తెలుగు సాహిత్య ప్రపంచంలో ఒక పుస్తకం ప్రచురితమయినట్టు, అది మార్కెత్ లో వున్నట్టు పాఠకులకు తెలిసేందుకు సరయిన వ్యవస్థలేదన్నది జగద్విదితం.
ఏదయినా పత్రికలో సీరియల్ గా వస్తూ ప్రాచుర్యం పొందినదయినా, పేరు పొందిన రచయిత రచన అయినా ఆ పుస్తకం గురించి పాథకులకు సులభంగా తెలిసిపోతుంది.
ముళ్ళపూడి రమణ జీవిత కథ కోతి కొమ్మొచ్చి స్వాతిలో సీరియల్ గా వస్తోంది. అది పూర్తయ్యేలోగా పుస్తకం లా వస్తుంది. బహు ప్రాచుర్యం పొందిన రచన, పేరున్న రచయితా కావటంతో పుస్తకానికి ప్రచారం ఆవశ్యకత అంతగా అవసరం లేదు.
అలాగే యండమూరి, మల్లాది, పట్టాభిరాం వంటి వారి పుస్తకాలకూ ప్రచారం అవసరం పెద్దగా లేదు.
పాత రచయితలు, కవుల పుస్తకాలకూ ప్రచారం అవసరం లేదు.
మిగతా వారందరికీ ప్రచారం అవసరం వుంది. లేకపోతే వారి పుస్తకాలు అనామకంగా అఙ్నాతంలో మిగిలిపోతాయి.
అయితే, ఇలాంటి పుస్తకాలకు ప్రచారం పత్రికలలో పుస్తక సమీక్షలవల్లనే లభిస్తుంది. లేకపోతే ఎవరయినా ఆ పుస్తకం గురించి పని గట్టుకుని విమర్శ చేయాలి. దాని గురించి చర్చ జరగాలి. అప్పుడు పదిమందికీ ఆ రచన గురించి ఆసక్తి కలిగేవీలుంది.
ఇలాంటివి లేనంత కాలం కేవలం సమీక్షలే ప్రచారానికి ఆధారం.
తెలుగులో సమీక్షకూ, విమర్శకూ తేడా లేదు. సమీక్షలూ, విమర్షలూ, పరామర్షలూ అన్నీ ఒకటే.
పత్రికలు పుస్తక సమీక్షలను సీరియస్ గా భావించవు. వాటిని ప్రధానమైన అంశాంగా పరిగణించరు.
ఈనాడులో సాహిత్యానికి ప్రత్యేకమయిన పేజీ లేదు. పుస్తక పరిచయాలు, ఆదివారం అనుబంధంలో ఒక పేజీలో వుంటాయి. వున్న పేజీ ఒకటి. దాన్లో సమీక్షకు వచ్చే పుస్తకాలు వెయ్యి. అందుకే, నాలుగయిదు, లైన్లు పుస్తకం గురించి క్లుప్తంగా రాస్తారు. అవీ ప్రధానంగా ప్రముఖము, అవసరమూ అనిపించిన పుస్తకాలకే. మిగతావన్నీ స్వీకారంలో వేసేస్తారు. అవి చూసే పాఠకుడికి పుస్తకం పేరు, రచయితపేరు, వెల దొరికేచోటు వంటి విషయాలు తెలుస్తాయి. పుస్తకం గురించి ఏమీ తెలియదు.
ఆంధ్ర జ్యోతిలో ఒక పేజీ పుస్తక సమీక్షలకోసం. దాన్లోనూ ఇదే సమస్య. ఆయా పత్రికల పాలసీలను బట్టి, రచయితలకూ, ప్రచురణ కర్తలకూ పత్రికలతో వున్న అనుబంధాన్నిబట్టి వారికి కేటాయించే స్థలం వుంటుంది. మిగతావన్నీ స్వీకారస్వాహా!
వార్తలో ఆదివారం అనుబంధంలో సమీక్షలకు రెండు పేజీలుంటాయి. కానీ, ఇక్కడా ఈనాడు, జ్యోతిల పరిస్థితే.ఆంధ్రభూమిదీ ఇదే పరిస్థితి. ఒకపేజీలో ఒకటి, రెండు పుస్తకాల పరిచయాలుంటాయి.
ఆంధ్రప్రభలో పుస్తకాల పరిచయాలకు ప్రత్యేకమయిన పేజీలేదు. అప్పుడప్పుడు ఒకపేజీ వేస్తూంటారు.
సాక్షి పత్రికలో ఆదివారం అర పేజీ పుస్తక పరిచయానిది. ఒక పుస్తకం గురించి పది లైన్లురాసే వీలుంటుంది. స్వీకారమో అయిదు పుస్తకాలుంటాయి. సినిమా వారితో ఇంటర్వ్యూలంటూ, సినిమా వార్తలకు ఒకటి రెండు పేజీలయినా కేటాయించే పత్రికలకు పుస్తకాల పరిచయాలకు స్థలం ఇవ్వటం కష్టమవుతుంది.
ఈనాడు తప్ప మిగతా దినపత్రికలలో ఒకరోజు సాహిత్యానికి పూర్తి పేజీ కేటాయిస్తారు. కానీ, ఈపేజీ పాత తరం రచయితల గురించి, సిద్ధాంత చర్చలకూ వాడతారు, కొత్త పుస్తకాల కోసం ఒక పూర్తిపేజీ కేటాయించే పరిస్థితిలేదు.
వారపత్రికలలో పుస్తకాల పరిచయాలకు ఒక పేజీ వుంటుంది. ఆంధ్రభూమి వార పత్రికలో అప్పుడప్పుడూ మూడు పేజీలుకూడా పుస్తకాల పరిచయాలకు కేటాయిస్తారు. అందినవిలో వేసే పుస్తకం చిత్రం కూడా వేస్తారు. అంటే కనీసం పాఠకుడు పుస్తకాన్ని చూడగలుగుతాడన్నమాట.
నవ్యలో ఒక పేజీలో వీలయినన్ని పుస్తక పరిచయాలు చేయాలనుకోవటంవల్ల కొన్ని లైన్లే రాసేవీలుంటుంది. స్వాతిలో పుస్తకాల పరిచయాలకు తావులేదు.ఈవారం పత్రికలో పుస్తకాల పరిచయాలు రెండు మూడు పేజీలు వేస్తారు. కానీ, ఈవారం పత్రిక అంత సులభంగా దొరకదు. ఇండియా టుడే లో సమీక్షలుంటాయి. కానీ వారి ప్రామాణికాలు వేరే.
మాస పత్రికలలో స్వాతి అందినవిలా అవసరమయితే రెండు పేజీల నిండుగా పుస్తకాల వివరాలను ప్రచురిస్తుంది. ఆంధ్రభూమి మాస పత్రిక పుస్తకాల జోలికి పోదు. రచనలో పుస్తక పరిచయాలకు పేజీ పరిమితిలేదనిపిస్తుంది. మూడు నాలుగు పేజీలయినా ఒకోసారి ఒకే పుస్తకం గురించి రాస్తారు. అయితే, రచన పత్రిక దృష్టిలో వున్న రచయితలే రచయితలు కాబట్టి ఇతర రచయితల పుస్తకాల పరిచయాలు ఆ పత్రికలో రావటం కష్టమే.ఈ భూమిలో కూడా సమీక్షలకు రెండు పేజీలిస్తారు. అప్పుడప్పుడూ రచయితలతో ఇంటర్వ్యూలూ వేస్తారు.
గమనిస్తే, పుస్తకావిష్కరణ సభల ఫోటోలు వేసేందుకు అవసరమయితే అయిదారు పేజీలు కూడా పత్రికలు కేటాయిస్తాయి. కానీ, పుస్తకాల సమీక్షలకోసం మాత్రం ఒక్క పేజీ కేటాయించటమూ కష్టమే.
ఇదీ పత్రికలలో పుస్తకాల సమీక్షల పరిస్థితి. ఈ పరిస్థ్తిలో రచయిత పుస్తకాన్ని సమీక్షకు ఇచ్చి తన పుస్తక ప్రచారం చేసుకోవాలి.
ఇంగ్లీషు పుస్తకాలలో సమీక్షలకోసం పేజీలు కేటాయిస్తారు. సమీక్షలూ విమర్షల స్థాయిలో వుంటాయి. హిందూ పత్రిక అయితే మంగళ వారం వేసే పుస్తకాల సమీక్షలతో పాటూ, నెలకొక లిటెరరీ సప్లిమెంట్ తెస్తుంది. అవుట్ లుక్, వీక్, ఇండియా టుడే వంటి పత్రికలలో పుస్తక సమీక్షలకు మంచి స్థలం కేటాయిస్తారు. వారి విమర్శలు చదివితే పుస్తకం గురించి ఒక ఆలోచన వస్తుంది.
కానీ, తెలుగు పత్రికల దృష్టిలో పుస్తక సమీక్షలు వ్యాపార పరంగా అంత లాభదాయకం కావు.
అయినాసరే, పుస్తకాలను ప్రచురించిన రచయితలందరూ ఈ పరిమిత స్థలం కోసం పోటీపడతారు. అదృష్టం బాగుండి తన పుస్తక సమీక్ష సక్రమంగా, కాస్త పెద్దగా వస్తుందని ఆశిస్తాడు.
ఇక్కడే సమీక్షలలో విమర్శలలో వున్న మతలబులు రంగ ప్రవేశం చేస్తాయి.
వీటిగురించి మరోసారి.