రాతలు – కోతలు

మే 16, 2008

నేను చదివిన మంచి పుస్తకం-యఙ్నం తోటి కథలు.

Filed under: pustaka paricayamu — కస్తూరి మురళీకృష్ణ @ 6:03 ఉద.

1956-67 నడుమ మొత్తం,యఙ్నం తో కలిపి 5 కథలు రాసారు రామారావు గారు.ఇవి ఆయనకు సంతృప్తి నిచ్చిన కథలుగానే మనం పరిగణించాల్సి వస్తుంది.ఎందుకంటే అంతవరకూ రాసిన కథలు తాను రాయాలనుకునే కథలు కావని,తనకే సందిగ్ధాలుంటే పాఠకులకు తానేమి చెప్పగలనని కథలు రాయటం మానేసారని ఆయనే స్వయంగా చెప్పుకున్నారు.అందుకే మళ్ళీ కథలు రాసారంటే,ఆయన అనుకున్న కథలు రాయగలిగారనీ,ప్రజలకు తాను ఏం చెప్పాలో నిశ్చయించుకున్నారనీ అనుకోవటం తప్పు కాదు.అందుకే ఈ అయిదు కథలను మనం ప్రత్యేక దృష్టి తో చూడాల్సి వుంటుంది.యగ్ఙ్నం కథ తరువాత కాలంలోని కథలను ప్రత్యేకంగా విశ్లేశించాల్సి వుంటుంది.
తీర్పు,ఇల్లు,వథ,మహదాశీర్వచనం అనే ఇతర కథలు మామూలు కథలు.ఎటువంటి ప్రత్యేకత లేని కథలు.
తాను అనుకున్న కథలు రాయలేక పోతున్నానని కథలు రాయటం మానేసి మళ్ళీ ఇలాంటి కథలు రాయటం సందిగ్ధాన్ని కలిగిస్తుంది.ఆయన చెప్పిన కారణాలు కాక వ్యగ్తిగత కారణాలేవయినా వున్నాయేమో అనిపిస్తుంది.ఈ అప్రస్తుత మీమాసని పక్కన పెట్టి ముందుకు సాగుదాం.

యఙ్నం లాంటి కథ తెలుగు సాహిత్యంలో రాలేదన్నది నిర్వివాదాంశం.
పేదల గురించిన కథలు బోలెడన్ని వచ్చాయి.పల్లెల గురించి కథలు బోలెడన్ని వచ్చాయిపేదలపయిన ధనికులు చేసే అత్యాచారాలను చూపే కథలూ వచ్చాయి.తెలివయిన వాడు అమాయక్య్డిని మోసం చేసే కథలు కోకొల్లలు.కానీ యఙ్నం లాంటి కథ మాత్రం ఇంతవరకూ రాలేదు.అంతకుముందు లేదు.ఇకపైన రాదు.
యఙ్నం కథ గొప్ప దనం దాని ముగింపు.అనూహ్యమయిన ముగింపు అది.చదివిన పాఠకుడు అప్రతిభుడయిపోతాడు.అతడి మెదడు మొద్దుబారి పోతుంది.మనసు లోతుల్లోంచి అలవికాని వేదన అలలా విరుచుకు పడుతుంది.మానవుల జీవితాలలోని దుర్భర వేదనల తాలూకు చిత్రం మనసుకు అర్ధమయి ఒక రకమయిన విరక్తి,నిరాశ,నిస్పృహలు కలుగుతాయి.భోరుమని ఏడవాలని పిస్తుంది.సాటి మానవుడిని నిస్సహాయుడిని చేసే మానవుడిలోని,క్రౌర్యానికి వొళ్ళు జలదరిస్తుంది.
ఇదంతా మనసులో కలిగే సంచలనం.
ఒక్క సారి తొలి సారి చదవగానే కలిగిన భావావేశ తీవ్రత తగ్గిన తరువాత ఆలోచన వస్తుంది.బుద్ధి పనిచేయటం మొదలవుతుంది.అప్పుడు కథ గురించి నెమ్మదిగా ఆలోచిస్తాం.అప్పుడు కథ స్వరూపం మారి పోతుంది.రచయిత తన రచనా మాయాజాలంతో చేసిన చమత్కారాన్ని గ్రహిస్తాం.రచయిత నైపుణ్యాన్ని అభినందిస్తూనే రచయితతో విభేదిస్తాం.
యఙ్నం కథ విశ్లేషణ వొచ్చేసారి.

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.