కొన్ని సినిమాలు చూస్తూంటేనే మత్తిఉ లాంటి నిద్ర వస్తుంది. సినిమా పూర్తి కాకముందే సినిమాను మరచిపోతాము.
.
కొన్ని సినిమాలు చూసి, హాలు బయటకు వచ్చిన తరువాత మరచిపోతాము.
కొన్ని సినిమాలు కొన్ని రోజులవరకూ గుర్తుంటాయి.
కానీ, కొన్ని సినిమాలు జీవితాంతం గుర్తుంతాయి. ప్రతి క్ష?ణం మదిలో మెదలుతూ కలవర పెడుతూంటాయి. ఆలొచింప చేస్తూంటాయి. మానవ జీవితంలొని సున్నితమయిన అమ్షాలను అత్యంత హృద్యంగా ప్రదర్శించి, మనుషులలోని సున్నితత్వాన్ని తట్టిలేపుతాయి. జీవిత గమనంలో సందేహాలకు సమాధానాలిస్తాయి. మనిషిని మనిషిగా నిలపటంలో తమవంతు తోడ్పడతాయి. కళ అనేది మనిషిలోని మానవత్వాన్ని జాగృతంచేసి, అతడికి తాను, తనచుట్టూ వున్న సమాజం గురించి అవగాహన కల్పించేది అన్న నిజాన్ని నిరూపిస్తాయి.
అలాంటి అత్యద్భుతమయిన సినిమా మిస్టర్ హాలాండ్స్ ఓపస్.
సినిమా మొదటి దృష్యం నుంచీ కట్టిపడేస్తుంది.
ఇంకా పేర్లు ఆరంభమవుతూంటాయి, కథ స్వరూపాన్ని తెలియచెప్పుతూ నేపధ్య సంగీతం మొదలవుతుంది. తెరపైన పియానో వాయిస్తూ తన్మయత్వం చెందుతూ, సంగీతాన్ని సృజిన్స్తూ నాయకుడు కనిపిస్తాడు.
ఈ సినిమాలో కథానాయకుదు సంగీత విద్వాంసుడు. గొప్ప సంగీతకారుడయిపోవాలని కలలుకనేవాడు. కానీ, తప్పని సరి పరిస్థితులలో ఒక స్కూలులో సంగీతం మాస్టారు ఉద్యోగం చేయాల్సి వస్తుంది. అయిష్టంగా ఉద్యోగంలో చేరతాడు. పిల్లలను చూస్తూంటే విసుగు వస్తుంది. వాళ్ళకు పాఠాలు చెప్పాలంటే చిరాకు వస్తుంది.
ఈ సందర్భంలో ఒక మంచి మాట వినిపిస్తుంది సినిమాలో.
నాయకుడు, స్కూలయిపోగానే ఇంటికి పరుగెత్తుతూంటాడు. ప్రిన్సిపాలు అతడిని పలకరిస్తుంది. పిల్లలకు తాను బాగానే చెప్తున్నాను కానీ వాళ్ళాకి ఆసక్తి లేదన్నట్టు మాట్లాడతాడు హీరో. దానికి ఆమె, ప్రతి అధ్యాపకుడికి రెండు విధులుంటాయి. ఒకటి పిల్లలకు విఙ్నానాన్ని అందివ్వటం. రెండు, ఆ ఙ్నానాకి ఒక దిశను ఇవ్వటం. దాన్ని విచక్షణ్భతో పిల్లలు ఉపయోగించుకునేట్టు చూడటం. నువ్వు మొదటి పని చేస్తున్నావు. రెండోది సరిగ్గా చేయటంలేదంటుంది. ఎంతో అర్ధవంతవయిన సంభాషణ ఇది.
ఇది హీరో ఆలోచనలో మార్పు తెస్తుంది. పిల్లలను గమనిస్తాడు. వారికి సంగీతంపైన ఆసక్తి వున్నా పాఠ్యామ్షాలు విసుగు కలిగిస్తున్నాయని అర్ధం చేసుకుంటాడు. వాళ్ళలోని తపనను, వారి ఆలోచనల దిశను గమనిస్తాడు. వారికి ఆసక్తి కలిగంచే అమ్షాల ఆధారంగా బోధన ప్రారంభిస్తాడు.
ఫలితాలు కనిపిస్తాయి. పిలలకు హీరో ప్రీతి పాత్రుడవుతాడు. పిల్లలకు బోధిస్తూ ఆయనకూడా ఆనందం అనుభవిస్తూంటాడు. అతని బోధన పద్ధతులు భిన్నంగా వుండటంతో వ్యతిరేకతను ఎదుర్కొంటాడు. కానీ, ఏదయిన పని ఇతరులకు భిన్నంగా చేసే తెగువ వున్నవాడు, ఫలితంగా ఎదురయ్యే వ్యతిరేకతనూ ఎదుర్కొనేందుకు సిద్ధంగా వుండాలి. హీరో అన్ని నిరసనలను ఎదుర్కొంటాడు.
ఇంతలో అతని భార్య గర్భవతి అవటంతో, తప్పని సరిగా వ్య్ద్యోగంలో కొనసాగాల్సి వస్తుంది. అతడికి కనీసం తన కొడుకుని సంగీత కారుడిని చేయాలని వుంటుంది. కానీ, అతని కొదుకు చెవిటివాడవుతాడు. అత్యద్భుతమయిన సన్నివేశం ఇది.
స్కూలు ఫుట్ బాల్ ఆటకని మార్చింగ్ బాండ్ సంగీతం తయారు చేస్తాడు. వూరంతా ఆ బాణీకి నాట్యం చేస్తూంటుంది. హీరో జీవితంలో అత్యంత ఆనందకరమయిన ఘట్టం అది. ఇంతలో ఒక హాఋన్ కర్ణ కఠోరంగా మోగుతుంది. అందరూ చెవులు మూసుకుంటారు. పిల్లలు ఏడుస్తారు. కానీ, నాయకుడి అబ్బాయి మాత్రం హాయిగా నిద్ర పోతూంటాడు. ఈ సన్నివేశ చిత్రీకరణ కూడా ఎంతో సున్నితంగా, అర్ధవంతంగా వుంటుంది.
ఆతరువాత సన్నివేశాలు కూడా మెలోడ్రామా కన్నా మానసిక సంఘర్షణలకే ప్రాధాన్యం ఇస్తాయి.
కొడుకును సంగీతకారుడిని చేయాలన్న కల కళ్ళ అయినాయకుడు, కొడుకుతో సంభాషించలేక, అతడి మనసును తెలుసుకోలేక తల్లి, ఇద్దరూ తల్లడిల్లి పోతారు. ఒకే విషయంలో స్త్రీ పురుషుల స్పందనను, వారి ఆలోచనా ధోరణులను అత్యంత సున్నితంగా చూపిస్తాయి ఈ దృష్యాలు.
స్కూలు పిల్లలకు సంగీతం నేర్పటంలో మునిగి తన బాధను మరచిపోయే ప్రయత్నాలు చేస్తాడు హీరో. కానీ, కొడుకుతో అనుబంధాన్ని ఏర్పరచుకుంటుంది తల్లి. ఇక్కడ కూడా, స్త్రీ పురుషుల ఆలోచనలలో, వారి ద్రుక్కోణాలలొ తేడాలను ఎంతో సున్నితంగా చూపుతారు. ఎలాంటి డయలాగులూ, ఏడుపులూ లేకుండా, అత్యంత సృజనాత్మకమయిన సన్నివేశ సృష్టీకరణ ద్వారా పాత్రల మనోభావాలను మనకు చేరువ్బ చేస్తాడు దర్శకుడు.
నాయకుడు తన పనిలో నిమగ్నమవుతున్న కొద్దీ, అతడికి, కుటుంబానికీ నడుమ దూరం పెరుగుతూంటుంది. నాయకుడికి స్కూలులో విద్యార్ధుల అభిమానం ఇబ్బడి ముబ్బడిగా లభిస్తూంటుంది.
ఇక్కడే స్క్రిప్తు రచయిత చమత్కారం చేశాడు.
కాలం మారుతుంది. మారిన కాలానికనుగుణంగా ప్రజల అభిరుచులు మారతాయి. అభిరుచులను అనుసరించి కళాకారులు కళను సృజిస్తారు. ఇలా కళను సమాజం, సమాజాన్ని కళ మార్చుకుంటూ మానవ జీవితం ముందుకు సాగుతుంది. ఈ నిజాన్ని ఎంతో అద్భుతంగా, మారుతున్న సంగీతాన్ని, సమకాలీన రాజకీయ సంఘటనలను చూపుతూ మనకు స్ఫురింపచేస్తాడు.
కాలానికి అనుగుణంగా నాయకుడి రూపు రేఖలు మారతాయి. వయసు పెరుగుతుంది. గతంలోలా చురుకుదనం వుండదు. ఈ మార్పులను నటుడు రిచర్డ్ డ్రేఫస్ ఎంత అద్భుతంగా చూపాడంటే, మనకు తెలియకుండానే మనము పాత్రలో లీనమయిపోతాము. ఎలాగయితే రోజూ చూసే మనిషిలో మార్పులను గుర్తించలేకపోతామో అలాగే ఈ పాత్ర నెమ్మదిగా మారే విధానాన్ని కూడా గుర్తించలేము. చూస్తూ హీరో ముసలివాడయిపోతాడు. కొడుకు పెద్దవాడవుతాడు. స్వీయ వ్యక్తిత్వం వస్తుంది. తండ్రీ కొడుకుల మధ్య ఘర్షణ, హీర్తో తన తప్పు గ్రహించటం వంటి సన్నివేశాలు ఎదను కదిలిస్తాయి. మనుషుల మధ్య ఏర్పడే తెలియని అగాధాల స్వరూపాలను గ్రహింపుకు తెస్తాయి.
ఈ మధ్యలో ఒక విద్యార్ధినిలో నాయకుడు తనని చూసుకుంటాడు. తనలాగే ఆమె మామూలు జీవితంలో ఇరుక్కోకూడదని కలను సాకారం చేసుకునేందుకు ప్రోత్సహిస్తాడు.
ఈ సందర్భంలో మామూలు మనుషుల జీవితాల్లో ఎదురయ్యే సంఘర్శణలను ప్రదర్శిస్తారు. నాయకుడు ఆ అమ్మాయి వైపు ఆకర్శితుడవుతాడు. కానీ అతనికి భార్యవుంది. పిల్లలున్నారు. నాయకుడి ఈ సంఘర్శణను అతని భార్య అర్ధం చేసుకుంటుంది. పల్లెత్తు మాట అనదు. అన్నీ మౌనంగా స్వీకరిస్తుంది. అద్భుతమయిన సన్నివేశాలివి. మానవ మనస్తత్వానికి అద్దం పడతాయి.
కాలం మారుతుంది. ఇప్పుడు, నాయకుడిని వ్యతిరేకించేవారికి అధికారం వస్తుంది. ఖర్చులు తగ్గించే నెపం మీద సంగీతాన్ని పాఠ్యాంశంగా తొలగిస్తారు.
ఈ సందర్భంలో నాయకుడి వ్యాఖ్యలు మనందరికీ వర్తిస్తాయి.
లలిత కళలు మనిషిలోని సున్నితత్వాన్ని వెలికి తీస్తాయి. ఎప్పుడయితే పిల్లలకు అవి అనవసరం అని భావిస్తామో, అప్పుడు మనం సమాజంలోని సున్నితత్వానికి తిలోదకాలిచ్చినట్టే. మనది ఫుట్ బాల్ సంస్కృతి అయిపోతుంది. అంటాడు హీరో.
కవిత్వం, సంగీతం, చిత్రలేఖనం, వంటి లలిత కళలను విద్య గా పరిగణించక పోవటం వల్ల కలిగే దుష్పరిణామాలకు మనమే నిలువెత్తు నిదర్శనాలము.
చివరికి హీరోకు ఉద్యగం వదలక తప్పదు. 30 ఏళ్ళుగా ఈ ఉద్యగం చేస్తున్న తన జీవితం వ్యర్ధం అనుకుంటాడు. భార్య పిల్లలతో కాలేజీ వదలి వస్తూంటే ఆడిటోరియం నుంచి సంగీతం వినిపిస్తుంది.
అదేమిటో చూడాలని ఆవైపుకు వెళ్తారు.
ఆడిటోరియంలో అంత వరకూ అతడి వద్ద సంగీతం నేర్చుకున్న విద్యార్ధులంతా వుంటారు. వారు, ఏ సంగీత రచనకోసం హీరో తపన పడుతున్నాడో ఆ సంగీతాన్ని వినిపిస్తారు.
ఈ సందర్భంలో ఒక విద్యార్ధిని సంభాషణలు అద్భుతంగా వుంటాయి.
హాలండ్ తన జీవితాన్ని వ్యర్ధంగా భావిస్తున్నాడు. కానీ, ఈ ఆడిటోరియంలో వున్న ప్రతివొక్కరి జీవితాన్ని ఆయన ప్రభావితం చేశారు. మీరు రచించాలనుకున్న సంగీత రచనలము మేము. ఇంతమంది ప్రభావితం చేసిన ఏవరి జీవితమూ వ్యర్ధం కాదు అంటుంది. అతి కష్టపడి ఆమెకు సంగీతం నేర్పుతాడు గతంలో. ఇప్పుడామె ఆ రాష్ట్ర గవర్నర్.
ఇదీ సినిమా కథ.
అడుగడుగునా ఆలోచనలు రేపుతూ, అక్కడక్కడా పెదవులపై చిరునవ్వి నిలుపుతూ. ఆలోచింపచేతూ, కళ్ళు చెమరింప చేస్తూ సాగే సినిమా జీవితాంతం వెంటాడే అద్భుతమయిన సినిమా.
కళ పరమార్ధాన్ని మన అనుభూతికి తెచ్చే సినిమా.
ఈ సినిమాలో హీరో మనలాంటి మామూలు మనిషి. ఏదో సాధించాలనుకుంటాడు. పరిస్థితులకు లొంగిపోతాడు. అతడి ఒక్క కల కూడా నెరవేరదు. కనీసం ఆకలను కొడుకు ద్వారా తీర్చుకోవాలనుకున్నా అదీ కుదరదు. ఇలాంటి వ్యక్తి జీవితాన్ని తెరకెక్కించి, అతని జీవితంలోని సూక్ష్మ మయిన మానవీయ విలువలున్న అంశాన్ని వెలికి తెస్తూ, సమస్త మానవ సమాజ మనస్సాక్షిని తట్టిలేపుతూ, మనసులను కదిలించే రీతిలో తెరకెక్కించిన కళాకారుల కళా ప్రతిభకు జోహార్లర్పించాలని పిస్తుంది.
ఒకవైపు సామాజిక గతిని చూపుతూ, మరో వైపు వ్యక్తి అంతస్సంఘర్శణలను చిత్రిస్తూ ఎక్కడా ఔచిత్యం చెదరకుండా సినిమాను రక్తి కట్టించిన తీరు పరమాద్భుతం. మామూలుగా కనిపించే జీవితాలలో కూడా, తరచిచూస్తే ఎంతో డ్రామా వుంటుందని, దాన్ని గ్రహించే నేర్పు కళాకారుడిలో వుంటే ఎలాంటి కథనయినా అద్భుతమయిన సినిమాగా రూపొందించవచ్చని ఈ సినిమా నిరూపిస్తుంది.
మన ప్రేక్షకులు, కళాకారులు ఇలాంటి సినిమాలు చూస్తే మన సినిమాలూ బాగుపడతాయి. అందుకే అందరూ తప్పనిసరిగా చూడాల్సిన సినిమా ఇది