రాతలు – కోతలు

మార్చి 30, 2009

హమ్మయ్యా! టెస్టు డ్రా చేసి బ్రతికించారు!

ప్రచురించిన వర్గము క్రికెట్-క్రికెట్ — కస్తూరి మురళీకృష్ణ @ 3:38 అపరాహ్నం

మొత్తానికి న్యూజీలాండులో తెస్టు సిరీసు గెలిచే అవకాశాలను సజీవంగా వుంచుకుని మన క్రికెట్ ఆటగాళ్ళు మనల్ని బ్రతికించారు.

క్రికెట్ ఒకరోజు ఆటగా, 20-20 గా రకరకాల రూపాలు ధరించినా తెస్టు మాచ్ కున్న  విలువ వేరు. అయిదు రోజుల ఆట అని బోరు అన్నా, ఆటగాడి నైపుణ్యం తెలియాలంటే టెస్టు గీటురాయిలాంటిది.

20-20 పోటీల్లో, బంతిని బౌండరీ దాటించటంలో ప్రావీణ్యం తెలుస్తుంది. వొత్తిడికి లొంగకుండా, క్రీజువద్ద ఎక్కువ సమయం గడపకుండా, లేడికి లేచిందే పరుగన్నట్టు బాటు పుచ్చుకుందే కొట్టటానికన్నట్టు ఆడగలగాలి.

ఒకరోజు పోటీలో కాస్త తీరిక దొరుకుతుంది. ప్రణాలిక ప్రకారం ఆడాలి. ఇన్నింగ్స్ ను నిలబెట్టే వీలుంటుంది. వికెట్లు త్వరగా పోయినా, నెమ్మదిగా, 50 ఓవర్లలో నిలదొక్కుకుని ఆడి జట్టుని గట్టెక్కిచ్చే వీలుంటుంది.

అయిదు రోజుల ఆట ఆటగాడి వ్యక్తిత్వానికి పరీక్షలాంటిది. 20 ఓవర్లో, 50 ఓవర్లో ఓపిక పడితే అయిపోదు. అయిదు రోజులు అదే ఏకాగ్రత, అదే పోరాట పటిమ, అదే పట్టుదల నైపుణ్యం చూపాల్సివుంటుంది. అందుకే, 20-20 ఆటలో గొప్పగా విజయం సాధించిన వారు 50-50 ఓవర్లలో అంత ప్రతిభను చూపలేరు.

50-50లో అద్భుతంగా ఆడినవారు అయిదు రోజుల ఆటలో నిలద్రొక్కుకోలేరు.  టెస్టు పోటీల్లో అద్భుతమయిన ఆట చూపేవారు ఒకరోజు పోటీలలో నిలబడలేరు.

కానీ, అన్ని ఆటలలోనూ ఆటగాడికి అవసరమయిన నైపుణ్యం ఒక్కటే. ఆటగాడు సందర్భాన్ని అనుసరించి, వేగంగా పరుగులు తీయటం, కాస్త నిలబడిన తరువాత పరుగులు తీయటము, నింపాదిగా ఆడుతూ వీలును బట్టి పరుగులు తీయటమూ చేయాలి. అంతే, ఇది అర్ధమయినవారు ఏరకమయిన ఆటలోనయినా పేరు పొందుతారు.

గౌతం గంభీర్ 20-20 నుంచి పూర్తిగా తేరుకోకముందే 50 ఓవర్ల ఆటవచ్చింది. దానికి అలవాటయ్యేలోగా తెస్టు మాచ్ వచ్చింది. అందుకే, అతడు నిరాశ కలిగించాడు. కానీ, రెండో తెస్టు రెండో ఇన్నింగ్స్ లో అతడికి ఎలా ఆడాలో అర్ధమయింది. ద్రావిడ్ మొదటి ఇన్నింగ్స్ లో ఎక్కడ ఆపాడో రెండో ఇన్నింగ్స్ అక్కడి నుంచే ఆరంభించాడు. నిజానికి ఇటువంటి సందర్భాలలో ఆడటం ద్రావిడ్ కు కొట్టినపిండి. మొదటి సారి తొందరపడి, తెండోసారి దురదృష్టం వల్ల  ద్రావిడ్ 100 పరుగులు చేయలేకపోయాడు. లక్ష్మణ్ ద్రావిడ్ తరువాత ఇలాంటి పరిస్థితిలో ఎలా ఆడాలో తెలిసినవాడు. అందుకే అతడు రెండి ఇన్నింగ్స్ లోనూ చక్కగా ఆడాడు. యువరాజ్ సింగ్ కు ఇది తప్పనిసరిగా ఆడాల్సిన పరిస్థితి. ఆడాడు. సెహవాగ్ అలవాటయిన రీతిలో ఆడాడు. కానీ, పరిస్థితికి తగ్గట్టు ఆడలేదు. సచిన్ ఎలా ఆడినా అద్భుతమే.

అయితే, మనవాళ్ళు ఆటను డ్రా చేయటం వల్ల మనం బ్రతికి పోయాం. లేకపోతే, టీవీ చానళ్ళలో మిడి మిడి ఙ్నానపు యాంకర్లు గొప్ప గొప్ప ఆటగాళ్ళను పనికిరాని వారిలా దూశించి, అవమానపరచటం ఒక వారంపాటు భరించాల్సి వచ్చేది. బ్యాటు పుచ్చుకోవటం సరిగ్గా తెలియని విశ్లేషకులంతా చానళ్ళలో వచ్చేసి ఆటగాళ్ళపైన అక్కసు ప్రకటించటం చూడాల్సివచ్చేది. పత్రికలన్నీ ఆటగాళ్ళని తిట్టేవి.

ఒక వారం క్రితం ఈ ఆటగాళ్ళనే, ఈ చానళ్ళు, ఈ పత్రికలు పొగిడాయి. ఆకాశానికి ఎత్తేశాయి. మొదటి ఇన్నింగ్స్లో చతికిలబడగానే, మన వాళ్ళు ప్రాక్టీసు బదులు ఎంజాయ్ చేశారని పదే పదే దూషించాయి. అసలు మనవాళ్ళకు ఆట రానట్టే చర్చలు జరిగాయి.

ఒక తెలుగు చానల్లో ఇంకా బొడ్డూడని వార్తగత్తె మన ఆటగాళ్ళు జిడ్డు ఆట చూపారని తన అమూల్యమయిన అభిప్రాయం ప్రకటించింది. నిజానికి వార్తగత్తెల వ్యాఖ్యలు స్క్రిప్తు రయిటర్లు రాస్తారు. అంటే, ఆట సమయమూ సందర్భమూ కూడా తెలియని స్క్రిప్టు రచయితలు, తిట్టి గొప్పగా భావించుకునే న్యూనతా భావం తో సతమతమయ్యేవారూ మనకు వార్తలూ విశ్లేషణలూ అందించి మన అభిప్రాయాలను ప్రభావితం చేస్తున్నారన్నమాట. ఈ చానళ్ళే ఒక రోజు ముందు మనవారు అనవసరమయిన షాట్లు కొట్టబోయి అవుటయ్యారని తిట్టాయి. తెల్లారేసరికి జిడ్డూఅట చూపారని హేళన చేస్తున్నాయి.కొందరు ఎక్స్పర్టులయితే, ధోనీ లేకపోటంవల్ల ఆటగాళ్ళు ఆడలేకపోతున్నారని అన్నారు. సచిన్, ద్రావిడ్ లాంటి ఆటగాళ్ళు ధోనీ లేకపోతే ఆడలేరన్నమాట!

ఆట గురించి, ఆటలో మెళకువల గురించి తెలియని వారు, సమయమూ సందర్భమూ గ్రహించనివారు మన చానళ్ళలో నిండి వున్నారు. అందుకే ఆటను డ్రా చేసి మన ఆటగాళ్ళు మనల్ని బ్రతికించారు. లేకపోతే ఈ పాటికి టీవీలనిండా, పత్రికలనిండా, మన ఆటగాళ్ళ పైన విమర్షలుండేవి. సచిన్, ద్రావిడ్, లక్ష్మణ్ ల కన్నా ఆట ఎక్కువగా తెలిసినట్టు ప్రతివాడూ వ్యాఖ్యానించేవాడు. ఆట డ్రా అవటంవల్ల మనమీ దుస్థితినుంచి తప్పించుకున్నాము. అందుకు మనము ఆటగాళ్ళకు కృతఙ్నలమయివుండాలి.

అందుకే డ్రా చేసి మనల్ని బ్రతికించారు మన ఆటగాళ్ళు.

మార్చి 29, 2009

ఈ వారం నా రచనలు-4

ఎప్పటిలాగే, ఈ ఆదివారం విడుదలయ్యే వార్త ఆదివారం అనుబంధంలో బ్లాగ్ స్పాట్ వుంటుంది. ఈ శీర్షికన ఈసారి, రాబిన్ శర్మ బ్లాగు పరిచయం చేశాను. ది మాంక్ హూ సోల్డ్ ఫెరారి, హూ విల్ క్రయ్ వెన్ యూ డయ్ లాంటి హిట్ వ్యక్తిత్వ వికాస పుస్తకాల రచయిత అతడు.

క్రితం ఆదివారం ఆంధ్రప్రభ  ఆదివారం అనుబంధం పూర్తిగా ఉగాది ప్రత్యేకం కావటంతో మామూలుగావుండే శీర్షికలు లేవు. దాంతో, క్రితం వారం రావాల్సిన భయాలు ఈవారం వస్తాయి.

ఆంధ్రభూమి వార పత్రికలోని పవర్ పాలిటిక్స్ శీర్షికన, ప్రస్తుతం జరగబోయే లోక సభ ఎన్నికల కోసం వివిధ పార్టీలలో జరుగుతున్న పొత్తుల ఆరాటాలు, వేర్పడే కసరత్తుల గురించి విశ్లేషణ వుంటుంది.  ఈసారి పార్టీలకు వచ్చే సీట్లకన్నా, ప్రధాని పదవిపైన ఆశవున్న అభ్యర్ధులే ఎక్కువగా వున్నారు.

ఈభూమి అని ఒక కొత్త పత్రిక వస్తోంది. ఈ పత్రికలో అనుకోకుండా ఒక శీర్షిక ఆరంభించాల్సివచ్చింది. రసమయి అనే మాస పత్రికలో నేను హిందీ గేయ రచయితల గేయాలను, వారు చూపిన చమత్కారాలనూ విశ్లేషిస్తూన్నాను. ఆ పత్రిక ఈ ఏప్రిల్ సంచికతో ఆగిపోతోంది. ఇప్పుడు అదే శీర్షికను ఈ భూమి పత్రికలో ఆప్రిల్ సంచిక నుంచీ ఆరంభిస్తున్నాను. రసమయిలో రచనకీ, ఈభూమి శీర్షికకూ తేడా వుంది.

రసమయి సాంస్కృతిక పత్రిక. కాబట్టి, కాస్త లోతుగా విశ్లేషించేవీలుంది. పైగా, పాఠకులంతా ఉచ్చస్థాయి కళాకారులు, ఉత్తమాభిరుచి వున్నవారు. అందుకని, కాస్త స్కాలర్లీ విశ్లేషణకు వీలుండేది.

ఈ భూమి పాఠకులను కేవలం స్కాలర్లీ అనలేము. రసమయిలాగా, ఇది రీసెర్చ్ రచనల పత్రిక కాదు. కాబట్టి, సినీ సంగీత కళాకారుల పరిచయం రసమయిలోలాగా, తీరికగా, నెలలల తరబడి చేసేవీలు లేదు. ఒకో నెలా ఒకరి పరిచయం అయిపోవాల్సిందే.

మొదటగా సాహిర్ లూధియానవీ పరిచయంతో ఆరంభించాను. సాహిర్ గురించి, సినీ గీతాలలో ఆయన పొందుపరచిన అయద్భుతమయిన భావాలగురించి ఎంత రాసినా తనివితీరదు. అయినా, పత్రిక పరిమితుల దృష్ట్యా ఒక్క సంచికతో సాహిర్ పరిచయాన్ని ముగించాను.

ఈనెల దివ్యధాత్రి మాస పత్రికలో ద్రష్ట సీరియల్ కొత్త మలుపు తిరుగుతంది. వారణాసి లోని స్వర్ణ శివ మందిరం పైన తురుష్కుల దాడికి రంగం సిద్ధమవుతుంది.

దివ్య ధాత్రిలోనే, దివ్య వ్యక్తిత్వాల శీర్షికన కుంభకర్ణుడి వ్యక్తిత్వ విశ్లేషణ వుంటుంది. కుంభకర్ణుడి రాక్షసత్వం నీడన మరుగునపదిన అతని మంచితనం గూర్చి వివరణ వుంటుంది.

ఆంధ్రభూమి దినపత్రిక గురువారం చిత్రభూమి అనే అనుబంధం వుంటుంది. సినెమా సిత్రాలు అనే శీర్షికన, ఈవారం కూడా కామెడీ సినిమా స్క్రిప్టుల గ్రించిన చర్చ కొనసాగుతుంది. 

కౌముది మాస పత్రికలో కథాసాగరమధనం శీర్షికన జనవరీ- ఫిబ్రవరీ నెలలలో వివిధ వార, దిన, మాస పత్రికలలో ప్రచురితమయిన కథలలోంచి నాకు నచ్చిన కథల పరిచయంవుంటుంది. వాటిల్లోంచి నాకు అత్యుత్తమంగా అనిపించిన కథను అందిస్తున్నాను. మీరూ నా అభిప్రాయాన్ని, కథను చదివి ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వెల్లడించవచ్చు. ఆరోగ్యకరమయిన చర్చ జరగాలన్నది నా కోరిక.

ఇవీ ఈవారం నా రచనలు. చదివి మీ అభిప్రాయాన్ని  నిర్మొహమాటంగా వ్యక్త పరుస్తారని ఆశిస్తున్నాను.

మార్చి 27, 2009

ప్రేమ సినిమా చూశాడు, బ్రహ్మబుధ్!

ప్రచురించిన వర్గము sinemaa vishleashaNaa. — కస్తూరి మురళీకృష్ణ @ 2:58 అపరాహ్నం

భళ్ళున మెదడు తలుపు తన్ని, లోపలకు దూకాడు బ్రహ్మబుధ్!

ఈమధ్య కాలంలో బ్రహ్మబుధ్ ఎందుకో రావటంలేదు. ముఖ్యంగా మురికివాడల కుక్క సినిమా చూసినప్పటినుంచీ ఏవో ఆలోచనల్లోపడ్డాడు. వాడిని వదలి నేను అరుంధతిని చూసిన తరువాత పెద్ద గొడవ చేశాడు.

బ్రహ్మబుధ్ నోరు నేను నొక్కేస్తున్నానట. వాడి అభిప్రాయం ప్రజల వద్దకు చేరకుండా, పత్రికలలో ఇజాల సబ్ ఎడిటర్లలా సెన్సార్ చేస్తున్నానట. తన అభిప్రాయానికి వ్యతిరేక అభిప్రాయపు నోరు నొక్కటం మీ మానవుల లక్షణం అని దూషించి వెళ్ళిపోయాడు.

అపార్ధం చేసుకుంటే చేసుకున్నాడు, నన్ను వదలి పోయాడు అదే చాలు అని నవ గ్రహాలలో బుధ గ్రహానికి తిలలు, పెసలు, నూనెలు అర్పించి అర్చించి గ్రహ శాంతి చేశానని శాంతంగా వున్నాను. ఇప్పుడు హఠాతుగా వూడి పడి నన్ను ఉలిక్కిపడేట్టు చేశాడు.

ఇంతకాలానికి కనిపించినందుకు సంతోషించాలో, మళ్ళీ వచ్చినందుకు ఏడవాలో తెలియక ఓ వెర్రి నవ్వు నవ్వాను.

వాడది పట్టించుకోలేదు.

నాకు మరెవరి మెదడులోకీ ప్రవేశం కుదరటంలేదు. చచ్చినట్టు మనిద్దరం కలసి పని చేయాల్సిందే. నా అభిప్రాయాలను నువ్వు బ్లాగ్లోకానికి అందివ్వాల్సిందే. ఈ విషయంలో నీకు ఎలాంటి చాయిస్ లేదు, అని తిష్టవేసి కూచున్నాడు.

సరే చెప్పు నాయనా, ఈ సారి ఏ సినిమా చూశావు? నీరసంగా అడిగా.

అది నువ్వు చెప్పాలి. నేను కథ చెప్తా, అన్నాడు.

సరే, అన్నాను.

కాలేజీ పిల్లలు, అన్నాడు.

హ్యాపీ డేస్ అన్నాను

తల అడ్డగ్మా త్ ఇప్పాడు.

అన్నీ కాలేజీ పిల్లల ప్రేమ కథలే. ఈ క్లూ సరిపోదు, అన్నాను.

కాలేజీ పిల్లల ప్రేమ కథ. మంచి మితృలు.

కుచ్ కుచ్ హోతా హై.

కోపంగా చూశాడు.

వాళ్ళిదారూ ఫ్రెండ్స్. తమ మధ్య ప్రేమ వున్నాట్టు వాళ్ళ్కు తెలియదు.

కుచ్ కుచ్ హోతా హై. మైనే ప్యార్ కియా లో ఫ్రెండ్స్ టోపీ పెట్టుకుని ప్రేమించేసినప్పటినుంచీ, సినిమా వాళ్ళు యువకులందరికీ అదే టోపీ పెడుతున్నారు, అంటూ ఏదో చెప్తూన్న నేను వాడు ఉరిమి చూసేసరికి, బెదిరి నోరు మూశాను.

ఇద్దరూ ఫ్రెండ్స్. కానీ ప్రేమ ఉన్నట్టు వాళ్ళకు తెలియదు. ఇద్దరూ వేరే వాళ్ళ వెంట పడతారు. చివరికి తమ తప్పు గ్రహించి ఒకటయి పోతారు.

తల పట్టుకున్నాను. సినిమా పేరు చెప్పటమంటే సులభమనుకున్నాను. కానీ వాడు చెప్పిన కథ ఎన్నెన్నో సినిమాల కథ. చివరికి బొమ్మరిల్లులో కూడా నాయిక కాలేజీ పిల్ల, ఇద్దరూ ఫ్రెండ్స్. వాడికి వేరే ఆమెతో పెళ్ళి స్థిరమవుతుంది. అప్పుడు ప్రేమను గ్రహిస్తారు.

బాబూ మా సినిమాలకు కథలన్నీ కొద్ది తేడాలతో ఒకటే. సినిమాను గుర్తుపట్టాలంటే, ఏదయిన హిట్ పాటనో, నాయికా నాయకుల పేర్లో చెప్పాలి. ఎందుకంటే, ఇప్పుడు నువ్వు చెప్పిన పిట్టకథ అటు మైహూనాలో వుంది, ఇటు హాపీ డేయ్స్ లోనూ వుంది. ఫ్రెండులా కనబడిన అమ్మాయి డ్రెస్ మార్చుకోగానే అమ్మాయని గుర్తించటమూ వుంది. ఇలా నువ్వు కథ చెప్పి సినిమా గుర్తించంటే కష్టం, అన్నాను ఓటమినొప్పుకుంటూ.

పక పక నవ్వాడు. నేనూ కాలేజీలో చేరుతున్నాను. అమ్మాయిలందరితో ఫ్రెండ్షిప్ చేస్తాను. ప్రేమిస్తాను, అని ఎగరసాగాడు.

ఒరేబాబూ, ఇతర దేశాల సినిమాలలో ఆ దేశాల జీవన విధానం కనిపిస్తుంది. మా సినిమాలను మా జీవన విధానం అనుసరిస్తుంది. అవి చూసి మోసపోకు. అమ్మాయిలు నువ్వు కాలేజీలో అడుగుపెట్టగానే ప్రేమించేయటానికి సిద్ధంగా వుంటారని పొరబడకు. భంగ పడకు, అని ఏవేవో నీతులు చెప్తూంటే, అడ్డుపడ్డాడు.

పర్ పప్పు కాంట్ దాన్స్ సాల అంటూ, గిర గిర తిరుగుతూ, నన్ను తిప్పుతూ, దిరకిట్ తానా దిరకిట్ తానా దిరదిరకిట్ తానా, నేనూ కాలేజీకి వెళ్తున్నా తానా, ఫ్రెండ్షిప్ ప్రేమా చేస్తున్న తానా, తానా తానా త్రికిట గిరికిట గిరికిట తానా, అని తిప్పుతూ పాడుతూన్నాడు.

నేను తిరిగి తిరిగి పడిపోయా!

తరువాతి కాగితం »

WordPress.com లో Blog పెట్టుము.