ఇవాళ్ళ అంటే,22.5.2008 నాడు హైదేరాబాదులో తెలుగు రచయితలనందరినీ ఒక దగ్గర చేర్చాలనే ఉద్దేశ్యం తో సృజని అంటే,సృజన జన నిలయం అనే సంస్థ ఏర్పాటయింది. మాధాపూర్ లోని స్టేట్ ఆర్ట్ గాలెరీ ఆడిటోరియం లో ఈ సంస్థ ఏర్పాటు సమావేశం జరిగింది.
రాంపా అనే కార్టూనిస్ట్,హాస్య కథల రచయిత స్వయంగా పూనుకుని,రచయితలందరినీ కలసి ఈ సంస్థ ఏర్పాటుకు కారకులయ్యారు.మృణాలిని,తనికెళ్ళ భరణి,జనార్దన మహర్షి,ఇంద్రగంటి జానకీ బాల వంటి వారు ఈ సంస్థ కార్యవర్గం లో సభ్యులు.అయితే,సభకు మాత్రం,మృణాలిని,తనికెళ్ళ భరణిలు వచ్చారు.మిగతా వారు రాలేదు.ఆపద్ధర్మంగా ఎమెస్కో అధినేత దూపాటి విజయ కుమార్ గారు చివరి క్షణంలో ముఖ్య అతిథిగా విచ్చేశారు.ఇంత చేసీ సభలో రచయితలు లేరు.
హైదెరాబాదులో అలవాటయిన తీరులో సాహిత్య సమావేశాలకు రచయితలు దూరంగా వున్నారు.మొత్తం హాలులో పట్టుమని పది మంది లేరు.రాంపా గారు గత నేల రోజులుగా ఇదే పనిగా అందరినీ కలిసి బ్రతిమిలాడి,ఒప్పిస్తే వస్తామన్న అందరూ ఏవేవో పనుల వల్ల రాలేక పోయారు.ఇదీ మన తెలుగు రచయితల పరిస్థితి.
తెలుగు సాహిత్యంలో ప్రస్తుతం ఏ ఉద్యమంలోనూ చేరక,ఏ ఇజానికీ కొమ్ము కాయక,ఎటువంటి వర్గానికీ,ప్రాంతీయ కూటములకు చెందక పోతే రచయితకు మనుగడ లేదు.అలాంటి కూటములు వర్గాలకూ అతీతంగా రచయితలందరినీ కేవలం సాహిత్య సంబంధంతో కలపాలనుకుంటే ఇదే పరిస్థితి!
అయితే,ఎంత దూర ప్రయాణమయినా చిన్న తొలి అడుగుతో ఆరంభమవుతుంది.ఇది శుభారంభమని అనుకుంటున్నాము.ఎలాగో బంతిని మైదానంలోకి విసిరాము.ఇక అది ఎటు ప్రయాణిస్తుందో,ఎంత దూరం ప్రయాణిస్తుందో చూడాలి.
వొచ్చే నేల మళ్ళీ సమావేశమయి,సభ్యత్వ వివరాలు,కార్య ప్రణాలికలూ వేయాలని అనుకుంటున్నాము.
ప్రస్తుతం ఒక రచయిత తన రచనలను బ్రతికించుకోవాలంటే తానే పుస్తకాలను అచ్చువేసుకోవాల్సి వస్తోంది.ఆ తరువాత పట్టుమని పది కాపీలు కూడా కొనేవాళ్ళు లేరు.ఈ పరిస్థితి మార్చాలని మా ఉద్దేశ్యం.రచయితలంతా ఒక సంఘంలా ఏకమయి,ఒక రచయిత పుస్తకాలు మరో రచయిత కొనేలా చేయాలని మా పధకం.కనీసం అచ్చయితే వంద పుస్తకాలయినా అమ్ముడుపోయేట్టు చూడాలని మా తాపత్రయం.పుస్తకం అచ్చయితే ఆ విశయం పది మందికీ తెలిసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని మా కల.ఇజాలకు,కుల మత ప్రాంతీయ సంకుచిత భావలకు అతీతంగా తెలుగు సాహిత్యాన్ని నిలపాలన్నది మా కోరిక.
నెట్ లో ఇంతమంది రచయితలున్నారు.ఆసక్తి వున్నవారు మాతో చేరాలని వుఙ్నప్తి.రచయితలకోసం రచయితలు ఏర్పరుచుకుంటున్న సంస్థ సృజని.మీ అందరి ప్రోత్సాహం మాకు ఊపిరి.హైదెరాబదు రచయితలకు తీర లేదు.నెట్ రచయితల స్పందన ఎలా వుంటుందో?