రాతలు – కోతలు

మే 11, 2008

గ్రంథాలయాలు – నేను!

Filed under: Uncategorized — కస్తూరి మురళీకృష్ణ @ 5:24 ఉద.

గ్రేఎ మధ్య మన బ్లాగు ప్రపంచంలో గ్రంథాలయాలతో తమకున్న అనుభవాలను పంచుకోవటం చూస్తూన్నాం.నాకూ గ్రంథాలయాలతో నా అనుభవాలను పది మందితో పంచుకోవాలన్న ఆలోచన వచ్చింది.ఆ అలోచన కార్య రూపం దాల్చేందుకు ఇంత కాలం పట్టింది.అసలు లేక పోవటం కన్నా ఆలస్యమే మిన్న అనుకుని శ్రీకారం చుట్టాను.చుట్టచుట్టుకుని మెదడులో ఓ మూల దాగిన అనుభవాల చిట్టా విప్పుతున్నాను.
మ అమ్మ విపరీతంగా పుస్తకాలు చదివేది.ఆ కాలంలో వచ్చే తెలుగు,తమిళ పత్రికలన్నీ ఇంటికి వచ్చేవి.అమ్మ వంట చేస్తూ,అన్నం తింటూ ఇలా ఏమాత్రం అవకాశం దొరికినా పుస్తకాలు చదివేది.దాంతో,చదువరాకున్నా పుస్తకాలు తిరగేయటం బొమ్మలను చూడటం అలవాటయింది.బడికి వెళ్ళకముందే అమ్మ అక్షరాలు నేర్పింది.చందమామలు మా ముందు పడేసేది,అమ్మ చదువుతూంటే మేము తనని డిస్టర్బ్ చేయకుండా. 

బడిలో చేరినప్పుడు చందమామల పఠనం ఇతరులపయిన నాకు ఆధిక్యాన్నిచ్చేది.ఆ కథలు వారికి చెప్పటం ద్వారా నేను తరగతిలో ప్రత్యేకతను సాధించాను.చిన్న కథకు బోలెడంత స్వంత పైత్యాన్ని జోడించి వారాల తరబడి కొనసాగించి,వూరిస్తూ,కోపం వచ్చిన వాడిని కథ వినటం నుంచి బహిష్కరిస్తూ అధికారాన్ని కొనసగించేవాడిని.
పుస్తకాలు చదివేందుకు మరో అంశంకూదా ప్రోత్సాహాన్నిచ్చింది. మా ఇంట్లో పుస్తకాలు చదువుతూన్న వాడికి పనులు చెప్పేవారు కారు.వాడి మానాన వాడిని వదిలేసేవారు.దాంతో,చిన్న వాడినయినందున అందరూ చెప్పే చిన్న చిన్న పనులనుంచి తప్పించుకోవటానికి ఓ పుస్తకం ముందేసుకునేవాడిని.ముందు ఉంది కాబట్టి చదివేవాడిని.ఆసక్తి కరంగా వుంది  కాబట్టి కొనసాగించేవాడిని.అనీ మరచి చదివేవాడిని.దాంతో ఇంట్లో ఇప్పటికీ నేను “మెహమాన్”(అతిథి) గానే కొనసాగుతున్నాను.తరగతిలో కూడా ఎవరితో మాట్లాడక,ఆటలాడక పుస్తకాలు చదివేవాడిని.ఆ అలవాటువల్ల ఇప్పటికీ నాకు మితృలు లేరు.ఎవరితోనయినా మాట్లాడుతూంటే సమయం వ్యర్ధం చేస్తున్న భావన పీడిస్తుంది.మనసు పుస్తకం వైపు పరుగులు తీస్తుంది.
అందుకే,కాస్త వొంటరిగా బయటకు వెళ్ళే వయసు రాగానే అందరూ ఆటలకు పరుగులుతీస్తే నేను ఇంటి దగ్గరలో కొండపయిన వున్న గ్రంథాలయం వైపు పరుగులు పెట్టేవాడిని.మెట్టుగూడా గ్రంథాలయం చిన్నప్పటి నా దేవాలయం.దాని పక్కనే ఆంజనేయస్వామి గుడి వుండేది.లైబ్రరీ 4గంటలకు తెరిచేవాడు.స్కూల్ అయిపోగానే ఇంటికి వెళ్ళి సంచీ పడేసి,కొన్ని పాఠ్యపుస్తకాలు తీసుకుని గుడిలో కూచుని లైబ్రరీ తెరిచే వరకూ చదివేవాడిని.లైబ్రరీ తెరవగానే  లోపల దూరేవాడిని.కనబడ్డ ప్రతి పుస్తకం చదివేవాడిని.అనువాదాలు,చరిత్ర నవలలు,రష్యన్ నవలలు,ప్రేమ కథలు,సాహస కథలు అన్నీ చదివేవాడిని.ఒక సారి లైబ్రేరియన్ కు నేను ఉట్టిగా అన్ని పుస్తకాలు తీస్తున్నానని అనుమానం వచ్చింది.నేను చదువుతున్న పుస్తకం గురించి ప్రశ్నలు అడిగాడు.ఆ తరువాత అతనే నాకు మంచి పుస్తకాలు ఇచ్చేవాడు.శరత్ సాహిత్యాన్ని నాకు పరిచయం చేసింది అతనే.ఎండాకాలం సెలవుల్లో,పొద్దున్నే లైబ్రరీకి వెళ్ళేవాడిని.11గంటలకు లైబ్రరీ మూయగానే,గుడిలో కూచుని అమ్మకు తెలియకుండా తెచ్చిన అమ్మ చదివే నవలలు చదివేవాడిని.మళ్ళీ 4గంటలకు లైబ్రరీ తెరవగానే లైబ్రరీలో దూరేవడిని.లైబ్రరీ మూసేయగానే ఇల్లు చేరేవాడిని.ఇలా నేను 10 తరగతి పాసయేసరికి,ఆ లైబ్రరీ పని అయిపోయింది.విశ్వనాథ వారి సాహిత్యం వేయిపడగలతో సహా చదివేశాను.నా ఆసక్తి గమనించి మా తెలుగు టీచెర్ పుస్తకాలిచ్చేవాడు.పాఠ్యపుస్తకాలు ముందే చదువుకుని సంవత్సరమంతా నవలలు చదివుతూ వేరే ప్రపంచంలో తేలుతూండేవాడిని.
పదవతరగతి పరీక్షలు రాసిన తరువాత సెలవుల్లో అన్నయ్య నాకు రెండు గొప్ప విశయాలు పరిచయం చేశాడు.పాత హిందీ సినిమాలు,సికందరాబాద్ లోని గాస్మండీ లైబ్రరీ.మెట్టుగూడా కన్నా పెద్ద గ్రంథాలయం ఇది.
ఇంకేం,నాకు కంటినిండా పని.
ఇంటర్లో ఇంగ్లీష్ మీడియంలో చేరాను.దాంతో తెలుగు నవలలు తగ్గించి ఇంగ్లీష్ నవలలపయిన పడ్డాను.జేంస్ హాడ్లీ చేస్ నా మొదటి గురువు.అయితే ఈ నవలలు గ్రంథాలయాలలో వుండేవి కావు.వాటిని ప్రైవేట్ లైబ్రరీల్లోంచి అద్దెకు తెచ్చుకోవాల్సి వచ్చేది.అందుకు డబ్బులు వుండేవి కావు.దాంతో,డబ్బులున్న మితృలను కాకా పట్టి,కథలు చెప్పి వాళ్ళదగారనుంచి నవలలు తీసుకుని ఒక్క రాత్రిలో చదివి తెల్లారేసరికి ఇచ్చేసేవాడిని.నేను చదివానని వాళ్ళు నమ్మేవారుకారు.చదివినట్టు నిరూపిస్తే మళ్ళీ ఇచ్చేవారు కారు.అందుకని చదివినా అర్ధంకానట్టు నటించి,పోసులు కొడుతున్నట్టు నమ్మించి పుస్తకాలు సంపాదించేవాడిని.చదివేసేవాడిని.
ఇంటెర్ చివర్లో నాకు అశోక్ నగర్ లోని సిటీ సెంట్రల్ లైబ్రరీ పరిచయమయింది.అదో అద్భుత ప్రపంచం.రిఫరెన్స్ సెక్షన్ లోని పుస్తకాలు,ప్రిసెర్వేషన్ సెక్షన్ లోని పాత రీడెర్స్ డిజెస్ట్,టైం,ఇతర సైన్స్ పత్రికలు నావే.ఇప్పటికీ ప్రిసెర్వేషన్ సెక్షన్ లో  సెక్షన్లలొ ఒకోసారి నేను ఒక్కడినే గంటల తరబడి వుంటాను.నాకు వుద్యోగం రాగానే నేను చేసిన మొదటి పనుల్లో రీడెర్స్ డిజెస్ట్ కు,లైబ్రరీకి సభ్యత్వాలు కట్టటం వున్నాయి.
డిగ్రీలో వున్నప్పుడు నాకు ఇచ్చే పాకెట్ మనీతో లోక్లాసులో సినిమాలు చూడటం ఒక పని.సికిందరాబాద్ స్టేషన్ దగ్గర ఎస్,బి,ఎస్ అని ఒక అద్దె లైబ్రరీ వుంది.రోజుకింత అని డబ్బులు తీసుకుని పుస్తకాలు అద్దెకిచ్చేవాడు.ఒక మితృడు ఇచ్చిన ఇర్వింగ్ వాలాస్ నవల సెకండ్ లేడీ అన్ని తప్పుడు కారణాలకు నన్ను వాలేస్ వైపు ఆకర్షించింది.దాంతో ఆ లైబ్రరీలో వాలాస్ పుస్తకాలు తీసుకుని ఒక్క రాత్రిలో చదివి ఇచ్చేవాడిని.లేకపోతే అద్దె పెరుగుతుంది.అద్దెపెరిగితే చదివేందుకు మరో పుస్తకం తగ్గుతుంది.ఇలా ఒక్క రాత్రిలో చదవాల్సి రావటం వల్ల వేగంగా చదవటం అలవాటయింది.ఇప్పటికీ నా వేగం చూసి చాలా మంది నేను నటిస్తున్నాననుకుంటారు.కానీ రూపాయి విలువ ,సమయం విలువ తెలిసిన వాడిని.రెండూ వ్యర్ధం చేయను.వాలెస్ పయిన అభిప్రాయం మరటమే కాదు అతని వల్ల డి హెచ్ లారెన్స్ పరిచయం అయ్యాడు.అలా ఇంగ్లీష్ క్లాసిక్స్,కమర్షియల్సు రెండూ చదివాను.
బ్రిటీష్ లైబ్రరీలో బోలెడన్ని పుస్తకాలుంటయని ఒక మితృడు చూపించాడు.కానీ ఫీసు ఎక్కువ.లైబ్రరీ మీదుగా బస్సులోంచి వెళ్తూ ఆశగా లైబ్రరీ వైపు చూస్తూండేవాడిని.వుద్యోగం రాగానే ధైర్యం చిక్క బట్టుకుని వీలు దొరకగానే మెంబరయ్యాను.ఇప్పటికీ మెంబర్నే!
యూనివర్సిటీ లైబ్రరీ,అఫ్జల్ గంజ్ లోని పెద్ద లైబ్రరీలు నా అడ్డాలు.ఇప్పటికీ నగరంలోని అన్ని ప్రధాన గ్రంథాలయాలతో పాటు ఇంటి దగ్గరి ఆర్ఖేడ్ అద్దె లైబ్రరీలో కూడా సభ్యత్వం వుంది.
వుద్యగంలో స్థిర పడిన తరువాత అంతకాలం చదివి మళ్ళీ మళ్ళీ చదవాలనిపించిన పుస్తకాలను కొనటం ఆరంభించాను. నెమ్మదిగా ఇంట్లోనే ఒక లైబ్రరీ తయారయింది.ఇల్లు మారినప్పుడల్లా అసలు సామాన్లకొక లారీ అవసరమయితే పుస్తకాలకు రెండు లారీలవసరమయ్యేది.విసిగి స్వంత ఇల్లు కట్టాను.అయితే,బెడ్రూము లైబ్రరీలా వుందని కనీసం అక్కడయినా తన సవతి నుంచి విముక్తి కావాలని అర్ధాంగి కోరటంతో ఇంటికి మరో అంతస్తు జోడించి పుస్తకాలతో పాటూ నేనూ అక్కడికి చేరుకున్నాను.
లైబ్రరీలు ముఖ్యంగా గ్రంథాలయ సంస్థలు డబ్బుతో పని లేకుండా పుస్తకాలు చదివే వీలు కల్పించటం వల్ల ఎందరి పఠనాసక్తికో సంతృప్తి ఇస్తున్నాయి.ఇప్పటికీ రివ్యూ పుస్తకాలెన్ని వస్తున్నా, నేనెన్ని పుస్తకాలు కొంటున్నా లైబ్రరీ  ప్రత్యేకత దానిదే.లైబ్రరీలో వెళ్ళి కూర్చుంటే అదో వింత అనుభూతి,ఆనందం కలుగుతాయి.ఇప్పటికీ లైబ్రరీలలొ చర్లెస్ డికెన్స్ నవలలు,విశ్వనాథ నవలలు చూస్తే ఆ కాలంలో లాగా ఆత్రంగా తీసుకుంటాను.ఈ పుస్తకాలన్నీ ఇంట్లో వున్నాయని గుర్తుకొచ్చి నవ్వుకుంటాను.నాకు ఒకోసారి ఒక కోరిక బలంగా కలుగుతూంటుంది.లైబ్రరీలో పుస్తకం చదువుతూ చనిపోవటం కన్నా ఆనందకరమయిన చావు లేదనిపిస్తుంది.అలా అన్నప్పుడు కోపం వచ్చిన నా వాళ్ళూ ” ఆ చావేదో ఇంట్లోనే పుస్తకం చదువుతూ పోవచ్చుగా”అంటారు.అయితే,అమ్మ,నా భార్య లతో పాటూ ఈ ప్రపంచంలో నాకు ఆప్తులెవరయినా వుంటే అవి గ్రంథాలయాలే.ఎవరయినా తన ఆప్తుల నడుమ ఆనందంగా కన్ను మూయాలనుకుంటారు.నేనూ అందుకు భిన్నం కాదు.

 

ప్రకటనలు

6 వ్యాఖ్యలు »

 1. baaguMdi

  వ్యాఖ్య ద్వారా జాన్ హైడ్ కనుమూరి — మే 11, 2008 @ 6:40 ఉద. | స్పందించండి

 2. koncheam mee iMTi adress cheputaarU 🙂

  వ్యాఖ్య ద్వారా chavakiran — మే 11, 2008 @ 7:34 ఉద. | స్పందించండి

 3. koncheam mee iMTi adress cheputaarU 🙂

  వ్యాఖ్య ద్వారా chavakiran — మే 11, 2008 @ 7:36 ఉద. | స్పందించండి

 4. కనుమూరి గారు,కృతఙ్నతలు.
  చావా కిరణ్ గారు,ఇల్లు నేను నగరానికి చాలా దూరంలో కట్టాను.మీరు వస్తానంటే నిరభ్యంతరంగా ఇస్తాను.ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు ఫోను చేసి రండి. ఇక మా ఇంట్లో నా లైబ్రరీలో అడుగుపెడుతూంటేనే మీకు ఒక వాక్యం కనిపిస్తుంది.ఈ పుస్తకాలు ఇంటికి అడిగి భంగ పడకండి.ఇక్కడే చదువుకోవటానికే ఈ పుస్తకాలు. ఆ వాక్యం చదివి లోపలికి అడుగుపెడితే మరో వాక్యం కనిపిస్తుంది.నేను మితృడిని కోల్పోయేందుకు ఇష్టపడతాను కానీ పుస్తకాన్ని వదులుకోను. మీ ఏ మైల్ చూసుకోండి నా అడ్రసు ఫోను నంబరూ పంపుతున్నాను.

  వ్యాఖ్య ద్వారా కస్తూరి మురళీకృష్ణ — మే 11, 2008 @ 11:52 ఉద. | స్పందించండి

 5. 🙂

  Thanks for the invitation.

  వ్యాఖ్య ద్వారా chavakiran — మే 11, 2008 @ 12:31 సా. | స్పందించండి

 6. “అయితే,అమ్మ,నా భార్య లతో పాటూ ఈ ప్రపంచంలో నాకు ఆప్తులెవరయినా వుంటే అవి గ్రంథాలయాలే.ఎవరయినా తన ఆప్తుల నడుమ ఆనందంగా కన్ను మూయాలనుకుంటారు.నేనూ అందుకు భిన్నం కాదు.”

  ఎంత బాగా చెప్పారండీ.

  — విహారి

  వ్యాఖ్య ద్వారా విహారి — మే 11, 2008 @ 1:31 సా. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.

%d bloggers like this: