రాతలు – కోతలు

జూన్ 30, 2008

నా బ్లాగుకు వర్షాకాలం వచ్చింది!

ప్రచురించిన వర్గము pustaka paricayamu — కస్తూరి మురళీకృష్ణ @ 3:30 పూర్వాహ్నం

అవును, నా బ్లాగుకు వర్షాకాలం వచ్చేసింది. నల్లటి మేఘాలు దట్టంగా అలముకున్నాయి. తీవ్రమయిన గాలులు, ఘోరంగా, ప్రచండ వేగంతో వీస్తున్నాయి. ఇంత జరుగుతున్నా, వాన వస్తుందో, లేదో తెలియని పరిస్థితి. నా బ్లాగు కూడా అలాంటి డోలాయమాన పరిస్థితిలో వచ్చింది.

వాన రాకడా, ప్రాణం పోకడా చెప్పలేమంటారు. అలాగే, ఇకపయిన, నేను ఎప్పుడు పోస్టింగ్ చేస్తానో తెలియని పరిస్థితి ఏర్పడింది. నేను నాందేడ్ వెళ్ళక తప్పని పరిస్థితి వచ్చింది.

నాకు, మా ఆఫీసులో ప్రమోషన్ వచ్చింది. నాందేడ్ లో పోస్టింగ్ వచ్చింది. దాదాపుగా ఒక సంవత్సరం అక్కడ పని చేశాను. చివరికి విసిగి, లాంగ్ లీవ్ పెట్టి, ఎండాకాలమంతా ఇంట్లో, రాసుకుంటూ, పుస్తకాలు చదువుతూ, సినిమాలు చూస్తూ, బ్లాగుతూ గడిపేశాను. కానీ, ఇప్పుడిక వెళ్ళక తప్పని పరిస్థితి వచ్చింది. కాబట్టి, రేపు నాందేడ్ ప్రయాణమవుతున్నాను.ప్రతి శని, ఆది వారాలు హైదెరాబాదు వస్తాను. కానీ, ఆ రెండు రోజులలోనే వారమంతా ఇవ్వాల్సిన రాతలు రాసేసి ఇచ్చేసి పోవాల్సివుంటుంది. అయినా సరే, వీలున్నప్పుడలా బ్లాగుతూనేవుంటాను. నాందేడులో కూడా అవకాశాన్ని చూసుకుని బ్లాగుతాను. ఎలాగయినా బ్లాగ్లోకంలో మితృలతో connect అయి వుండాలనే నా పట్టుదలను, అకుంఠిత దీక్షను మితృలంతా గుర్తించి, అభినందించి, ప్రోత్సహించాలని వేడుకుంటున్నాను. ఎప్పుడు వస్తుందో తెలియని వర్షంలా వర్షించే నా రాతలు కోతలను అనుభవించి ఆనందించాలని ప్రార్ధిస్తున్నాను.

మళ్ళీ ఎప్పుడో నాకు మంచి రోజులు వస్తాయన్న ఆశతో, ఆకశంతో సంబంధంలేకుండా వర్శిస్తున్న తడి కళ్ళతో, రేపు నాందేడ్ ప్రయాణమవుతున్నాను.

ఇకపయిన, హైదెరాబాదులో పడే ప్రతివర్షం నా కన్నీటి ధార  అని గ్రహించ ప్రార్ధన! 

జూన్ 28, 2008

నేను చదివిన మంచి పుస్తకం-chasing the rainbow.

ప్రచురించిన వర్గము pustaka paricayamu — కస్తూరి మురళీకృష్ణ @ 8:01 పూర్వాహ్నం

మనోజ్ దాస్ పేరు ఎవరికీ కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒరియా, ఇంగ్లీషు భాషలలో ఆయన రచనలు సాహిత్యప్రేమికులందరినీ అలరిస్తూన్నాయి.పలు ఇతర భాషలలోకి కూడా ఆయన రచనలు అనువాదమయ్యాయి.ఈ పుస్తకం చేసింగ్ ది రై బో అతని బాల్యం నాటి జ్ఞాపకాల సంకలనం.ఈ పుస్తకం టాగ్ లైన్-growing up in an indian village.

పాతకాలం నాటి వ్యక్తుల బాల్యాల్లాగే మనోజ్ దాస్ బాల్యం కూడా మనల్ని మంత్రముగ్ధులను చేస్తుంది. ఆనద పరవశులను చేస్తుంది.నవ్విస్తుంది.ఆలోచింప చేస్తుంది.అతని కథలలాగే, జీవితం పట్ల అవగాహనను కలిగిస్తుంది.

ఇందులో మొత్తం 28 అధ్యాయాలున్నాయి.ప్రతి అధ్యాయంలో అతని బాల్యానికి సంబంధించిన ఒక అనుభవం, ఒక జ్ఞాపకం పొందుపరచారు. వంశధారా, మహానదులు, ఎగసిపడే సముద్ర కెరటాలతో, అలల హోరుతో సహా మన కళ్ళముందు నిలబడతాయి.బాల్యం లోని అమాయకత్వం, ఆలోచనలు, మళ్ళీ మనకు మన బాల్య స్మృతులను గుర్తుకుతెస్తాయి. ఈ కథలు చదువుతూ పాథకుడు తన బాల్యానుభవాలను స్మరిస్తాడు. అంటే ఈ ఒక్క పుస్తకం చదవటం వల్ల డబుల్ మజా అన్నమాట.

ఆరంభంలో, సముద్రంలో కొట్టుకు పోయిన ఇద్దరు ప్రేమికుల కథ నుంచి, దయ్యలు, భూతాలు, ఎలుగుబంట్లు, పులుల్లు, టీచర్లు, రాజ్యాలు కోల్పోయిన రాజులు, అభిమాన ధనులయిన వ్యక్తులు, ఇలా ఒక అద్భుతమయిన ప్రపంచం మన కళ్ళముందు నిలుస్తుంది.

దీన్లోంచి ఒక చిన్న కథ చెప్తాను.

చిన్నప్పుడు నాటకం చూస్తాడు. దాన్లో రాధా, కృష్ణుడి వేశం కూడా ఇద్దరు మగ పిల్లలు వేస్తారు. వారితో సముద్రం ఒడ్డున నడుస్తూంటే, ఒక ముసలమ్మ రాధా కృష్ణుల కోసం తపిస్తూంటుంది. ఈ పిల్లలే ఆ వేశాలు వేసారని చెప్పినా నమ్మదు. ఇది రచయితలో నిజానిజాలు, భ్రమలూ, కల్పితాల గురించి ఆలోచనలు కలిగిస్తుంది. చెప్పనక్కర్లేదు, ప్రస్తుత సమాజంలో, తెరపైన భ్రమల మోజులో పడిన వారందరికీ ఈ సంఘటన కనువిప్పు కలిగిస్తుంది.

ప్రేమ గురించిన రొమాంటిక్ ఆలోచనల సంఘటన కూడా ఎదను కదలించే రీతిలో వుంటుంది.ఇలా ప్రతి ఒక్క సంఘటన మన మనసులో స్థిరంగా ముద్ర వేసేదే.

అందరూ తప్పని సరిగా చదవాల్సిన పుస్తకం ఇది. జీవిత చరిత్రలా కాక ఒక రమ్య మయిన కథల సంకలనం లా చదువుతూ పోవచ్చు.

ఈ పుస్తకాన్ని ఆక్స్ ఫొర్డ్ యూనివర్సిటీ ప్రెస్ వారు 2004 లో ప్రథమంగా ముద్రించారు.వెల అప్పుడు, 275/-.     

జూన్ 27, 2008

దశావతారం-ఒక దోషావతారం.

ప్రచురించిన వర్గము sinemaa vishleashaNaa. — కస్తూరి మురళీకృష్ణ @ 6:20 పూర్వాహ్నం

నార్సిస్సస్ గురించి అందరికీ తెలుసు.తన అందం చూసి తనని తానే మోహించిన వ్యక్తి అతడు. తన అందం చూసి మురిసిపోవటాన్ని నార్సిసం అంటారు. ప్రతి కళాకారుడిలో నార్సిజం తప్పనిసరిగా వుంటుంది. అది లేకపోతే, కళాకారుడు కళను సృజించలేడు.అయితే, ఈ నాసిజం హద్దులుదాటితే, అతని కళ దెబ్బతింటుంది.కళ స్థానాన్ని కూడా కళాకారుడే ఆక్రమిస్తాడు. ఇందుకు మంచి ఉదాహరణ కమలహాసన్ నిర్మించి నటించిన దశావతారం!

కమలహాసన్ నటనాపటిమ గురించి ఎవరికీ సందేహాలు లేవు. మన దేశంలో వున్న అత్యద్భుతమయిన నటులలో అగ్రస్థానాన్ని ఆక్రమిస్తాడు. మన సినిమాల్లో నటులకు తమ నటనను ప్రదర్శించేందుకు సరయిన అవకాశాలు రావు. అయినా సరే, తానే తన నటన ప్రతిభను ప్రకటించే రీతిలో సినిమాలు రూపొందిస్తూ వస్తున్నాడు కమల్. ఇది చేయటానికి కూడా నటుడికి ఆత్మ విశ్వాసంతో పాటూ, నార్సిజం కూడా అవసరమే. అయితే, దశావతారం చూస్తూంటే, కమల్ నార్సిజం హద్దులు దాటిందని పిస్తుంది.

ఎప్పుడయితే, నటుడి ఇమేజీ కోసమని స్క్రిప్టును విస్మరిస్తారో అప్పుడు నటుడే కాదు సినిమా కూడా దెబ్బ తింటుంది. దశావతారం సినిమాలో కమల్ ఉన్నాడు. అద్భుతమయిన స్పెషల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. కానీ స్క్రిప్తు లేదు.

సినిమాలో ఎంత సేపూ కమల్ పాత్రలను ఎలా తెరపైకి తేవలన్న ఆత్రం తప్ప వారిని కథలో విడదీయరాని భాగంగా చేయాలన్న తపన కనబడదు.ఎదో ఒకటి చేసి తెరపైన గోల చేయాలన్న ఆత్రం తప్ప కథను ఒక పద్ధతి ప్రకారం, ఒక సన్నివేశంలోంచి, మరో సన్నివేశంలోకి, అవిచ్చిన్న ధారలా కథనాన్ని రూపొందించాలన్న ఆలోచన లేదు. దాంతో, తెరపైన ఒకదాని తరువాత మరొకతి అర్ధంలేని సన్నివేశాల పరంపరలు,  కాలము, స్థలాలతో సంబంధం లేకుండా, వస్తూంటాయి. పోతూంటాయి. కొన్ని నవ్విస్తే, మరికొన్ని విసుగు కలిగిస్తాయి. చిరాకు తెప్పిస్తాయి.

time and space గురించి ఆలోచిస్తే,  దశావతారం లో అవి ఏకోశానా కనబడవు. లాజిక్ సునామీకన్నా 1200 సవంత్సరాలముందే ఎక్కడికో కొట్టుకు పోతుంది. సినిమా అంతా ఏపాత్రను చూసినా అది కమల్ హాసనా అని వెతకటంలో సరిపోతుంది. ఒక దశలో మల్లికా అనిచెప్పి ఆ పాత్రకూడా అతనే వేశాడేమో అన్న అనుమానం వచ్చింది. పది పాత్రలు వేసేయాలన్న ఆత్రం తప్ప ఆ పాత్రలను సరిగా తీర్చిదిద్ది, వాటికి విషిష్టమయిన వ్యక్తిత్వాన్నిచ్చి, ప్రత్యేకంగా నిలిపి, మరపురాని నటన ప్రదర్శించాలన్న ఆలోచనను కమల్ ప్రదర్శించలేదు. పొడుగు వాడిలా, సిక్కు గాయకుడిలా, ముసలామెలా కమల్ వేయాల్సిన అవసరమే లేదు. అవి అర్ధం లేని పాత్రలు. దళిత నాయకుడి పాత్ర కావాలని చొప్పించారు. పదో పాత్ర కావాలి కదా! ఇక కిరాయి హంతకుడిలా, దట్టించిన మేకప్ తో అసహ్యంగా వున్నాడు. కృత్రిమత్వం తెలుస్తూనేవుంది. బుష్ పయిన జాలి కలిగింది. 13 వ శతాబ్దం వీరుడిని చూస్తే పాపం పిచ్చివాడు అనిపించింది. గుడిలో అంత రక్త పాతం చేసి, హీరోయిజం తప్ప సాధించిందేదీ లేదు. హీరోగా కమల్ ముసలివాడయిపోయాడని తెలిసింది. వయసుకు తగ్గ విభిన్న పాత్రలపయిన దృష్టి పెడితే మంచిది. దేవుడున్నాడా లేడా అన్న చర్చ తెలికగా, పనికిరాని రీతిలో వుంది. చివరి దృష్యంలో, హీరో, హీరోయిన్లు, పడవ దగ్గర నిలబడి, ప్రేమ మాటలు మాట్లాడుతూంటే, నేపధ్యంలో ప్రజలు అటూ ఇటూ పరుగిడుతూంటారు. అంతా సునామీలో చిక్కి గోలగా వుంటే వీళ్ళాకసలీ చర్చ ఎలా చేయాలనిపించిందనిపిస్తుంది. గమనిస్తే, వెనక మనుషులు, అక్కడక్కడే చుట్టూ తిరుగుతూ వేదన నటిస్తున్నారని తెలుస్తుంది. కమల్ తన మేకప్పుపయిన చూపిన శ్రద్ధ సినిమాలో ఇంకే అంశంపయిన చూపలేదని ఇది నిరూపిస్తుంది.

ఇక జపాన్ వాడి పాత్రలో కమల్,  deformed చీనా వాడిలా అనిపించాడు. సీబీఐ వాడి పరిశోధన చూస్తే, మన దేశంలో తీవ్ర వాదులు ఇంత స్వేచ్చగా ఎలా తిరుగుతున్నారో అర్ధమవుతుంది.ఇక సంగీతం గోల గోలగా వుంది. ఒక్క నాయిక పాడే పాట వినసొంపుగా వుంది. ఇళయరాజా లేని లోటు తెలుస్తోంది. సునామి స్పెషల్ పరవాలేదనిపిస్తుంది.అయితే, సినిమా చూసిన తరువాత రోడ్డు మీద కనబడిన ప్రతివాడూ వేశమేసుకున్న కమల్ అనిపిస్తారు.

కమల్ కు ఒక ఉచిత సలహా.వొచ్చే సినిమాలో అన్ని వేశాలూ ఆయనే వేస్తే, ప్రేక్షకులకు కమల్ ను వెతికే బాధ తప్పుతుంది. స్క్రిప్టు పయిన అప్పుడూ దృష్టి పెట్టకపోతే, ఆ సినిమా కమల్ ఒక్కడే చూసుకోవాల్సివస్తుంది.          

తరువాతి కాగితం »

WordPress.com లో Blog పెట్టుము.