రాతలు – కోతలు

డిసెంబరు 31, 2008

హాపీ న్యూ ఇయర్ టు ఆల్ !

ప్రచురించిన వర్గము నా రచనలు. — కస్తూరి మురళీకృష్ణ @ 2:09 అపరాహ్నం

కొత్త సంవత్సరం పరుగు పరుగున వచ్చేస్తోంది. సమయం ఎంత వేగం గా పరుగిడుతోందంటే, ఇంకా ఈ సంవత్సరం ఇప్పుడే వచ్చినట్టుంది. అప్పుడే ఇది పాతదయిపోయింది. కొత్త సంవత్సరం వచ్చేసింది. సమయం, ఇలా, ఎలా గడుస్తోందో తెలియకుండానే గడచిపోతోంది. ఏదో ఓ సమయంలో ఒక్కో వ్యక్తికి అది ఆగిపోతుంది. కానీ, సమయం పరుగిడుతూనే ఉంటుంది.

కొత్త సంవత్సరం వస్తోందంటే అందరూ సంబరాలు చేసుకుంటారు. ఆడతారు.పాడతారు. తాగుతారు. అర్ధరాత్రి వరకూ మేల్కొని కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్తారు. అదేదో గొప్ప అద్భుతం సాధించినట్టు ఫీలయిపోతారు. రాత్రంతా నిద్రల్లేకపోవటం వల్ల తెల్లారి నుంచే తలనొప్పులతో కొత్త సంవత్సరాన్ని ఆరంభిస్తారు. సగటు మనిషిగా అందరితోపాటూ నేనూ కొత్త సంవత్సరాగమనానందాన్ని అనుభవించేయాలని అనుకున్నా, ఎందుకనో ఏవేవో ఆలోచనలూ, భయాలూ ముసురుకుంటాయి. నా ఆనందాన్ని హరించేస్తాయి.

కొత్త సంవత్సరం వస్తే ఆనందం ఎందుకో నాకు అర్ధం కాదు. సంవత్సరం కొత్తదయినా మనం పాతవారిమే. మన సమాజం పాతదే. మన చుట్టూవున్నవారు పాతవారే. మన సమస్యలూ పాతవే. మన ఉద్యోగాలూ, ఇబ్బందులూ పాతవే. దీనికే అంతగా ఆనందించటం, ఎగిరి గంతులు వేయటం ఎందుకో నా సగటు బుర్రకు అర్ధంకాదు.

ఒకోసారి నాకు ఆలోచనలు వస్తూంటాయి.

మనము కాలగణన కోసం ఈ సంవత్సరాలూ, లెక్కలూ ఏర్పరచుకున్నాం. మనకు ముందు ఏమి జరుగుతుందో తెలియదు. కాబట్టి ఇప్పుడు ఉన్న ఈక్షణంలో అవకాశంవునప్పుడే ఆనందం అనుభవించేయాలన్న ఆత్రంతో ఏదో కారణం ఏర్పరచుకున్నామేమో అనిపిస్తుంది. అదీకాక, రేపన్నదిలేనట్టు, ఈరోజే అన్నీ అనుభవించేయాలన్న అభద్రతాభావంతో ఇలా అరుపులూ, కేకలూ, తాగితందనాలూ అలవాటయ్యాయనిపిస్తుంది. నేను అంటే చాదస్తంగా అనిపిస్తుందేమో కానీ, ఇదంతా రేపు గురించి ఆలోచనలేక ఈరోజే జీవితం అనుకునే పాశ్చాత్య సంస్కృతీ ప్రభావం తప్ప మరేమీ కాదు. ఎందుకంటే, మన తత్వంలో మనకు గతం వుంది. వర్తమానం వుంది. భవిష్యత్తువింది. మనం గతంలో చేసిన పనుల ఫలితం వర్తమానంలో అనుభవిస్తాం. వర్తమానంలోని పనుల ప్రభావం భవిష్యత్తుపైన వుంటుంది. కాబట్టి, కాలం మనకు ఒక్క రోజులో సమాప్తమయ్యేదికాదు. ఇది అనంతకాలం ప్రవహిస్తూండే ఒక అవిచ్చిన్న ధారవంటిది. నీటిలోకి రాయి విసిరితే కేంద్రం నుంచి అలలు నీరంతా విస్తరించినట్టు మనం చేసే ప్రతిపనీ ప్రతి ఆలోచన ప్రభావం ఎంతో దూరం వరకూ వుంటుంది. అందుకే మనకు సంబరాలంటే తాగి తందనాలాడటం కాదు. రేపటితో జీవితం సమాప్తమయిపోయేట్టు వెర్రికూతలు, మొర్రి చేతలూ, వెర్రి మొర్రి గంతులూ మనకు ఆనందించటం కాదు. ఇవన్నీ క్షణకాలం ఆనందాలు. మత్తు ఆనందింపచేస్తుంది. మత్తు దిగిన తరువాత మళ్ళీ అదే ప్రపంచం ఏడుపు ముఖంతో కళ్ళముందు నిలుస్తుంది. ఇది పారిపోవటం. పాశ్చాత్యుల రేపు లేదన్న పలాయనవాదం.

అందుకే, మన కొత్త సంవత్సరం సంబరాలు అర్ధవంతంగా ఉంటాయి. గాంభీర్యంతో వుంటాయి. పొద్దున్నే లేస్తాం. శుభ్రంగా స్నానించి భక్తిగా భగవంతుడిని ధ్యానిస్తాం. తీపిచేదుల జీవితానికి ప్రతీక అయిన పచ్చడిని ఆరగిస్తాం. ఆతరువాత భవిష్య శ్రవణం వింటాం. రాబోయె సుఖాలతోపాటూ, కష్టాలనుకూడా ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్ధమవుతాం. మంచిమాటలు వింటాం. మంచి ఆలోచనలు చేస్తాం. మనతో ప్రపంచం అయిపోవటం లేదు. మన తరువాత తరాలవారికి మంచి ప్రపంచం అందించే బాధ్యత మనపై వున్నదన్న విఙ్నతను ప్రదర్శిస్తాం. ఇదీ మన సంబరాల స్వరూపం. దీన్లో ఎంత ఆలోచనవుంది. ఎంత నాగరికతవుంది. కానీ ఏం చేస్తాం, మనకు ఎంజాయ్మెంట్ అంటే శరీరం వూగాలి. తూగాలి. గాల్లో ఎగరాలి. మత్తులోపడి సర్వం మరచిపోవాలి అన్న ఆలోచనలు స్థిరపడ్డాయి. ఇదే అభివృద్ధి. నాగరీక ఎంజాయ్మెంట్ అనుకుంటున్నాము. కాదన్నవాడు చాందసుడు, పాతనుపట్టుకుని వేలాడే పిచ్చివాడవుతున్నాడు. కాదన్నవాడిని హేళన చేసి చులకన చేసి ఉద్ధరించేందుకు ప్రపంచంలో అంతా నడుం కడుతున్నారు. పంచాంగం చించేసినంత మాత్రాన తారలు అదృష్యం కానట్టు, వాళ్ళు కాదన్నంత మాత్రాన నిజం నిజంకాకుండా పోతుందా? కానీ ఈ శారీరక ఎంజాయ్మెంట్ లో పడి, మనం ఆత్మను కోల్పోతున్నాము.

అయ్యో కొత్త సంవత్సరం ఏదో సరదా కబుర్లు చెప్పకుండా ఏదో రాసేస్తున్నాను. చూశారా, సగటు మనిషికి సమయం, సందర్భం తెలియవు. వాగటమే తెలుసు. క్షమించండి.

wish u all a very happy new year

ఇది, 28.12.09 ఆంధ్ర ప్రభ ఆదివారం అనుబంధంలో సగటు మనిషి స్వగతం శీర్షికన ప్రచురితం.

డిసెంబరు 30, 2008

తెలుగు స్టాలు ఫలితం ఈ-మూడు బ్లాగులు.

ప్రచురించిన వర్గము Uncategorized — కస్తూరి మురళీకృష్ణ @ 1:38 అపరాహ్నం

పుస్తక ప్రదర్శనలో ఈతెలుగు స్టాలు గురించి ఎవరో ఒక తమాష అయిన వ్యాఖ్య రాశారు. వారి సెన్సాఫ్ హ్యూమరుకు ఆనందం కలిగింది.

అయితే, వారు ఈస్టాలు నిర్వహణను ఎంతగా వ్యంగ్యం చేసినప్పటికీ నేను గత సంవత్సరంగా సాధించలేనిది ఈ స్టాలులో మన బ్లాగర్ల వల్ల సాధ్యమయింది.

అది నా మిత్రుదు శ్రీపతి శర్మ, అతని భార్య సత్యవతి, నా భార్య పద్మ లు తమ తమ బ్లాగులను ఆరంభించటం!

నేనెప్పటినుంచో బ్లాగమని వీరి వెంటపడుతూన్నాను. నా మాటలు నవ్వుతూకొట్టేసేవారు. తరువాత చూద్దాం లే అనేవారు.ఇప్పుడొద్దులే అనేవారు. మేమేమి రాస్తాం అనేవారు.

కానీ, మన బ్లాగరులంతా కలవటం, కలసి ఆనందించటం చ్చొసినతరువాత వీరు నా ప్రమేయం లేకుండా, బ్లాగులను ఆరంభించేశారు.

శ్రీపతి శర్మ బ్లాగు www.sreekaram.wordpress.com. అతని భార్య బ్లాగు www.himakusumaalu.wordpress.com

పద్మ బ్లాగు, www.sripadmakasturi.wordpress.com.

ఈ మూడు బ్లాగులను, బ్లాగరులను మన బ్లాగ్ప్రపంచానికి ఆహ్వానించి, ఆదరించి, సలహాలతో సూచనలతో ప్రోత్సహించవలసిందిగా నా ప్రార్ధన.

హేళన ఊపుగా, వెక్కిరింత ఊతేజంగా, వ్యతిరేకత ప్రేరణగా మన బ్లాగ్ప్రపంచం మరింత విస్తృతమవ్వాలని కోర్కుంటున్నాను.

ఈ మూడు బ్లాగులను అందరూ సందర్శించి, ఆహ్వానించి, ఆదరించగలరని ఆసిస్తున్నాను.

డిసెంబరు 28, 2008

కలిసింది తొలిసారే అయినా, ఎన్నో ఏళ్ళ పరిచయస్తుల్లా కలసిపోయాం.ఎందుకని?

ప్రచురించిన వర్గము Uncategorized — కస్తూరి మురళీకృష్ణ @ 1:32 పూర్వాహ్నం

గమనిస్తే, ఈ ప్రశ్న పరిచయమయిన ప్రతి బ్లాగరు మదిలో మెదులుతూన్న ప్రశ్ననే. పరిచయాల గురించి ఎవరి బ్లాగులో చూసినా, ఇదే మొదటి సారి కలవటం అయినా, ఆప్యాయంగా ఎంతకాలం నుంచో పరిచయం వున్న వారిలా కలసిపోయాం అని రాస్తున్నారు. ఇందుకు కారణాలు అణ్వేశిస్తున్నారు.

నా సంగతే చూడండి.

నేను సాధారణంగా ఎవరితోనూ వెంటనే కలవలేను. కలసినా అంతగా మాట్లాడలేను. నేను కలసి నోరిప్పటానికి చాలా సమయం పడుతుంది.

అంతేకాదు, నాకు నాలుగయిదు సార్లు కలిస్తేకానీ పేర్లు, రూపాలు గుర్తుండవు. ఎక్కడో చూశాను, అనుకుంటూంటాను. పేరు గుర్తుకు రాదు. ఏదో పేరు నాలికపైన వస్తుంది. కానీ, రూపం రాదు. అందుకని, ఎవరయినా పలకరిస్తే, పొడి పొదిగా, అంటీముట్టనట్టు మాట్లాడి వెళ్ళిపోతాను. వారు మళ్ళీ పలకరిస్తే గుర్తుపట్టలేను. మరచిపోతాను. కానీ, ఒక్కసారి అలవాటయినతరువాత, నా నోరు మూయించటం చాల కష్టం. నా అతివాగుడు వల్ల ఎందరో దూరం పారిపోయారుకూడా. దాంతో ఆచి తూచి మాట్లాడటం అలవాటయింది.

అందుకే, నేను దాదాపుగా స్కూలు స్థాయి నుంచి హైదెరాబాదులోనే చదువుతూన్నా, ఉద్యోగమూ ఇక్కడే అయినా, నాకు చెప్పుకోవటానికి సన్నిహితులన్నవారు లేరు. బాల్య మిత్రులన్నవారు లేరు. కాలేజీ పరిచయస్థులూ లేరు. ఉద్యోగంలోనూ, అవసరార్ధం మాటలు తప్ప, ఆంతరంగిక పరిచయాలూ లేవు. ఒకోసారి నన్ను చూస్తే నాకే, సాగరం ఒడ్డున కూచుని, ప్రవాహాన్ని చూస్తూన్నవాడిలా అనిపిస్తుంది. సాగరం నీటి తడికి దూరంగా వున్నట్టు అనిపిస్తుంది.

నా గదిలో కూచోవటం, పుస్తకాలు చదవటం, రాయటం, పాటలు వినటం, సినిమాలు చూడటం…ఇంతే! నావల్ల, అందరితో కలివిడిగా వుండే నా భార్యకూడా తన social life కోల్పోయింది. నేను ఫంక్షన్లకు వెళ్ళను. పదిమంది ఉన్నచోటినుంచి దూరంగా పారిపోతాను. ఎవరితోమాట్లాడుతున్నా, నాకు సమయం వ్యర్ధం చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ సమయంలో చదవవచ్చు, రాయవచ్చు, ఏమీ లేకపోతే, హాయిగా కూచుని ఆకాశంలో మన కోసం ప్రకృతి సృజిస్తున్న చిత్రలేఖన ప్రదర్శనను చూసి ఆనదించవచ్చు అనుకుంటాను. అందుకే ఎవరితో ఎక్కువగా కలవను. సమయం గడపను.

అలాంటిది, పప్పు అరుణ గారు కలవగానే, అంత వరకూ పరిచయంలేకున్నా, ఎంతో కాలం పరిచయం వున్నట్టు మాట్లాడేను. మహేష్ కుమార్ ని చూస్తే, ఆప్యాయంగా అనిపించింది. చాలా చనువుగా జోకులేసాను. కొన్నేళ్ళు కలసి ఆలోచనలు, అనుభవాలు పంచుకున్నవారితో వ్యవహరించినట్టు వ్యవహరించాను. సుజాత గారికోసమయితే ఎంత ఎదురుచూశానంటే, తన తొలి కథ అచ్చయిన పత్రిక విడుదల కోసం, రచయిత పొద్దుటినుంచీ దుకాణం ముందు పడిగాపులు కాచినట్టు ఎదురుచూశాను. వారు కలవగానే కొత్త అన్నదిలేకుండా, రోజూ మాట్లాడుతూ, నిన్నటి సంభాషణను ఇవాళ్ళ కొనసాగించినట్టు మాట్లాడాను. వరూధినిగారితో అసలు పరిచయంలేదు కానీ, మొహమాటపెట్టి పుస్తకం కొనిపించాను. శిరీష్ కుమార్ గారితో మాట్లాడుతూంటే ఎంతో సన్నిహితుడితో మాట్లాడినట్టు అనిపించింది. జ్యోతి గారి విషయం చెప్పనక్కరలేదు. వారింటికి నన్ను నేనే ఆహ్వానించుకున్నాను. నేను, మా బంధువుల ఇళ్ళకు కూడా వెళ్ళను. అలాంటిది, తలచుకుంటే, నాకే ఆశ్చర్యమనిపిస్తోంది. కనీసం నేను ఎవరితోనూ చాటింగ్ చేయలేదు. అలాంటిది, ఇంటికి ఎలా ఆహ్వానించుకున్నానా, అని ఆలొచిస్తున్నానిప్పతికీ.

దీనికి నాకు ఒకటే ప్రధాన కారణంలా అనిపిస్తోంది. మామూలు ప్రపంచంలోని పరిచయాలకు, బ్లాగు పరిచయాలకు ఉన్న ప్రధానమయిన తేడా ఇందుకు కారణం.

మామూలు ప్రపంచంలో పరిచయాలు, భౌతికమయినవి. మనిషిని చూస్తాం. సామజిక హోదా, మన అవసరాలు, మనకు మాటతీరు నచ్చటం లాంటివన్ని ఆ పరిచయాలు పెరగటంలో పాత్రలు వహిస్తాయి. కలవటానికి వీలు, మాట్లాడేఅ తీరికలు పరిచయం పెరగటానికి తోడ్పడతాయి.

కానీ, బ్లాగు పరిచయాలు, ఆలోచనల పరిచయాలు. తిన్నగా, మనిషి రూపం, సామాజిక స్థాయి, అవసరాలవంటివేవీ లేకుండా, ఇవి మనసులోని మాటల పరిచయాలు.

బ్లాగుల్లో మనం కనపడం. మన ఆలొచనలు కనిపిస్తాయి. మన మానసిక భావాల వ్యక్తీకరణ కనిపిస్తుంది. అంటే, ఎంతో సన్నిహితంగా వస్తే కానీ, మామూలు జీవితంలో సంభాషించలేని విధంగా, మనము బ్లాగుల్లో మాట్లాడుకుంటామన్నమాట. ఇలా, మన భావాలు పంచుకోవటంవల్ల, మనసులోని మాటలు ముచ్చటించుకోవటంవల్ల, మన రూపాలతో, వయసులతో, సామాజిక స్థాయిలతో, gender తో సంబంధంలేకుండా మనము భౌతిక పరిచయం లేకున్నా, మానసికంగా స్నేహితులమయ్యామన్నమాట. ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవటం అన్నది, ఈ మైత్రిని మరింతగా విస్తరించటమే తప్ప మరొకటికాదు.

అందుకే, తొలిసారి కలసినా, అందరమూ , ఎన్నోఏళ్ళా పరిచయాలున్నవారిలా పలకరించుకున్నాము. కొత్త అన్నది లేకుండా మాట్లాడుకున్నాము. ఎందుకంటే, బ్లాగుల్లో మనసువిప్పి మాట్లాడుకుంటున్న మనము ఇప్పుదు కళ్ళతో ఒకరిని ఒకరు చూస్తూ మాట్లాడుకున్నాము.

ఇలా కలవటంవల్ల మన బ్లాగు మైత్రి మరింతగా సన్నిహితమయింది. అందుకే ఈ బ్లాగు బంధం ఏనాటిదో అనుకుంటున్నాము. ఇది కలకాలం ఇలాగే ఉన్నత మయిన ఆలోచనలతో, ఉత్తమమయిన ఊసులతో కొనసాగాలని ఆశిస్తున్నాము.

తరువాతి కాగితం »

WordPress.com లో Blog పెట్టుము.