సమయం గడచిపోతోంది. కాలం గిర్రు గిర్రున తిరుగుతోంది. పనులు చేస్తూనే వున్నా చేయాల్సిన పనులు బోలెడన్ని మిగిలిపోతున్నాయి. అయినా, అర్ధరాత్రిళ్ళు ఆకాశం వైపు చూస్తూంటే, ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. ప్రపంచమెంత అందమయినది కదా అనిపిస్తుంది. కొత్త ఉత్సాహంతో మరిన్ని పనులు చేయటానికి ఉపక్రమిస్తాను.
ఈవారం వార్త ఆదివారం అనుబంధంలో హర్ భజన్ సింగ్ బ్లాగు పరిచయం వుంటుంది బ్లాగ్ స్పాట్ శీర్షికలో.
ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో సగటు మనిషి స్వగతం శీర్షికన ఈవారం ఆలోచన పుస్తకాల గురించి. ఈమధ్య కొందరు అచ్చు పుస్తకాల పనయిపోయిందని, ఇక పైన ఈబుక్స్ దే ప్రాధాన్యమనీ అంటున్నారు. అచ్చు పుస్తకాలు అదృష్యమయిపోతాయన్న భావన సగటు మనిషి మనస్సులో కలిగించిన సంచలనాలాలోచనలను ప్రతిబింబిస్తుంది సగటు మనిషి స్వగతం.
ఆంధ్రభూమి వార పత్రికలో పవర్ పాలిటిక్స్ శీర్షికలో ఈవారం ఎన్నికల ఫలితాల విశ్లేషణ వుంటుంది.
ఆంధ్రప్రభ గురువారం అనుబంధం చిత్రప్రభలో బాల సినిమాల స్క్రిప్టు రచన వొశ్లేషణ కొనసాగుతుంది.
ఈనెల విడుదలయ్యే ఈభూమిలో పాడుతా తీయగా శీర్షికన ప్రఖ్యాత గాయకుడు, తగిన గుర్తింపు పొందని మహా గాయకుడయిన మన్నాడే పరిచయం వుంటుంది. నిజానికి ఇప్పుడు మన్నాడేని కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. మన్నాడే పాడే పద్ధతిని వివరిస్తూ, అతనెందుకు అంతగా విజయం సాధించలేకపోయాడో వివరించానీ వ్యాసంలో.
కౌముడు పత్రికలోని కథాసాగర మథనం శీర్షిక గురించి నాకు మంచి స్పందన లభిస్తోంది. ఏప్రిల్ నెల లోని 90 పైగా కథలను చదివి వాటిలోంచి బాగున్న కొన్ని కథలను, ఒక ఈనెల కథనూ ఎన్నుకున్నాను. ఈ శీర్షిక కథారచయితలకే కాక, కొత్త కథల విశ్లేషణ కావటంతో విమర్శకులకూ, సంకలన కర్తలకూ ఉపయోగకరంగా వుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తీవ్రవాదం పుస్తకం, అచ్చయి, బైండయి, ముస్తాబయి వచ్చేసింది. ఇక పాథకుల కోసం ఎదురుచూస్తోంది. తెలుగులో రాజకీయాలకు సంబంధించిన పుస్తకాలు తక్కువే. ఇందియా టుడే తెలుగులో వస్తున్నాప్పుడు, తెలుగులో రాజకీయ పత్రిక నిలబడలేదని కూదా పలువురు అభిప్రాయపడారు. అయినా, తెలివయినవారు వెళ్ళేందుకు జంకే బాటలో మూర్ఖుడు పరుగిడతాడన్నట్టు, నా వంతు ప్రయత్నంగా పుస్తకాన్ని వెలువరించాను.
ఇవీ, ఈవారం నా రచనలు. చదివి, మీ అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వ్యక్త పరుస్తారని ఆసిస్తున్నాను.