ఐ.పి.ఎల్ నెమ్మది నెమ్మదిగా చివరి దశ వైపు పాకుతోంది.ఆటలు ఊహించిన ఫలితాలతో కొత్తదనాన్ని,ఉత్సాహాన్ని,ఉద్విగ్నతనూ కోల్పోతున్నాయి.ఇప్పుడు ఆటగాళ్ళ వ్యక్తిగత ప్రతిభలూ,నైపుణ్య ప్రదర్శనల పైన ఆసక్తి మిగిలి వున్నాయి.ఎందుకంటే,నెమ్మదిగా ముంబాయి దేవుడు కూడా మనిషేనని అర్ధమవుతోంది.సచిన్ ఆడటం మొదలుపెట్టిన ఆవేశం తగ్గి ముంబాయి ఆట మామూలు స్థాయికి వస్తోంది.ఇంకా జయసూర్యకు మత్తు దిగనట్టువుంది.కానీ మిగతావారు భూమి మీదకు వచ్చేశారు.సచిన్ కూడా వయసు ప్రభావం గ్రహించినట్టున్నాడు.తనకన్నా ఎక్కువ వయసున్న జయసూర్య ధన ధనా కొడుతూంటే,చూసి ఆనందిస్తూ ఆటకు వయసుకూ సంబంధం లేదని ఆనందిస్తూన్నట్టున్నాడు.రాబోయే రెండు ఆటల్లో జయసూర్యకు దీటుగా సచిన్ ఆడకపోతే,దేవుడు కూడా ముంబాయిని సెమి ఫైనల్ కు పంపలేడు.
రాజస్థాన్ రాయల్స్ ఎదురులేని రాచరిక తేజాన్ని ప్రదర్శిస్తూన్నారు.అయితే ఇకనుంచీ ఒక్క ఆటలో చిన్న పొరపాటు జరిగినా ఇంతకాలం చూపిన ప్రతిభ వ్యర్ధమవుతుంది.అయితే,వున్న జట్లలో సంపూర్ణమయిన జట్టుగా ఎదిగింది రాజస్థాన్ రాయల్సే.
డెల్లి దయ్యాలను దురదృష్టం వెంటాడుతోంది.ఎప్పుడొస్తుందో తెలియని వర్షంలాంటి ఆటగాడు సెహ్వాగ్ నేతగా ఆడే ఈ జట్టు పరిస్థితి కూడా వచ్చీ రాని వానలా వుంది.చెన్నయ్ జట్టు గెలుపు ఓటమి పైన వీరు ముందుకు పోవటం ఆధార పడివుంది.
పంజాబ్ జట్టు,రాజస్థాన్ తరువాత బాగా ఆడుతున్న జట్టు.మిగిలిన ఆటలలో యువరాజ్ పెద్ద స్కోరు బాకీ వున్నడు.అదే జరిగితే ఈ జట్టు ఆనందిస్తుంది.కలకత్త తో జరిగిన ఆట వీరికి ఒక హెచ్చరిక లాంటిది.
చెన్నయ్ జట్టు పట్ల వ్యక్తిగతంగా వ్యతిరేకత లేక పోయినా,ధోనీ ఒక వ్యాపార ప్రకటనలో యూ,ఫాస్ట్ బౌలర్ రాస్కాల్స్ అనటంతో అతని పట్ల విముఖత కలిగింది.కాబట్టి ఏ ఫాస్ట్ బౌలర్ రాస్కలో చెన్నయ్ జట్టును మట్టి కరిపిస్తే చూసి ఆనందించాలని వుంది.
దక్కన్ చార్జెర్లు పాపం మంచి జట్టు వుండి కూడా మంచి ఆట చూపలేక పోయారు.అందరికీ రెండు పాయింట్లిచ్చే దయా దాక్షిణ్యాలుకల జట్టుగా మంచి పేరు మాత్రం సంపాదించారు.
కలకత్త రైడర్లు కూడా మంచి జట్టు అయివుండీ దెబ్బ తిన్నారు.ఆరిపోయే దీపం వెలిగినట్టు చివరి ఆటలో గంగూలీ బాగా ఆడాదు.ఇదే పట్టుదల మొదటి నుంచీ చూపితే బాగుండేది.
పోటీలు అయిపోతూంటే ఆట తీరు అర్ధమయింది బెంగళూరు చాలెంజెర్లకు.ద్రావిడ్ వ్యక్తిగతంగా ఉత్తమ ఆట ప్రదర్శిస్తున్నా,నాయకుడిగా విఫలమయ్యాడు.భారత జట్టు నాయకత్వం నుంచి తప్పుకోవటం మంచి నిర్ణయం అని రుజువయింది.ఆరంభమ్నుంచీ ఏడుస్తూ వస్తున్న ఈ జట్టుకు చివర్లో మంచి యువ ఆటగాళ్ళు దొరికారు.ఇతర జట్లలో యువకులు వచ్చిన అవకాశాలు వాడుకుంటూంటే ఈ జట్టులో అందరూ అన్ని బాధ్యతలూ ద్రావిడ్ పై నెట్టి ఊరుకున్నారు.ఇప్పుడు వారికి తాము చేజార్చుకున్న అవకాశాలు అర్ధమయ్యాయి.దాంతో చివరలో నయిన విజృంభిస్తున్నారు.ఈ గెలిచే అలవాటును వొచ్చే సంవత్సరం కొనసాగించాలి.
ఐ.పి.ఎల్ పోటీలవల్ల యువకులకు మంచి అవకాశాలు దొరికాయి.పాత హీరోలు అలసిపోయారని ఇప్పుడు కొత్త హీరోలు ముందుకు వచ్చారు.రోహిత్,అస్నోద్కర్,గోని,యూసుఫ్,గోస్వామి వంటి వారికి మంచి ఎక్స్పోజర్ లభించింది.
ఐ.పి.ఎల్ వల్ల కలిగిన మరో లాభమేమిటంటే,ఎండాకాలంలో పిల్లలను ఎలా ఆడించాలన్న బాధ తప్పింది.పొద్దుతినుంచి రాత్రి జరిగే ఆట చర్చ,అంతకు ముందు జరిగిన ఆట చర్చ.ఎండాకాలం గడిచిపోయింది.సినిమాలు,షికార్లూ అన్నితి బాధలు తప్పాయి.జూన్ లో స్కూళ్ళు తెరుస్తారు.అయిపోయాయి,సెలవులు.అందుకే అంటారు,ప్రతిదానివల్ల ఏవో లాభాలుంతాయని.