రచ్న డీటీపీ అవుతూండగానే చేయవలసిన రెండు ముఖ్యమయిన పనులుంటాయి.
ఒకటి ముఖచిత్రం ఎలా వుండాలో నిర్ణయించుకోవటం. రెండోది ముందుమాట గురించి ఆలోచించటం.
పుస్తకానికి ముఖచిత్రం మనిషికి ముఖం వంటిది. కొందరి ముఖాలు చూడగానే వారితో మాట్లాడాలనిపిస్తుంది. ఇంకొందరి ముఖాలు చూడగానే నక్కలూ, తోడేళ్ళూ గుర్తుకు వస్తాయి. దగ్గరికి వెళ్తేనే కానీ అసలు మనిషిని గుర్తించలేము. కానీ, వారివైపు ఆకర్షితులవటంలో ప్రధాన పాత్ర వహిస్తుంది ముఖం.
పుస్తకానికి కూడా అంతే.
అందమయిన ముఖ చిత్రం పాఠకులను పుస్తకం వైపు ఆకర్షిస్తుంది. ముఖ చిత్రం భావ స్ఫోరకంగా వుండి, లోపలవున్న కథనన్న్ని ప్రతీకాత్మకంగా సూచిస్తూంటే పాఠకుడు తాను చదవబోయే అమ్షాన్ని గ్రహించగలుగుతాడు.
కానీ, మన తెలుగు పుస్తకాలలొ అధిక శాతం రచయితల పేరుమీదనే అమ్ముడు పోతాయి. యండమూరి, యద్దనపూడి, మల్లాది, ఇలా రచయితల పేరు చూసి కొనేవారే అధికం. వీరి తరువాత ప్రాచుర్యం పొందిన రచనలౌ వస్తాయి. సినిమా సంబంధిత పుస్తకాలు, వ్యక్తిత్వ వికాసాలూ ఇలా సబ్జెక్టును బట్టి కొనే పుస్తకాలివి.
కాబట్టి పుస్తకాల ముఖ చిత్రం ఆకర్షణీయంగా, భావ స్ఫోరకంగా వుండాలి.
కానీ, అనేక సందర్భాలలో ఓ అమ్మాయి బొమ్మనో, రచయిత్రి బొమ్మనో ముఖ చిత్రంగా వేస్తున్నారు. కృష్ణ శాస్త్రి, శ్రీ శ్రీ లాంటి వారి బొమ్మలు అట్ట మీద వుండటం వల్ల పుస్తకం విలువ పెరుగుతుంది.
కానీ, ఇలాంటి ఖ్యాతి లేకున్నా పుస్తకం అట్ట మీద తమ బొమ్మ వేసుకుని రచయిత్రులు, రచయితలు తమ కీర్తి కండూతిని చాటుకుంటూ, అపహాస్యం పాలవుతున్నారు.
నేను డబ్బులు పెట్టి పుస్తకం అచ్చు వేసుకుంటున్నప్పుడు నాకు నేను ప్రచారం ఇచ్చుకుంటే తప్పేమిటి? అని వాదిస్తారు వీరు. తప్పులేదు.
పుస్తకం చదివిన తరువాత పాఠకుడికి రచయితతో మాట్లాడాలనిపించాలి. రచయితను చూడాలనిపించాలి. రచయిత బొమ్మ ఎదురుగా కనబడుతూంటే ఆ కోరిక తీవ్రతరం కాదు. ఇందాకే అనుకున్నం కదా, ముఖాల ఫలితాలు వేరే వుంటాయని.
సామ్యుఎల్ జాన్సన్ అనే రచయితను కలవాలని, అతనితో మాట్లాడాలని ఉవ్విళ్ళూరుతూ ఒక మహిళ ఉత్తరం రాస్తే, దానికి ఆయ్స్న ఇచ్చిన సమాధానం dearest madam, you had better let me alone; the best part of every author is in general to be found in his book, i assure u.
కాబట్టి అట్టలమీద రచయితల బొమ్మలు వేసుకోవటం అంత సమంజసం కాదనిపిస్తుంది. కొందరు చివరి అట్ట మీద రచయిత బొమ్మ వేసి పరిచయం చేస్తారు.
ఇది కొంత నయం.
వ్యక్తిగతంగా నాకు ఇదీ ఇష్టం వుండదు. రచయిత పరిచయం అతని రచన. ఫోను వివరాలుంటే కావాలనుకున్న పాఠకుడు కలుస్తాడు. సంప్రతిస్తాడు. అంతేకానీ రచయిత ఎప్పుడు జన్మించిందీ. ఎప్పుదు పదవీ విరమణ చేఇందీ, ఏ ఉద్యోగం చేసిందీ అనవసరమనిపిస్తుంది. రచయిత ఇతర పుస్తకాల వివరాలుంటే, ఇది చదివిన పాఠకుడు ఇతర పుస్తకాలు చదివే వీలుంటుంది.
నా పుస్తకాలు మర్మయోగం ఒక్క పుస్తకం వెనుకే నా బొమ్మ, పరిచయం వుంటుంది. అది నా తొలి పుస్తకం, అచ్చయినది, ఆతరువాత నేనీ నిర్ణయం తీసుకున్నాను. రాజ తరంగిణి కథల అట్ట వెనుక నా పరిచయం చిన్నగా వుంటుంది. నా బొమ్మ వుండదు. అది ప్రచురణ అయ్యే సమయానికి నాకు కావాల్సింది చెప్పే స్థితికి చేరుకున్నాను.
నేను అచ్చు వేసుకున్న పుస్తకాలలో ఎక్కడా నా పరిచయం కానీ, బొమ్మ కానీ వుండదు. నా ఇతర పుస్తకాల వివరాలుంటాయి. అంతే.
ఇటీవలే ప్రచురితమయిన రియల్ స్టోరీ, అక్షరాంజలిలలో అదీ లేదు.
అయితే, ఇకపైన ప్రచురితమయిన ప్రతి పుస్తకంలో నా ఇతర రచనల వివరాలుండాలన్న నిబంధన విధిస్తున్నాను. తీవ్రవాదం పుస్తకంలో ఇది అమలు పరిచాము.
కొందరు ముఖ చిత్రానికి, ఏలే లక్ష్మణ్, రమణ జీవి లాంటి పేరుపొందిన చిత్రకారులతో బొమ్మ వేయిస్తారు. ఇంకొందరు బాపుతో వేయించుకుంటారు.
అయితే, ఏ పీ ఎఫ్ డబ్బులో తీసి పుస్తకాలు అచ్చువేసే రచయితలు అంతంత ముఖ చిత్రాలు వేయించుకోలేరు. వారికి ఇంటెర్నెట్ అక్షయపాత్ర.
అసిధార నవలకు ముఖ చిత్రం ఏది వేయాలని చాలా ఆలోచించాము. కవర్ డిజైన్ చేస్తున్న మహేష్ తో సరస్వతీదేవి బొమ్మ కావాలి, కానీ ఆమె సాంప్రదాయికమయిన యా కుందేందు తుషార హార ధవళా, సరస్వతి కాకూడదు. ఆధునిక, సాంప్రదాయిక సమ్మిశ్రితమయిన, పాత క్రొత్తల మేల్ కలయిక క్రొమ్మెరుంగులు జిమ్మే సరస్వతి కావాలి, అని చెప్పాను, అసిధార నవల ఆశయం అదే.
చదివే పాఠకుడి దృష్టిని బట్టి అది హిందూత్వ వాదంగానో, ప్రాచీన బూజుపట్తిన సంస్కృతిని తల కెత్తుకోవటంగానో కనిపించవచ్చు. దానికి పాథకుడి కళ్ళ ముందున్న రంగుటదాలుది బాధ్యత. కానీ రచయితగా నా ఉద్దేశ్యం ఇది.
నేను చెప్పినది విని మహేష్ నెట్ నుంచి కొన్ని సరస్వతి బొమ్మలు దౌన్ లోడ్ చేశాడు. వాటిల్లోంచి ప్రస్తుతం ముఖచిత్రం మీద వున్నదాన్ని ఎన్నుకున్నాము. దానికి అలకంకరణలు చేసింది మహేష్.
అలాగే అంతర్మధనం కవర్ కు, వ్యక్తి అంతరంగ ఘోషను సూచించే సుడిగుండాలు కావాలన్నాను. కవర్ మీద అది కనిపిస్తుంది.
జీవితం-జాతకం పుస్తకానికి, రాశుకు, కాస్మాస్ ఇలా చెప్పాను. అట్టమీద చూడవచ్చు.
ఇలా చేయటం వల్ల తక్కువ ఖర్చులో పని అయిపోతుంది. పుస్తకం ఇంప్రెసివ్ గా వుంటుంది.
అక్షరాంజలి, రియల్ స్టోరీలు, తీవ్రవాదం కవర్లన్నీ పురుషోత్తం కుమార్ రూపొందించాడు. వాతిలో నిర్ణయం ఆయనదే. ఈ మూడు పుస్తకాల అట్టలూ పలువురి ప్రశంశలు పొందుతున్నాయి.
కాబట్టి డబ్బున్నవారు, చిత్రకారుడితో బొమ్మ వేయించుకోవచ్చు, లేనివారు, నెట్ ను ఆశ్రయించవచ్చు.
మిగతాది తరువాత.