అసిధార నవల బ్లాగర్లకు తెలుసు. కొందరు ఆ పుస్తకాన్ని కొన్నారు కూడా. ఆ పుస్తకం పై బ్లాగర్ల అభిప్రాయమయితే తెలియదు కానీ, ఇప్పుడు అసిధార కన్నడము లోకి అనువాదమవుతోంది.
సంక్రాంతి రోజు ఉదయము ఒక ఫోను వచ్చింది. ఫోను చేసింది, ఉథ్థాన అనే కన్నడ మాస పత్రిక సంపాదకుడు, శ్రీ రామస్వామి గారు. ఆయనతో నాకు గతంలో పరిచయం ఉత్తరాలవరకే. అసిధార ప్రచురితమయిన కొత్తలో, కోవెల సుప్రసన్నాచార్యులుగారు వార్తలో అసిధారను సమీక్షించారు. ఆ సమీక్ష చదివి కాపీ కొన్నారు, రామ స్వామి గారు, డబ్బులు పంపి. ఆ తరువాత నేను అంతర్మధనం, జీవితం-జాతకం పుస్తకాలను ప్రచురిస్తున్న సమాచారం ఉత్తరం ద్వారా ఆయనకు తెలిపాను. ఆయన డబ్బులు పంపారు. పుస్తకాలు పంపుతూ ఆయన అభిప్రాయం అడిగాను. అసిధార చాలా బాగుందన్నారు. అంతే.
ఆతరువాత కొన్నిరోజులకు, జీవితం- జాతకాన్ని కన్నడంలోకి అనువదించి, ప్రచురించేందుకు అనుమతి అడుగుతూ ఉత్తరం రాశారు. నేను పని వొత్తిడిలో వుండి సమాధానం ఇవ్వటం ఆలస్యం చేసాను. ఆతరువాత ఎలాంటి సమాచారం అందకపోవటంతో ఆ ఆలోచన విరమించుకున్నారనుకున్నాను.
సంక్రాంతి రోజు ప్రథమంగా మా ఇద్దరి నడుమ ఫోనులో సంభాషణ జరిగింది. అసిధారను కన్నడంలోకి అనువదించి, సీరియల్ గా ప్రచురించటానికి అనుమతి అడిగారు. ఇచ్చాను. ఈ పుస్తకం పది మందినీ చేరాలి, అందులోని అంశాల గురించి చర్చలు జరగాలి. ప్రజలు స్వయంగా నిజానిజాలు తెలుసుకోవాలి , అదే నా కోరిక, కాబట్టి సంతోషంగా అనుమతినిస్తున్నాను అన్నాను. . కానీ, నెల నెలా పత్రికను పంపాలి అన్నాను. సరేనన్నారు.
సాయంత్రం ఇంటికి వచ్చేసరికి కొరియర్ లో కన్నడ పుస్తకాలొచ్చాయని అమ్మ చెప్పింది. ఉథ్థాన పత్రిక డిసెంబరు, జనవరి సంచికలతో పాటు, ఒక డిమాండ్ డ్రాఫ్ట్ పంపారు. అది సీరియల్ కు రాయల్టీట! మార్చి సంచికనుంచీ సీరియల్ ఆరంభమవుతుంది, నెల నెలా పత్రిక అందుతుంది, అని ఉత్తరంలో రాశారు.
నిజంగా ఎంతో ఆనందం అనిపించింది. రచయితలకు ఇంకా ఇంత గౌరవమిచ్చేవారున్నారా, అని ఆశ్చర్యం కలిగింది. ఏమీ చెప్పకుండా వారు అనువదించి ప్రచురించుకున్నా నాకు తెలిసేది కాదు. మన తెలుగులో అలాంటివి బోలెడు జరుగుతున్నాయి. అదేమిటని అడిగితే, కాపీ కొట్టనిదెవరు? అంటూ అందరూ దొంగలే అన్నట్లు మాట్లాడి సమర్ధించుకునేవారు తెలుసు. అలాంటిది, అనుమతి అడగటం, ఆశ్చర్యం అనిపించింది.
అడగకుండా, ఇంకా సీరియల్ ఆరంభం కాకముందే, డబ్బులు పంపటం, పత్రిక కాపీ పంపుతామనటం అద్భుతమయిన విషయం. మన తెలుగులో, రచయితకు ఒకోసారి తన రచన పడ్డట్టు తెలియనే తెలియదు. ఎవరో చెప్పేసరికి ఆ పత్రిక మార్కెట్లో దొరకదు. ఒకవేళ ముందు తెలిసినా పత్రిక కొనుక్కోవాలి. రచన పడటమే, గొప్ప విషయం, ఇంకా డబ్బులు కూడానా? అన్నట్టు ప్రవర్తిస్తారు. అనేక సందర్భాలలో డబ్బులు ఆసించకుండా, రచనలు చెస్తూనేవుంటారధికులు. వ్యాసాలూ, కథలేకాదు, సీరియళ్ళకూ డబ్బులివ్వరు. సీరియల్ ను డీటీపీ చేసేవారికి ఇస్తారు కానీ, సీరియల్ రాసే రచయిత ముందు డబ్బుల ప్రసక్తి తేరు.
ఒక సారి, ఒక టీవీ సీరియల్ రాస్తూ, అతి మొహమాటంగా డబ్బులడిగా. ప్రస్తుతం కాస్త కష్టంగా వుందన్నాడు. అడగటమే చచ్చి అడిగా, లేదనేసరికి పూర్తిగా చచ్చా. అయితే, అప్పుడే, ఒక నటి వచ్చింది. వెంటనే, ఆమెకు ఒక నోట్ల కట్ట తీసి ఇచ్చాడు. ఇదీ రచయిత స్థితి. అయితే, ఆ తరువాత ఎపిసోడ్ నేను ఇవ్వలేదు. బాకీలన్ని చెల్లిస్తేనేనే చివరి క్షణం లో ఇచ్చి, పదాలు పలికేవాడికి డబ్బులిస్తారు కానీ, ఆ పలికే పదాలు రాసేవాడికివ్వరా? అని నిలదీశాను. అప్పటికి డబ్బులు దక్కాయి కానీ, మరుసటి ఎపిసోడుకు రచయిత మారిపోయాడని వేరే చెప్పనవసరం లేదుకదా!
ఇలాంటి పరిస్థితిలో అడగకుండా, డబ్బులు పంపి, ఇంత గౌరవం ఇస్తున్న వారి సంస్కారానికి జోహార్లర్పించటం సమంజసమే కదా!
మార్చి నెలనుంచీ, ఉథ్థానలో వస్తున్న సీరియల్ చదివి మీ అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా తెలియచెప్పాలని, కన్నడ- తెలుగు తెలిసిన బ్లాగర్లను ప్రార్ధిస్తున్నాను. అలాగే, కన్నడ మిత్రులున్న వారు, వారి అభిప్రాయాన్ని తెలుసుకుని తెలియచేయమని వేడుకుంటున్నాను.
ఉథ్థాన పత్రిక చిరునామా-
utthaana, gavi puram road, kempegouda nagar, bangalore-560019, karnataka.