నేను శ్రీపతి శర్మ తో కలసి రాసిన మరో కథ మూడు ప్రశ్నలు, ఏ వారం www.aadivaaram.com సంచిక లో ప్రచురితమయింది. ఈ కథలో జాతకాల ఆధారంగా ఒక ప్రధానమయిన నిర్ణయం తీసుకోవటాన్ని, అత్యంత తర్క బద్ధంగా, లాజికల్ గా చూపాము. వ్యక్తుత్వ వికాసానికి, పాజిటివ్ థింకింగ్ కూ, సరయిన నిర్ణయాలు తీసుకోవటానికీ జాతకాలెలా ఉపయోగపడతాయో చూపుతూ, జ్యోతిష శాస్త్రం ఎంత విస్తృతమయినదో, దాన్ని కేవలం భవిష్యత్తు తెలుసుకోటానికే వాడటం ఎంత సంకుచితమో చూపాలని ప్రయత్నించాము. అంతే కాదు, జ్యోతిష శాస్త్రం విఙ్నాన శాస్త్రమన్న ఆలోచనను ప్రదర్శించే ప్రయత్నం చేసాము. మా ప్రయత్నం ఎంత వరకూ సఫలమయిందో తేల్చాల్సింది మీరే. ఈ కథలు ఆంధ్ర భూమి మాస పత్రికలో ప్రచురితమయ్యాయి. కథ చదివి మీ నిర్మొహమాటమయిన అభిప్రాయాన్ని తెలపండి.
అక్టోబర్ 26, 2008
అక్టోబర్ 25, 2008
హిట్ ఫార్మూలా అంటూ ఏదయినా వుందా?
సాధారణంగా సినిమాలు తీసేవారు రిస్కు తీసుకోటానికి ఇష్ట పడరు. సినిమా నిర్మాణం డబ్బుతో కూడిన వ్యవహారం. కాబట్టి ఒక్క సారి నష్టం వస్తే దాదాపుగా దివాళా తీయటం తప్ప వేరే మార్గం లేదు. అలాగే నష్టం పూడ్చుకోవాలన్నా ఇంకో సినిమా తీయటం తప్ప మరో దారి లేదు.
ఇటీవలే ఒక నిర్మాతను కలవటం తటస్థించింది. ఆయన చాలా మంచి సినిమాలు నిర్మించాడు ఒకప్పుడు. మాటల సందర్భంలో ఆయన సినిమాలు తీయటం ఎందుకు మానేశాడో చెప్పాడు.
హిట్ సినిమాలు నిర్మిస్తూ ఆయనకు ఒక సినిమా గురించిన ఆలోచన వచ్చిందట. ఆ ఆలోచనను ఒక ప్రఖ్యాత దర్శకుడికి చెప్తే, ఆయన ఎగిరి గంతేసి ఒప్పుకున్నాడట. మొత్తం బాధ్యత అతడికి అప్పగించి నిర్మాత ఊరుకున్నాడు. ఎందుకంటే అతడు పేరున్న దర్శకుడు. అనవసరంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరంలేదు.
అయితే, షూటింగ్ జరుగుతూంటే, ఆయన దగ్గరకు అనేకులు వచ్చి సినిమా దారి తప్పుతోందని చెప్తూ వచ్చారట. కానీ దర్శకుడు పెద్దవాడు. మధ్యలో జోక్యం చేసుకుంటే బావుండదు. అందుకని నిర్మాత ఓపిక పట్టాడు. సినిమా రషెస్ చూస్తూంటేనే అది నడవదని అర్ధమయిపోయింది. కానీ ముందుకు తప్ప వెనక్కు వెళ్ళలేని పరిస్థితి. దాంతో, మొండిగా సినిమా పూర్తిచేసి, విడుదల చేశాడు. అనుకున్నట్టే ఘోరంగా దెబ్బతింది సినిమా. ఆ కాలంలో 50 లక్షలపైగా నష్టం వచ్చింది.
రెండు మూడేళ్ళలో 50 లక్షల నష్టం పూడ్చుకోవాలంటే, మరో 50 లక్షలు అప్పు తెచ్చి సినిమా తీయాలి. ఇంత తక్కువ సమయంలో అంతగా సంపాదించాలంటే అదొక్కటే మార్గం. కానీ, సినిమా నడవకపోతే, నష్టం కోటి దాటుతుంది. ఆయన సందేహంలో పడ్డాడు.
అప్పుడు ఆయన శ్రేయోభిలాషులు, ఓ మాంచి మసాల సినిమా తీయండి. మినిమం గారంటీ వుంటుందని అన్నారు. ఆయనకు అలవాటయినట్టు సినిమా తీస్తే నడవదన్నారు. అసలే దెబ్బ తినివున్నారు, మళ్ళీ రిస్కెందుకన్నారు. వాళ్ళా మాటలకాయన లొంగాడు. అప్పు చేసి మసాలా సినిమా తీశాడు. ఘోరంగా దెబ్బ తిన్నాడు. అంత కాలం మంచి సినిమాలు నిర్మించిన పేరు పోయింది. మళ్ళీ సినిమా పేరెతాలేదు. ఆస్తులమ్మి అప్పులు తీర్చి, మూటా ముల్లె సర్దుకుని కూతురి ఇలు చేరుకున్నాడు. జీవితం గడిపేస్తున్నాడు.
అతని కథ విన్న తరువాత ఒక అనుమానం వస్తుంది. మసాలా సినిమాలు మనకు విజయానికి రహదార్లు. కానీ, ప్రతి మసాల సిన్మా హిట్ అవదు. అలా అయితే, ప్రతి సినిమా సూపెర్ హిట్ అవ్వాలి. ప్రతివారూ మసాలాలే తీస్తారు. కాబట్టి మసాలా సినిమాలే హిట్ అవుతాయని, ఒక ఫార్మూలా ప్రకారం తీస్తే హిట్ తప్పదని, అందుకు భిన్నంగా తీస్తే నడవవని అనుకోవటం కుదరదు.
ఒక సంస్థ దివాళా తీసే పరిస్థితికి వచ్చింది. చివరి ప్రయత్నంగా వారు సినిమా తీయాలనుకున్నారు. మంచి కథ ఎన్నుకున్నారు. కళాకారులను ఎన్నుకున్నారు. ఏ విషయంలోనూ రాజీ పడకుండా ఉత్తమంగా నిర్మించారు. ఆ సినిమా ఘన విజయం సాధించింది. తరతరాలుగా వారికి ఎనలేని కీతిని సంపాదించిపెట్టింది. అది బైజూ బావ్రా అనే సినిమా!
రాజ్ కపూర్ ఎంత గొప్ప కళాకారుడో అంత తెలివయిన వ్యాపారి. దొంగలమనసుమారే అమ్షంతో హిట్ సినిమా తీసిన వ్యక్తి.( జిస్ దేష్ మె గంగా బహతీహై) అలాంటి వాడు మనస్ఫూర్తిగా ఉన్నదంతా ఖర్చుపెట్టి ఒక సినిమా తీసాడు. ఘోరంగా దెబ్బ తిన్నాడు. మేరా నాం జోకర్ ఇప్పుడు క్లాసిక్ కాని విడుదలయినప్పుడు ఘోరంగా విఫలమయింది. దాంతో రాజ్ కపూర్ పూర్తిగా నష్ట పోయాడు. అయిదేళ్ళవరకూ తేరుకోలేదు. ఇప్పుడు హిట్ సినిమా తీయకపోతే కుదరదు. దాంతో ప్రేమ ఫార్మూలాపై పడ్డాడు. గ్రాడ్యుయేట్ అనే ఆంగ్ల సినిమాను భారతీయీకరణం చేసి బాబీ అన్నాడు. దాంతో భారతీయ సినిమాలలో నిక్కర్ల ప్రేమ అధ్యాయం మొదలయింది. అంత గొప్ప హిట్ అది.
బోనీ కపూర్ హిట్ సినిమాలు నిర్మించాడు. మరో హిట్ సినిమాను సంకల్పించాడు. అనిల్ కపూర్, శ్రీదేవిలు నాయికా నాయకులు. లక్ష్మి ప్యారె సంగీతం. ప్రతీకారాలు, మోసాలు, ఎత్తుకు పైఎత్తులు, పాటలు, యుద్ధాలు మొత్తం మాల్ మసాలాలన్ని నింపాడు. అడుగడుగునా మసాలాను దట్టించాడు. రూప్ కీ రానీ చోరోంకా రాజా ఎంత ఘోరంగా దెబ్బ తిన్నదంటే, ఆయన ఇంకా తేరుకోలేదు.
మూస సినిమాలకు భిన్నంగా విశ్వనాథ్, అన్ని వ్యాపరాల సలహాలను కాదని శంకరాభరణం నిర్మించాడు. అప్పుడు వస్తున్న సినిమాలకు పూర్తిగా భిన్నంగా, హీరోను మాఫియా లాంటివాడిని చేసి రాం గోపాల్ వర్మ శివ తో సినిమాల స్వరూపాన్నే మార్చాడు. నాగేష్ కుకునూర్ తక్కువ బడ్జెట్ తో పెద్ద హిట్ హైదెరాబాద్ బ్లూస్ సాధించాడు. అస్సలు విలన్లు, యుద్ధాలు లేకుండా ఒక పెళ్ళి వీడియోలాంటి హం ఆప్కే హై కౌన్ ఘన విజయం సాధించింది. కమర్షియల్ సినిమా పరిథిలో వున్నా మూస సినిమాలకు భిన్న మయిన తారే జమీన్ పర్ సూపెర్ డూపెర్ హిట్.
వెస్టెర్న్ సినిమాలు అలవాటు లేని మనం అటు షోలే నూ ఇటు మోసగాళ్ళకు మోసగాడునూ ఆదరించాం. ఇలా చూస్తూ పోతే, హిట్ ఫార్మూల నిజంగా హిట్ ఫార్మూలా కాదని, కష్టపడి ఆలోచించి స్వయంగా సినిమా నిర్మించటం తప్పించుకునే బద్ధకానికి మారు పేరనీ అర్ధమవుతుంది.
నిజంగా హిట్ ఫార్మూలా అంటూ ఏదయినా వుంటే, అది హిట్ ఫార్మూలా అంటూ ఏదీ లేదన్నదే. ఇంకొన్ని విజయవంతమయిన సినిమాలను పరిషీలిస్తే, ఈ హిట్ ఫార్మూలా అపోహ ఎలా వచ్చిందో అర్ధమవుతుంది.
అక్టోబర్ 24, 2008
సినిమా హిట్- ఫార్ములా ఫిట్!
హిట్ సినిమా కు ఫార్ములా ఏమిటి? పూర్వ కాలంలో ఇతర లోహాలను బంగారంలా మార్చాలని అనేకులు తపన పడ్డారు. పరుసవేది కోసం ప్రాణాలే ఇచ్చారు. అలాంటి పరుసవేది లాంటి మంత్రం ఇది. సినిమా తేసేది ప్రజలంతా చూసి మెచ్చటం కోసం. అప్పుడే డబ్బులొస్తాయి. ఇంకో సినిమా తీసి ఇంకా డబ్బులు సంపాదించవచ్చు. అలాకాక కళాకారుడు తనకు నచ్చినట్టు సినిమా తీస్తే ప్రేక్షకుడు దాన్ని మెచ్చకపోతే ఇంకో సినిమా తీసేందుకు డబ్బులుండవు. అతడిని నమ్మి పెట్టుబడి పెట్టేందుకు ఎవరూ ముందుకురారు. కాబట్టి సినీ కళాకారుడికి సినిమా రంగంలో మనుగడ వుండాలంటే హిట్ ఫార్మూలా తెలిసివుండాలి. కానీ ఏ సినిమా ప్రేక్షకులకు ఎందుకు నచ్చుతుందో ఎవారూ కచ్చితంగా చెప్పలేరు. ఇక్కడే సినీ నిర్మాణంలో మజా తెలుస్తుంది. భరించలేని బాధ తెలుస్తుంది.
ఆరంభంలో కళాకారులకీ సమస్య లేదు. అప్పుడు సినిమాలొక వింత. తెరపైన బొమ్మ కదిలితే చాలు, అది అద్భుతం. దాంతో రైలు వచ్చి ఆగటం, పడవ నడవటం, పక్షి ఏగరటం చూపినా ప్రజలు పడీ పడీ చూసేవారు.
మనిషి రొటీన్ భరించలేడు. కొన్నాళ్ళకి కొత్త తీరిన తరువాత ప్రేక్షకులను ఆకర్శించాల్సిన అవసరం కలిగింది. దాంతో ఏదో చిన్న సంఘటనల అవసరం వచ్చింది. ఈ అవసరాన్ని విదేశీయులు, రైలు దొంగతనాలు, హాస్యాలతో తీర్చుకుంటే మన వారు పౌరాణిక చిత్రాలతో తీర్చుకున్నారు. మాటలు లేకున్నా ఈ కథ అందరికీ అర్ధమయిపోతుంది. పైగా పవిత్ర మయిన భగవంతుని కథలను చూస్తున్న అనుభూతి కలుగుతుంది.
కానీ ఇదీ ఎక్కువ కాలం సాగదు. ఆ కాలంలో ఇలాంటి ధార్మిక సినిమాలు ప్రజలలో ధర్మ భావనలను పెంపొందించి దేశభక్తిని జాగృతం చేస్తున్నాయని ప్రభుత్వం ఇలాంటి సినిమాలపైన ఆన్కలు విధించింది. నిర్మాతలను ఇబ్బందుల పాలు చేసింది. ఈలోగా పార్సీ, ఉర్దూ కళాకారులు రంగప్రవేశం చేసారు. చారిత్రికాలు, జానపదాలు మొదలయ్యాయి. ఇదేసమయానికి మరోవైపునుంచి ఆంగ్ల విద్యావంతులయినవారు వారి ప్రభావాన్ని మోసుకువచ్చారు. ఇంకోవైపునుంచి స్వతంత్రోద్యమాన్ని సాంఘిక సంస్కరణలతో ముడిపెట్టటంతో సాంఘికంగా సందేశాన్నిచ్చే సంస్కరణల సినిమాలు మొదలయ్యాయి. కొన్నాళ్ళకి కమ్యూనిజం ఆదర్శంగా సమాజంలో ప్రవేషించింది. దాంతో సాంప్రదాయ వ్యతిరేకత అభ్యుదయం అయ్యింది. ధనికులు మూకుమ్మడిగా విలన్లయ్యారు. పేదరికం హీరోయిజం అయ్యింది. సాంప్రదాయ నిరసన, సాంప్రదాయ ఉల్లంఘన హిట్ ఫార్మూలాల్లో ఒకటయింది.
ఇదే సమయానికి దేశంలో వాతావరణం మత పరమయిన ద్వేషాలతో కలుషితమయింది. ఇది కళాకారులపైన వారు నిర్మించే సినిమాలపయినా పడింది. దాంతో సినిమాలలో మతపరమయిన భావనలను ప్రదర్షించకూడదన్న నియమం ఎవరూ పెట్టకుండానే అమలులోకి వచ్చింది. ఒకవేళ చారిత్రిక సినిమాలు తీసినా అవి మహమ్మదీయుల గొప్పతనాన్ని చెప్పేవిగానే వుండాలని మతపరమయిన భావనలను రెచ్చగొట్టేవిగా వుండకూడదన్న్ నియమమూ మొదలయింది.
ఈ కాలంలో జరిగిన పరిణామాలు గమనిస్తే మన సినిమాలు మూసలోకి ఎందుకు పరిమితమయ్యాయో బోధపడుతుంది. మన సినిమాలు కొన్ని ఫార్మూలలకే ఎందుకు కుచించుకుపోయాయో అర్ధమవుతుంది.
సినీ కళాకారుడికి ఫార్మూలా ఎందుకవసరమవుతుందో ముందే అనుకున్నాము. బోలెడన్ని డబ్బులు ఖర్చుపెట్టి ఒక సినిమా నిర్మిస్తాడు. ప్రేక్షకులు దాన్ని మెచ్చకపోతే దివాళా తీస్తాడు. దేన్నయినా పోగొట్టుకున్న చోటే వెతుక్కోమంటారు. అందుకని సినిమాలో డబ్బులు పోగొట్టుకున్న వారు మళ్ళీ సినిమాల్లోనే సంపాదించాలని చూస్తారు. ఇంతకుముందు తనకు నచ్చినట్టు తీసి భంగపడ్డవాడు, ఇప్పుడు ప్రక్షకులేది మెచ్చుతున్నారో అది తీయాలనుకుంటాడు. విజయం సాధిస్తే అది కొనసాగుతుంది. లేకపోతే, చెప్పేదేమీ వుండడు.
ఇలాంటి పరిస్థితి తప్పించుకోవాలంటే, ప్రేక్షకులు దేన్ని మెచ్చుతున్నారో గమనించాలి. ఇది తెలుసుకోవాలంటే హిట్ అయిన సినిమాలను గమనించటం తప్ప వేరే మార్గంలేదు. హిట్ అయిన సినిమాలో ఏయే అమ్షాలు ప్రజలు మెచ్చారో చూసి ఆయా అమ్షాలనే అనుసరిస్తే ఢోకాలేదనుకుంటారు. అలా ఏర్పడుతుంది ఫార్మూలా. ఈ అనుసరించటానికి మన సినిమాలేకాదు, విదేషీ సినిమాలూ పనికివస్తాయి.
ప్రపంచంలో దేశాలూ, భాషలూ, సంస్కృతులూ వేరయినా మానవ సంవేదనల స్వరూపమొక్కటే. కాబట్టి ఒకచోట సినిమా ప్రజలకు నచ్చిందంటే, దాన్ని దిగుమతిచేస్తే, మిగతా ప్రజలకూ నచ్చేవీలుంటుంది. కాబట్టి, తెలియనిదాంతో ప్రయోగం చేసేకన్నా, ఒక చోట విజయం సాధించిన దాన్నే ఆధారంచేసుకుంటే, మంచిది అనుకుంటారు. ఇలా కాపీలు, అనుకరణలూ మొదలవుతాయి.
మన చలనచిత్ర రంగం ఇలా పనిచేస్తుంది. స్వయంగా ప్రయోగం చేసి దెబ్బ తినేకన్నా నిరూపణ అయిన దానితో పరాచికాలాడటం మేలు అన్నది మనవారి అభిప్రాయం. known devil is better than unknown angel లాంటిదన్నమాట ఇది.
ఇలా safe గా సినిమాలాటలాడాలన్న ఆత్రంలో మనవారు వేరేవారు ప్రయోగాలు చేసి విజయం సాధించేవరకూ ఎదురుచూస్తారు. ఏదయినా విజయం సాధించగానే వెంటనే దాన్ని అనుకరిస్తారు. నకళ్ళకు నకళ్ళు తయారుచేస్తారు. అందుకే మనవారు మన స్థాయిలో విజయం సాధించినా అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడున్నారో అక్కడేవుండిపోతున్నారు.
అయితే, ఈ పరిస్థితి ఆరంభమ్నుంచీలేదు. ఆరంభంలో, అక్కడినుంచి ప్రేరణపొందినా కళాకారులు తమదంటూ ప్రత్యేక సృజనాత్మక కళాకౌశలాన్ని ప్రదర్శించేవారు. చక్కగాతీసి ప్రజలను మెప్పించాలని చూసేవారు. అయితే, అనేక అంశాలలో ఇతర దేశాలకూ మనకూ తేడాలున్నాయి. ముఖ్యంగా మన దేశంలో అక్షరాస్యత రక్కువ ఇది కూడా మనసినిమాల రూపు రేఖలను అత్యంత బలంగా నిర్దేషించిన విషయాలలో ఒక ప్రధానమయిన విషయం.
మూస సినిమాలేరావటం నుంచి కళాకారుల ప్రేరణ, నిరక్షరాస్యతా ప్రభావం వరకు తదుపరి వ్యాసాలలో చర్చిద్దాం.