నవ్య వార పత్రిక వారు గత సంవత్సరం దీపావళి ప్రత్యేక సంచిక సంచికలో నా కథ, కన్నీటి చుక్క, ను ప్రచురించారు. ఆ కథను కథా సెంటెనరీ బ్లాగులో పొందుపరచారు. అక్కడ ఆ కథను చదవవచ్చు. అదిచదివి మీ అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా తెలియచేయాలని ప్రార్ధన.
ఫిబ్రవరి 21, 2009
ఫిబ్రవరి 19, 2009
నా బ్లాగుకు సెలవలు!
నా బ్లాగుకు సెలవలు వచ్చేశాయి. నేను, పద్మ సోమవారము నుంచి మళ్ళీ వచ్చే సోమవారం వరకు ఊళ్ళు తిరుగుతాము. అందుకని నా బ్లాగుకు తప్పని సరి పరిస్థితులలో సెలవులివ్వాల్సివస్తోంది.
సోమవారం రాత్రి బయలు దేరి మరుసటి రోజు హోస్పేట చేరతాము. తెలుగు తేజానికి, భారతీయ ధర్మ రక్షణకు ప్రతీక, వైరులకు మృత్యువు దరి అయిన హంపి ని దర్శించుకుంటాము. హంపీ నగరాన్ని పాడు చేయటానికి తురకల సేనలకు ఆరునెలలు పట్టింది. ఏక దీక్షగా, అదే పనిగా, పునాదులతో సహా సర్వం పెకిలించినా, గత వైభవ చిహ్నాలనేకం ఇంకా మిగిలి వున్నాయంటేనే మన వారి గొప్పతనాన్ని అర్ధం చేసుకోవచ్చు.
ప్రస్తుతం, దివ్య ధాత్రి అనే మాస పత్రిక ( ఋషి పీఠం వారిదే ఇంకో పత్రిక ఇది) లో ద్రష్ట అనే సీరియల్ రాస్తున్నాను. మధ్య యుగంలో, మాలిక్ కాఫుర్ అనే తురకల సేనా నాయకుడు దక్షిణ భారతం పైకి దండెత్తి వచ్చాడు. దక్షిణ భారతంలో అడుగిడిన తొలి మహమ్మదీయ సైన్యాధికారి ఇతడు. మధురై వరకు గెలిచాడు. అడుగిడిన చోటల్లా మారణ హోమం సృష్టించాడు. బృహదీశ్వరాలయం పై దాడి చేశాడు. మధుర మీనాక్షి ఆలయాన్ని కొల్లగొట్టాడు. శ్రీరంగంలో అకాండ తాండవం చేశాడు. చిదంబరం మందిరాన్ని పునాదులతో సహా పెకిలించివేసాడు.( ఇప్పుదు మనము చూస్తున్న మందిరం పురర్ణిర్మాణం తరువాతది). ఆ మాలిక్ కాఫుర్ దండ యాత్ర ఫలితంగా భారతీయ మనస్తత్వంలో, సాంఘిక జీవన విధానంలో చెలరేగిన అల్లకల్లోలాన్ని, దానికి మన సమాజ ప్రతిస్పందననూ వర్ణించటం నవల ప్రధానాంశం.
హంపీ లో శిథిలాలను చూస్తూ, జరిగినది ఊహిస్తే, నా రచన మరింత శక్తివంతమవుతుందని ఆశ.
హంపీ నుంచి బయలు దేరి ఉడిపి చేరతాము. ఉడిపి కేంద్రంగా, గోకర్ణం, హోర్నెడు, మురుడేశ్వర్, మూకాంబిక, సుబర్మణ్యం, నవ బృందావనం శ్రంగేరి లను దర్శించాలని పథకం.
ఉడిపి నుంచి, మంగళూరు, అటు నుంచి బెంగళోరు వచ్చి కర్ణూలు చేరాలి. ఒకటవ తారీఖు సాయంత్రం కర్నూలు లో ఒక ఉపన్యాసం ఇవ్వాలి. ఆరోజు రాత్రి కర్నూలు లో రైలెక్కి మరుసటి రోజు తెల్లారికల్లా సికందరాబాదు చేరాలి. అదే రోజు ఆఫీసుకి వెళ్ళాలి.
ఇదీ మా పర్యటన పథకం. బ్లాగరులెవరికయినా, ఇంకా ఈ స్థలాలలో చూడదగ్గ ప్రదేశాల గురించి తెలిస్తే వివరాలందిస్తే వీలుంటే వాటిని సందర్శిస్తాము. ఈసారి కుదరకపోతే మరో సారి చూస్తాము.
మేము సాధారణంగా, మూడు నెలలకోసారి ఏదయిన ఓ చూటికి వెళ్తూంటాము. నాందేడ్ మా ఆ పర్యటనలకు భంగం కలిగించింది. ఇప్పుడు మళ్ళీ మా పర్యటనలను పునః ప్రారమభిస్తున్నాము.
అయితే, ఫిబ్రవరిలో మాత్రం తప్పనిసరిగా వెళ్తాము. దీనికి మేమిద్దరమూ పెళ్ళి అప్పుడు చేసుకున్న ఒక నిర్ణయం కారణం.
ప్రతి సంవత్సరం, మా పెళ్ళి రోజును ఇలా పర్యటనలలో గడపాలన్నది, మేము, మా మొదటి హానీమూన్ లో తీసుకున్న నిర్ణయం. ఇప్పుడు మేము వెళ్తున్నది మా పదహారో ప్రేమ యాత్ర. ఈ వంకన, ఒక వారంపాటు, అందరికీ, అన్నిటికీ దూరంగా గడుపుతాము. బోలెడన్ని అనుభవాలు, ఙ్నాపకాలూ మూటకట్టుకుని వస్తాము.
వారం పాటు వుండను కాబట్టి, ఈ వారమే వచ్చేవారం ఇవ్వల్సిన రాతలన్నీ రాసి ఇచ్చేయాలి. నాకు, శీర్షికలకు ఒక్కవారమయినా break ఇవ్వటం నచ్చదు. break ఇస్తే ఇక ఆ శీర్షిక ఆగిపోతుంది. మళ్ళీ రాయాలనిపించదు. అందుకని, రెండు వారాలకు సరిపడ ఇచ్చివెళ్తాను. అవన్నీ రాయాలి కాబట్టి, వెళ్ళేది సోమవారమయినా ముందే సెలవులు ప్రకటించేస్తున్నాను. ఈలోగా ఏదయినా వీలయితే, బ్లాగుతాను. లేకపోతే సెలవులే!
చివరగా, పది రోజులు బ్లాగులు చూసే వీలు లేదు కాబట్టి, పదకొండో రోజు బ్లాగులు తెరిచేసరికి అన్నీ కళకళలాడుతూండాలని, ఆలోచనలతో, అనుభవాలతో, అభిప్రాయాలతో, ఆరోగ్యకరమయిన వాదనలతో, ఆనందకరమయిన అనుభూతులతో కనిపించాలని కోరుకుంటున్నాను.
సెలవు పుచ్చుకునేముందు మరోమాట, ఇది అందరికీ తెలిసినదే, an eye for an eye makes the world blind. కాబట్టి, దెబ్బకు దెబ్బలు, పగలు ప్రతీకారాలు వీలయినంత వరకూ వదిలేద్దాం. హాయిగా, మంచి విషయాలతో బ్లాగు ప్రపంచంలో ఆలోచనల రంగవల్లులు తీర్చి దిద్దుదాము.
exercising utmost restraint under extreme provocation is the hallmark of great men అంటారు. కాబట్టి, రెచ్చగొడితే రెచ్చిపోవటం, నన్ను అన్నారు కాబట్టి నేననంటాను అన్నట్టు కాక, విద్యావంతులమూ, విచక్షణ ఉన్నవారమూగా బ్లాగ్లోకాన్ని ఉన్నతమయిన భావనల మయం చేద్దాం. సుందరమయిన అనుభూతులను కలసి పంచుకుందాం. మనమతా ఒకటి. మనకు గ్రూపులులేవు. ముఠాలు లేవు. కలసి వుండే నాలుగు ఘడియలు, వ్యంగ్యాలు, విద్వేషాలలో గడపేబదులు, అవగాహనతో, సమన్వయం సాధిస్తూ ప్రశాంతంగా గడుపుదాము. బ్లాగుని భలే అందమయిన అనుభవంలా మిగులుద్దాము.
ఆనో భద్రాః క్రతవో యంతు విశ్వతః!
let noble thoughts come from all sides.
ఫిబ్రవరి 17, 2009
ఎవ్వరో, ఎందుకీరీతి సాధింతురో!
నవగ్రహ పూజా మహిమ అని ఒక పాత సినిమావుంది. దానిలో ఒక చక్కటి పాటవుంది. బాణీ, హిందీలో ఓపీ నయ్యర్ సంగీత్ దర్శకత్వం వహించిన ఫిర్ వహీ దిల్ లాయాహూ అనే సినిమాలోని, నాదినీ బడ రంగీహై వాదా తెరా అనేపాట బాణీ.
తెలుగులో ఈ పాట, ఎవ్వరో, ఎందుకీరీతి సాధింతురో, ఎవ్వరో ఏల పగబూని బాధింతురో, కాదు తలవ్రాతయో, దేవతలకోపమో, కాదు ఇది మానవుని మోసమో!, అనేపాట అది.
ఈమధ్య మన తెలుగు బ్లాగులు చూస్తూంటే ఈపాట బాగా గుర్తుకువస్తోంది. ఎందుకో తెలియదు కానీ, బ్లాగుల్లో రాతలు మారిపోయాయి. రాతల ధోరణి మారిపోయింది. అలాగే, వ్యాఖ్యలు మారిపోయాయి. వ్యాఖ్యల తీరు మారింది.
ఇలాంటి సమయంలో, బ్లాగు రాయటం ఒక ఎత్తయితే, వ్యాఖ్యలను manage చేయటం ఒక ఎత్తు.
వ్యాఖ్యల విషయంలో ఎలా వ్యవహరించాలో, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో కొందరు బ్లాగుల్లో చెప్పారు. వ్యాఖ్యలను నచ్చకపోతే ఆమోదించవద్దని చెప్పారు. ఇంకొందరయితే, వ్యాఖ్యలపైనే నిషేధం విధించారు.
నామటుకు నాకు ఇలా చేయటం నచ్చటంలేదు. మనం, ఒక వ్యాఖ్యను తొలగించినా, వ్యాఖ్యలనే నిషేధించినా, ఆ వ్యాఖ్యాతల విజయాన్ని సూచిస్తుందది. ఎందుకంటే, వ్యాఖ్యలు రాసే వ్యక్తి ఉద్దేశ్యం ఆ వ్యాఖ్యలవల్ల మనకు తెలుస్తోంది. మనల్ని బాధ పెట్టాలనో, చులకన చేయాలనో అలాంటి వ్యాఖ్యలు రాస్తారు. ఆ వ్యాఖ్యలను నిషేధించటం, తొలగించటం వల్ల మనము వారి వ్యాఖ్యలకు స్పందించినట్టు అవుతుంది. వాటి ప్రభావాన్ని ఆమోదించినట్టవుతుంది.
అలాకాక, వ్యాఖ్యలకు స్పందిస్తే, ఆ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఇచ్చినట్టవుతుంది. వాటికి లేని ప్రామాణికతను ఆపాదించినట్టవుతుంది.పైగా, అలాంటి వాటికి స్పందిస్తే మాటలు పెరుగుతాయి. వాదన పెరుగుతుంది. మనసులు బాధపడతాయి. కాబట్టి, అలాంటి వ్యాఖ్యలను ఆమోదించి వదిలేయాలి. వాటిని పట్టించుకోకూడదు.
వ్యాఖ్యను తొలగిస్తే, వ్యాఖ్య వేసినవారికి కోపం వస్తుంది. దాంతో తొలగించిన వ్యాఖ్య పదిమందికీ తెలియచేయాలన్న పట్టుదల పెరుగుతుంది. వ్యాఖ్య తొలగించిన వారిని బాధపెట్టాలన్న కసి కలుగుతుంది. కాబట్టి, వ్యాఖ్యలను స్వీకరించి వదిలేయాలి. అందువల్ల వ్యాఖ్యానించిన వారికి అహంత్రుప్తి కలుగుతుంది.
ఇక్కడో విషయం గుర్తుంచుకోవాలి. ఎదుటి వాడు మనల్ని వెధవ అన్నాడనుకుందాం. దానికి ప్రతిగా మనం, నువ్వే వెధవ అన్నా వాదన చెలరేగుతుంది. నేను వెధవను కానూ, అన్నా వాదన పెరుగుతుంది.
మనము ఏమిటో మనకు తెలుసు. మనం తెలిసిన వారికి తెలుసు. ఒకడు వెధవ అన్నంత మాత్రాన మనము వెధవలము కామనీ మనకు తెలుసు. మనము వెధవలము కామని మనము తెలిసిన వారికి నిరూపించాల్సిన అవసరము లేదనీ తెలుసు. అయినా, మనము వ్యాఖ్యకు స్పందించి, ఏదో నిరూపించాలని ప్రయత్నిస్తున్నామంటే, ఎక్కడో , మనసు మూలలో, మనము వెధవలమేమో అన్న అనుమానం వుందన్న మాట. అందుకే, ఎదుటి వాడు వెధవ అనగానే భుజాలు తడుముకుని స్పందిస్తున్నామన్నమాట. ఇది మనపైన మన ఆత్మ విశ్వాస రాహిత్యాన్ని సూచిస్తుంది. ఎందుకంటే, మనమెవరో మనకు తెలుసు. మనవారికి తెలుసు. కాబట్టి అలాంటి వాటికి స్పందించకపోవటమే ఉత్తమం. ఆ వ్యవహారం అక్కడితో ఆగిపోతుంది.
అలాంటి వ్యాఖ్యలను ఆమోదించటం వల్ల పదిమందికీ వారెలాంటి వారో తెలుస్తుంది. మనము ఏమీ చెప్పకున్నా నిజానిజాలు అందరూ గ్రహిస్తారు. గ్రహించనివారికి ఎంత చెప్పినా లాభంలేదు.
ఇలాంటి వాటికి స్పందించి, వాదించటంవల్ల మనము బాధపడటమేకాక, మన స్నేహితులనుకూడా line of fire లోకి తెచ్చినవారిమి అవుతాము. వాదనకానీ, చర్చ కానీ సమవుజ్జీలనడుమ జరుగుతుంది. ఇలాంటి వ్యాఖ్యలవారితో వాదనకు దిగటమంటే వారి స్థాయికి మనము దిగటమే అన్నమాట.
చప్పట్లకు రెండుచేతులు కావాలి. మనమెందుకు రెండోచేయి ఇవ్వాలి?
మరొక విషయం, ఈ మధ్య బ్లాగుల్లో, కొందరు గొడవను సమసిపోనీయక వ్యంగ్య విసుర్లూ, హేళనలూ, వెక్కిరింతల రాతలు రాస్తున్నారు. అది వారి బ్లాగు వారి ఇష్టం.
వృధా చేసే సమయం వున్నవారిని వృధా చేసుకోనీయండి. మన సమయాన్ని మనకు నచ్చిన రీతిలో గడుపుదాము.
అయినా, బాధపడకుండా వుండలేమనిపిస్తే, నవగ్రహ పూజామహిమలో పాటను పాడుకోండి. అంతేకానీ బ్లాగటం మానకండి.
ద్వేషించేకూటమిలోనా నిలచీ, ప్రేమించే మనిషే కదా మనిషీ అంటారు. మనము మనుషులము. మనుషుల్లానేవుందాము!