ప్రభాకరన్ మరణించాడు. కాంగ్రెస్ రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ విజయం సాధించింది. ఐపీఎల్ లో ఆటలు ఆడుతూనేవున్నారు. అలాగే, నా బ్లాగులో పుస్తకాల ప్రచురణకు సంబంధించిన వివరాల పరంపర కొనసాగుతూనేవుంది.
పుస్తకాల ముద్రణకు ఓ ముద్రణాలయాన్ని ఎన్నుకోవాలి. తెలిసినవారెవరయినా వుంటే సరేసరి. తెలిసినవారికి తెలిసినవారున్నా సరే. లేకపోతే, మనం ఇతర పుస్తకాలలో వున్న ప్రింటర్ల పేర్లు చూసి, చిరునామాలు రాసుకుని, ఫోను నంబర్లు తీసుకుని వారిని సంప్రతించాలి.
ముందుగా ప్రింటర్లు పుస్తకం సైజు గురించి అడుగుతారు. డెమ్మీ, క్రవున్ ఇలా సైజుల పేర్లు చెప్తారు.
ఈపేర్లు కొత్తగా అనిపిస్తే బెదరకండి. మీరు ఎలాంటి పుస్తకాన్ని సిహ్టపడతారో అలాంటి దాన్ని చూపి ఇలా కావాలని నిర్మొహమాటంగా అఙ్నానాన్ని ప్రదర్శించవచ్చు. అందుకే ప్రింటర్ల దగ్గర వారు ఇంతకుముందు ప్రింటు చేసిన పుస్తకాలుంటాయి. వాటిని చూసి ఎంచుకోవచ్చు.
ఆతరువాత, వాడే కాగితం ఎలాంటిదో అడుగుతాడు. అందరూ, అధికంగా 70జీ ఎస్ ఎం కాగితాన్ని వాడతారు. మనం ఎంత ఖరీదయిన కాగితాన్ని ఎంచుకుంటే అంత ఖర్చు పెరుగుతుంది. నిజానికి పుస్తక ప్రచురణలో ఖర్చు కాగితానికి, ముద్రణకే అధికంగా అవుతుంది.
మన పుస్తకం ఎన్ని పేజీలుంటే ఖర్చు అంత ఎక్కువ అవుతుంది. ఖర్చు తగ్గించుకోవాలంటే పేజీలు తగ్గించుకోవాలి.
అసిధార నవల మొదటి డీటీపీలో 250 పేజీలదగ్గ వచ్చింది. ఖర్చు తగ్గాలంటే పేజీలు తగ్గాలి. పేజీలు తగ్గాలంటే అక్షరాల సైజును తగ్గించాలి.
మరీ చిన్న అక్షరాకుంటే చదవటం కష్టం. పెద్ద అక్షరాలుంటే ఖర్చు క్లష్టం.
అసిధార విషయంలో నా బడ్గెట్ ను దృష్టిలో వుంచుకుని అక్షరాల సైజును తగ్గించాను. 190 పేజీలకు పుస్తకం నిడివి తగ్గింది.దానివల్ల ఒక 10000 వరకూ ఖర్చు తగ్గింది. అంతర్మధనం నవల చిన్నదే. అందుకని కాస్త పెద్ద అక్షరాలుంచాను.
మనం ఎన్ని ఎక్కువ కాపీలు ముద్రిస్తే ఖర్చు అంతగా తగ్గుతుంది. అయితే, ఎక్కువ అమ్మగలిగే శక్తి వుంటే ఎక్కువ కాపీలు వేసుకోవాలి. లేని పక్షంలో తక్కువ కాపీలు వేయాలి. లేకపోతే, వాటిని దాచలేక కష్టపడాలి. అడిగిన వారికీ, అడగని వారికీ ఫ్రీ కాపీలు ఇస్తూ పుస్తకాలను చెల్లించాల్సివుంటుంది.
అసిధారను 500 కాపీలు ముద్రించాను. ఇప్పుడు కాపీలు అయిపోయాయి. మళ్ళీ ముద్రించాలంటే డబ్బు ఖర్చు. తిరిగి వస్తాయో రావో తెలియదు. కానీ, కాపీలు అయిపోయిన తరువాత ఎవరయినా కాపీలడిగితే, 1000 ముద్రించాల్సిందనిపిస్తుంది. జీవితం-జాతకం పుస్తకానిదీ ఇదే పరిస్థితి. అదే, రాజ తరంగిణి కథలు కాపీలయిపోగానే ఎమెస్కోవారు దాన్ని మరో సారి ముద్రించారు. మామూలు రచయిత తన పుస్తకాన్ని తనే ముద్రించుకోటానికీ, ప్రచురణకర్త ముద్రించటానికీ ఇదే తేడా.
అసిధార మరో ముద్రణ వేయటానికి అవసరమయ్యే డబ్బులతో, ఇంతవరకూ ముద్రించని ఇంకో పుస్తకం ముద్రించవచ్చుకదా, ఒకటే పుస్తకాన్ని మళ్ళీ ముద్రించటం ఎందుకు? అనిపిస్తుంది.
అయితే, పుస్తకాన్ని ముద్రణకు ఇచ్చేముందు అత్యంత జాగరూకతగా వ్యవహరించాల్సిన అతి ప్రధానమయిన విషయం ఒకటుంది.
అది పుస్తకం వెల నిర్ణయించటం.
ఇది రేపు.