఈవిడగారూ అలాగే వుంది,అన్నాడు రామకృష్ణ.
వాళ్ళిద్దరూ ఎవరు?అడిగింది మోనిక.
నేను,వివేకానంద,అన్నాడు రామకృష్ణ నవ్వుతూ.
అంతా నవ్వుతూ,తుళ్ళుతూ కొండ దిగ సాగారు.వారిలో కలవనిది మాలతి ఒక్కర్తే! 
 

ప్రకటనలు

వ్యాఖ్యానించండి »

ఇంకా వ్యాఖ్యలు లేవు.

RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.

%d bloggers like this: