దేవర పల్లి రాజెంద్ర గారి బ్లాగులో వాళ్ళమ్మ గురించి రాసినది చదివిన తరువాత నేను మా అమ్మ గురించి రాయకుండా వుండలేక పోతున్నాను.నేను రాయబోయేవి నా ఆంతరంగిక విషయాలు. నా డైరీ తప్ప ఇంకెవరికీ,కనీసం నా భార్యకు కూడా అనేక విషయాలు తెలియవు.అవి ఇలా బహిరంగంగా రాయటం గురించి నాలో బోలెడంత మథనం జరుగుతూన్నా రాయాలన్న ఆవేశాన్ని అణచుకోవటం కష్టంగా వుంది.వీలయినంత విచక్షణ ప్రదర్శిస్తూ రాసే ప్రయత్నం చేస్తున్నాను.
నా జీవితంలో నేను ఏమి సాధించినా దానికి అమ్మే కారణం.నా వైఫల్యాలకు నా వ్యక్తిత్వ లోపం,నాలో ఉన్న ఇతర జీన్స్ ప్రభావం కారణం అని నేను ఎటువంటి సంకోచం లేకుండా చెప్పగలను. మనుషులను అర్ధం చేసుకోవటం,ఎవరినీ నొప్పించకుండా సానుభూతితో మెలగటం అమ్మ స్వభావం.అది నాకూ వచ్చింది.అయితే,హఠాత్తుగా విచక్షణ కోల్పోయి మనసులో నొప్పించాలని లేకున్నా మాట జారటం కూడా వచ్చింది. నా ప్రమేయం లేకుండానే అలా ప్రవర్తిస్తున్నప్పుడు ఆశ్చర్య పోతూంటాను.ఎందుకిలా ప్రవర్తిస్తున్నానని తర్కించుకుంటాను.నా ప్రమేయంలేకుండా నన్ను నాలో వున్న కొన్ని లక్షణాలు అల ప్రవర్తించేందుకు ప్రోద్బలం ఇస్తున్నాయని,నా సహోదరీ సహోదరులను చూస్తే అర్ధమయింది.అలాగని నా తప్పులకు వేరే వాళ్ళని బాధ్యులను చేయకుండా ప్రవర్తనను సవరించుకునే ప్రయత్నాలు చేస్తూనే వున్నాను. ఒక అడుగు ముందుకూ,రెండడుగులు వేస్తూ పడుతూ లేస్తూ సాగుతూన్నాను.
అమ్మ శాంత స్వభావురాలు.ఎవరినీ నొప్పించదు.తనను నొప్పించిన వారిని కూడా పోనీలే ఎవరి పాపం వారిది అని వదిలేస్తుంది.చాలా మెత్తని స్వభావం అమ్మది.అయితే,మీతది కాబట్టి మొత్తవచ్చని ఎవరయినా అనుకుంటే పొరబడ్డట్టే!
నాన్నగారు లెక్చరరు.ఆ కాలంలో ఆర్ధిక ఇబ్బందులను తట్టుకునేందుకు అమ్మ ఉద్యోగం ఆరంభించింది.ఆ కాలంలో అదొక సంచలనం.బంధువులంతా అమ్మను దూషించారు.ఎకసక్కేలాడారు.ఇల్లు దాటి బయటకు వెళ్ళే మహిళ మంచిది కాదని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు.అమ్మకు నాన్న గారి అండ వుండేది.అంటే మా నాన్న గారు ఎంతో ముందు చూపుతో వ్యవహరించారన్నమాట.
11 మంది సంతానంలో మా నాన్నగారే పెద్దవారు.ఇంటి బాధ్యత ఆయనదే.అమ్మ,నాన్న సంపాదిస్తూ తమ సంసారమే కాక ఇతరులనూ పోషిస్తూండేవారు.మా బాబాయిలూ,అత్తాయ్యలూ అంతా మా దగ్గిరే వుండి చదువుకున్నారు.అందరికీ చాకిరీ చేస్తూ,వుద్యోగం చేస్తూ,మమ్మల్ని చూసుకుంటూ,అర్ధికంగానే కాదు మానసికంగా కూదా నాన్నగారికి చేదోడు వాదోడుగా నిలుస్తూ ఒక మనిషి ఇన్ని పాత్రలను సమర్ధవంతంగా నిర్వహించేది.ఇప్పుడు ఒక్క పిల్లవాడినే చూసుకోలేక బాధలు పడేవాళ్ళని చూస్తూంటే నవ్వొస్తుంది.మేము అయిదుగురం.మేముకాక బాబాయిలు,అత్తయ్యలు,ఇతర బంధువులు.ఏ లోపమయినా మూతిముడుపులు అలుగులు.అయినా అమ్మ పల్లెత్తు మాట అనేదికాదు.నన్నిలా అన్నారు అని కోపం తెచ్చుకునేది కాదు.నాన్నగారి బాధ్యతలన్నీ తనవే అన్నట్టు ప్రవర్తించింది.నాన్నగారు పోయిన తరువాత కూడా ఈనాటికీ అలాగే ప్రవర్తిస్తోంది.
నా పెళ్ళి నిశ్చయమయిన తరువాత కాబోయే భార్యకు ఈ విషయం చెప్పాను. అమ్మని చూసిన తరువాత తనూ అర్ధం చేసుకుంది.అలానే ప్రవర్తిస్తోంది.దాంతో,చెల్లెళ్ళు,సోదరులూ అందరికీ మా ఇల్లు కేంద్రంగా అయింది.నాతో మాట్లాడని బంధువులుకూడా,నా భార్యను పలకరిస్తారు.మెచ్చుకుంటారు.
మా నన్నగారు మా చిన్నప్పుడే పోయారు.బంధువులకోసమని ఆయన వూరంతా అప్పులు చేసారు.అయినా సంతృప్తి లేని బంధువులు నన్న గారికి ఆఫీసునుంచి వచ్చే డబ్బులకోసం ఆత్ర పడ్డారు.
నాన్నగారు మరణించటంతో అమ్మ వుద్యోగం వదిలి తాతయ్య దగ్గిర వుండాలనుకుంది.కానీ వాళ్ళు మమ్మల్ని చదివించేబదులు హోటళ్ళలో,సైకిలు దుకాణాల్లో పెట్టాలని ఆలోచిస్తూండటంతో అమ్మ మళ్ళీ ఉద్యోగం ఆరంభించింది.అమ్మ పట్టుదల అందరికీ తెలిసింది.పైకి మెత్తగా వున్నా అవసరమయితే కాళికా మాత దుర్గా దేవి అవుతుంది.
వొంటరిగా అందరినీ ఎదిరించి అమ్మ మమ్మల్ని చదివించింది.నాన్నగారి అప్పుల్ని తీర్చింది.అమ్మ ఎన్ని కష్టాలు పడిందో చెప్పాలంటే అదొక వెయ్యి పేజీల గ్రంథం అవుతుంది.అడుగడుగునా తోడేళ్ళూ,నక్కలూ,పులులూ సిమ్హాలే.వాటి నదుమ అయిదుగురితో అమ్మ.ఆమె ధైర్యము,ఆత్మ విశ్వాసమూ మాకు స్ఫూర్తినిస్తున్నాయి ఇప్పటికీ.ఎటువంటి అడ్డంకి ఎదురయినా పోరాడటమే తప్ప,లొంగటం మాకు అలవాటు కాకపోవటానికి అమ్మే కారణం.
ఎదిగిన తరువాత గాన్ విత్ ద వింద్ నవల,మదెర్ ఇండియా సినిమాల్లో నాయికల పట్టుదలలు,ఆత్మ విశ్వాసాలు,ఆత్మ గౌరవాలు అమ్మ ముందు పనికి రావని అర్ధమయింది.అందుకే ఇప్పటికీ అమ్మే నాకు ఆరాధ్య దైవం.
ఆ కాలంలో అయిదుగురమూ గంజి తాగేవారం.ఒకడు కడుపు నిండా తింటే ఇంకొకడి కడుపు నిండదేమో అన్న భయాలతో త్యాగాలు చేసుకునే వారం.ఆ అలవాతు ఇప్పటికీ వుంది.జేబు నిండా డబ్బువున్నా ఒక్కడినే తినలేను.అయ్యో మిగతవాళ్ళు తిన్నారా అనిపిస్తుంది.తినకుండానే మిగిలిపోతాను.తిట్లు తింటాను.ఒకో సారి అన్నం సరిపోదని అమ్మ ముద్దలు కలిపి పెట్టేది.అప్పుడు అదొక ఆట.అలా ఎందుకు పెట్టేదో తరువాత అర్ధమయింది.
అయితే,అన్నానికి లేకున్నా పుస్తకాలు చదవటంలో ఎటువంటి రాజీ పడేది కాదు.అవసరమయితే ఏదో ఖర్చు తగ్గించేది కానీ పుస్తకాలు కొనటం చదవటం మనేది కాదు.అదే అలవాటు నాకూ వచ్చింది.పుస్తకాలు కొనే విషయంలో డబ్బు చూసుకోను. అది తప్ప మిగతా అన్నీ అనవసరమయిన ఖర్చులే అనిపిస్తాయి.
ఎంతో మంది అమ్మని ప్రలోభ పెట్టాలని ప్రయత్నించారు.హిసించి కసి తీర్చుకున్నారు.ఇష్టమొచ్చినట్టు మాటలన్నారు.అమ్మ అందరినీ క్షమించింది.వారు సహాయం అడిగినప్పుడు చేతనయినంత చేసింది.
చదివి వుద్యోగం చేసి చేతికి వస్తాడనుకున్న పెద్దన్నయ్య,ప్రచారక్ గా వెళ్ళిపోయినా అమ్మ అధైర్య పడలేదు.రెండో అన్నయ్య ప్రేమ పెళ్ళి చేసుకుని ఇల్లొదిలి పోయినా అమ్మ పట్టించుకోలేదు.
పరిస్థితి చూసి నేను చదువు మానేసి వుద్యోగం చూసుకుంటానన్నాను.పిచ్చి వేషాలు వేయొద్దని తిట్టింది.నేను వెళ్ళిపోయినా బాధలేదంది.చదివితేనే ఇంట్లో వుండమంది.అప్పుడొక విషయం అర్ధమయింది.అమ్మ ఒక ప్రవాహం లాంటిది.ఉప నదులతో పనిలేదు.ఎవరెన్ని రాళ్ళు విసిరినా బాధలేదు.తాను తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ప్రవహిస్తూనే వుంటుంది.అది అర్ధమయిన తరువాత అమ్మ చెప్పినట్టే విన్నాను.ఎమ్మెసీ చదివాను.కానీ అమ్మకు సహాయ పడాలన్న ఆత్రంలో రీసెర్చి వదిలి వుద్యోగం వెంట పడ్డాను.ఇప్పటికీ అప్పుడప్పుడు అమ్మ మాట వినాల్సిందని బాధ పడతాను.వుద్యోగంలోని అసంతృప్తి రచనలవైపు తోసింది.నా రచనలకు ప్రధమ పాఠకురాలు అమ్మనే!అమ్మ సలహాలతో నాదంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నాను.
నా పెళ్ళి కూడా అమ్మ చూపిన అమ్మాయిని కళ్ళు మూసుకుని చేసుకున్నాను.అత్యంత ఆనందంగా వున్నాను.బహుషా నాకు నచ్చిన వారిని చేసుకుని వుంటే ఈ పాటికి జుట్టుపీక్కుంటూ,చొక్కా చింపుకుని ఎందుకూ పనికి రాకుండా పోయేవాడిని.అమ్మ చెప్పిన మాట విన్నప్పుడల్లా నేను విజయం సాధించాను.
నేను కాలేజీలో వున్నప్పుడు,ఇర్వింగ్ వాలాస్ నవల ది ఫాన్ క్లబ్ తెచ్చుకుని రహస్యంగా చదువుతూంటే,చెల్లెలు చూసి అమ్మకు
చెప్పింది. అమ్మ నన్ను తిట్టలేదు.రహస్యంగా భయపడుతూ చేసే పనులు చేయవద్దంది.ఏపనీయినా ధైర్యంగా చేయమంది.ఇది నా జీవిత సిద్ధాంతంగా మారింది.రచనలు చేయటంలో మార్గదర్శకంగా నిలిచింది.ఆ సంవత్సరం నా పుట్టిన రోజున ఆ పుస్తకం అమ్మ నాకు గిఫ్ట్ గా ఇచ్చింది.ప్రతి పుట్టిన రోజూ అమ్మ నాకు పుస్తకాలే ఇస్తుంది.ఒక సారి డబ్బులు లేక ఒక నోట్ బుక్ ఇచ్చింది.దాన్ని నేను నా నిఘంటువుగా మార్చుకున్నాను.
ఇలా చెప్తూ పోతే నా జీవిత కథ మొత్తం చెప్పాల్సి వుంటుంది.ఆ కాలంలో నేను ఎప్పుడు గుడికి వెళ్ళినా అమ్మను ఆనందపరిచేట్టు చేయమని ప్రార్ధించేవాడిని.దేవుడు కరుణించినట్టు,నా భార్య అమ్మ స్నేహితుల్లా వుంటారు.నేను ఇద్దరు చెల్లెళ్ళ పెళ్ళికి అమ్మ పక్కన నిలిచాను.అమ్మ రిటైర్ అయిన తరువాత దేశమంతా తిప్పి చూపాను.ఇప్పుడూ ప్రతి ఆదివారం అమ్మ చూడాలన్న ప్రదేశానికి అందరం వెళ్తాం.నాకు అత్యంత ఆనందకరమయిన విషయమేమిటంటే,పెద్దన్నయ్య వచ్చి స్థిరపడినా అమ్మ నా దగ్గిరే వుండటం.ఎవరయినా ఎమయినా అన్న ఇది నా ఇల్లు అంటుంది.
చెప్పటం మరిచా,ఇల్లు కట్టిన తరువాత ఇంటికి అమ్మ పేరుతో సత్యవతీ సదనం అనే పెట్టాను.అయితే,ఎంత చేసినా తీర్చుకోలేని రుణాల్లో అమ్మ రుణం ఒక్కటే.అమ్మ ప్రభావంతో నా రచనల్లో మహిళ పాత్రలన్నీ ఉత్తమ వ్యక్తిత్వంతో వుంటాయి.మహిళల పట్ల చులకన భావం మచ్చుకి కూడా కనబడదు.
ఇంకా బోలెడన్ని చెప్పేవున్నా ఈ సారికి ఇంత చాలు. అమ్మ గురించి చెప్పేందుకు ఒక జీవిత కాలం సరిపోదు.
అయ్యా కస్తూరి మురళీ కృష్ణగారు,
మీరు ధన్య జీవులు. మిమ్మల్ని కన్న మీ మాతృ మూర్తి కారణ జన్ములు. ’కారణ జన్ములు ..’ అనే పదాన్ని ఇక్కడ ఉపయోగించ వచ్చో లేదో తెలియదు గానీ వాడాలని పించింది, వాడేశా.. తప్పుగా ఉపయోగిస్తే, క్షమించేయ్యండి.
మీ అమ్మ గారి.. (వ్రాసిన తరువాత అనిపించింది.. అమ్మ అనే బదులు ’తల్లిగారి’ అని మార్చి వ్రాద్దాం అని. కానీ అమ్మ అనే పదాన్ని డిలీట్ చెయ్యాలి అన్న భావన ఎందుకో నచ్చలేదు, అందుకే అలాగే వదిలేశా. కానీ సందర్బంగా మీకు తెలియజేస్తే బాగుంటుందని, బహిర్గతంగా తెలియజేస్తున్నా)
మీ అమ్మ గారి గురించి మీరు తెలియ జేసిన విషయాలు నేను సోమవారం ఉదయం పదకొండు గంటలకు మా కార్యాలయంలో కూర్చుని చదివాను. చదువుతున్నప్పుడు తెలియకుండా కళ్ళంట నీళ్ళు తిరిగాయి. నా ప్రమేయం లేకుండా వాటంతట అవే పల్లాన్ని వెతుక్కుంటూ, బుగ్గల మీదుగా చొక్కాపై చేరుకున్నాయి. ఈ కన్నీరేదో చిన్న పిల్ల కాలువలా జారిందను కోకండి, తుఫాను వచ్చిన తరువాత సాగే పెద్ద వరదలా.. ఎంతో కాలంగా తనలో దాచుకున్న అగ్ని పర్వతం దాని లోని లావాని భడభాగ్నిలా ఎలా చిందించుతుందో .. వాటికి ఏమాత్రం తీసిపోకుండా.. దాదాపు పది పదిహేను నిమిషాలసేపు వెక్కి వెక్కి ఏడుస్తునే ఉన్నా.
నేను మా కార్యాలయంలో ఓ పది మంది పనిగాళకు మేస్త్రీనన్న మాట. ఎదో కొంచం పెద్ద పొజీషన్‍లో ఉన్న వాడిని కనుక, అందరూ కాక పోయినా కొందరి కళ్ళైనా నన్ను ఎప్పుడూ గమనిస్తూనే ఉంటాయి. అట్లాంటి కళ్ళు నేను కళ్ళనీళ్ళ పర్యంతం అవగానే పుకార్లు లేవదీశేసారు. ఒక గంట అవ్వంగానే మాపై అధికారి పరుగు పరుగున నాదగ్గరకి వచ్చి, ’చక్రవర్తి.. ఇవ్వాళ్ళ నీకు లీవు ఇస్తున్నా.. ఇంటికెళ్ళి పో..’ అన్నాడు. ఏమిటా.. ఎప్పుడు లీవు గురించి ప్రస్తావించినా మాట మార్చే ఈ వ్యక్తి ఒక్క సారిగా ఇలా ప్రవర్తిస్తున్నాడని మనసులో మదన పడుతూ.. ఆయన ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించా. ఇవిషయాన్ని ఇక్కడ తమరికి ఎందుకు తెలియజేస్తున్నానంటే.. మీరు నాలాంటి వాళ్ళ హృదయాల్ని ఒక్క పుటతో కుదిపేశారు. మాలాంటి వాళ్ళ హృదయాల్లో పెద్ద్ భూకంపాన్నే మిగిల్సారు.
ముఖ్యంగా… మీ తల్లిగారికి పాదాభి వందనాలు. వీలైతే వారి దర్శన భాగ్యాన్ని మా అందరికీ కలుగ జేయగలరు. ’అమ్మ మాట చద్ది మూట’ అనే సామెతకు మీరూ .. మీ అమ్మగారూ ఒక సజీవ ఉదాహరణ. ఇక్కడ మరో మహిళా సిరోమణి గురించి కూడా నేను ప్రస్తావించాలని అనుకుంటున్నాను. అదేనండీ మీ శ్రీమతిగారు. స్వతహాగా భార్యలు అత్తగార్ల గొప్పలు వినడానికి ఇష్టపడరని నేను చాలా సార్లు విన్నా. కానీ మీ శ్రీమతి గారు చక్కగా మీ అమ్మ గారిని, చూసుకునే విధానం.. వారి అడుగు జాడల్లో మెలిగే విధానం చాలా బాగుంది. అవిడకీ జే జే లు ..
ఇంత భహిర్గతంగా మీ కష్ట సుఖాల్ని మాతో పంచుకున్నందులకు మీకు .. మీ లోని ధైర్యాన్ని నింపిన మీ మాతృ మూర్తికి ఇవే నా హృదయ పూర్వక అభినందనలు.
వ్యాఖ్య ద్వారా చక్రవర్తి — మే 19, 2008 @ 6:04 పూర్వాహ్నం |
అయ్యా కస్తూరి మురళీ కృష్ణగారు,
మీరు ధన్య జీవులు. మిమ్మల్ని కన్న మీ మాతృ మూర్తి కారణ జన్ములు. ’కారణ జన్ములు ..’ అనే పదాన్ని ఇక్కడ ఉపయోగించ వచ్చో లేదో తెలియదు గానీ వాడాలని పించింది, వాడేశా.. తప్పుగా ఉపయోగిస్తే, క్షమించేయ్యండి.
మీ అమ్మ గారి.. (వ్రాసిన తరువాత అనిపించింది.. అమ్మ అనే బదులు ’తల్లిగారి’ అని మార్చి వ్రాద్దాం అని. కానీ అమ్మ అనే పదాన్ని డిలీట్ చెయ్యాలి అన్న భావన ఎందుకో నచ్చలేదు, అందుకే అలాగే వదిలేశా. కానీ సందర్బంగా మీకు తెలియజేస్తే బాగుంటుందని, బహిర్గతంగా తెలియజేస్తున్నా)
మీ అమ్మ గారి గురించి మీరు తెలియ జేసిన విషయాలు నేను సోమవారం ఉదయం పదకొండు గంటలకు మా కార్యాలయంలో కూర్చుని చదివాను. చదువుతున్నప్పుడు తెలియకుండా కళ్ళంట నీళ్ళు తిరిగాయి. నా ప్రమేయం లేకుండా వాటంతట అవే పల్లాన్ని వెతుక్కుంటూ, బుగ్గల మీదుగా చొక్కాపై చేరుకున్నాయి. ఈ కన్నీరేదో చిన్న పిల్ల కాలువలా జారిందను కోకండి, తుఫాను వచ్చిన తరువాత సాగే పెద్ద వరదలా.. ఎంతో కాలంగా తనలో దాచుకున్న అగ్ని పర్వతం దాని లోని లావాని భడభాగ్నిలా ఎలా చిందించుతుందో .. వాటికి ఏమాత్రం తీసిపోకుండా.. దాదాపు పది పదిహేను నిమిషాలసేపు వెక్కి వెక్కి ఏడుస్తునే ఉన్నా.
నేను మా కార్యాలయంలో ఓ పది మంది పనిగాళకు మేస్త్రీనన్న మాట. ఎదో కొంచం పెద్ద పొజీషన్‍లో ఉన్న వాడిని కనుక, అందరూ కాక పోయినా కొందరి కళ్ళైనా నన్ను ఎప్పుడూ గమనిస్తూనే ఉంటాయి. అట్లాంటి కళ్ళు నేను కళ్ళనీళ్ళ పర్యంతం అవగానే పుకార్లు లేవదీశేసారు. ఒక గంట అవ్వంగానే మాపై అధికారి పరుగు పరుగున నాదగ్గరకి వచ్చి, ’చక్రవర్తి.. ఇవ్వాళ్ళ నీకు లీవు ఇస్తున్నా.. ఇంటికెళ్ళి పో..’ అన్నాడు. ఏమిటా.. ఎప్పుడు లీవు గురించి ప్రస్తావించినా మాట మార్చే ఈ వ్యక్తి ఒక్క సారిగా ఇలా ప్రవర్తిస్తున్నాడని మనసులో మదన పడుతూ.. ఆయన ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించా. ఇవిషయాన్ని ఇక్కడ తమరికి ఎందుకు తెలియజేస్తున్నానంటే.. మీరు నాలాంటి వాళ్ళ హృదయాల్ని ఒక్క పుటతో కుదిపేశారు. మాలాంటి వాళ్ళ హృదయాల్లో పెద్ద భూకంపాన్నే మిగిల్సారు.
ముఖ్యంగా… మీ తల్లిగారికి పాదాభి వందనాలు. వీలైతే వారి దర్శన భాగ్యాన్ని మా అందరికీ కలుగ జేయగలరు. ’అమ్మ మాట చద్ది మూట’ అనే సామెతకు మీరూ .. మీ అమ్మగారూ ఒక సజీవ ఉదాహరణ. ఇక్కడ మరో మహిళా సిరోమణి గురించి కూడా నేను ప్రస్తావించాలని అనుకుంటున్నాను. అదేనండీ మీ శ్రీమతిగారు. స్వతహాగా భార్యలు అత్తగార్ల గొప్పలు వినడానికి ఇష్టపడరని నేను చాలా సార్లు విన్నా. కానీ మీ శ్రీమతి గారు చక్కగా మీ అమ్మ గారిని, చూసుకునే విధానం.. వారి అడుగు జాడల్లో మెలిగే విధానం చాలా బాగుంది. అవిడకీ జే జే లు ..
ఇంత భహిర్గతంగా మీ కష్ట సుఖాల్ని మాతో పంచుకున్నందులకు మీకు .. మీ లోని ధైర్యాన్ని నింపిన మీ మాతృ మూర్తికి ఇవే నా హృదయ పూర్వక అభినందనలు.
వ్యాఖ్య ద్వారా చక్రవర్తి — మే 19, 2008 @ 6:07 పూర్వాహ్నం |
మీరు చెప్పిన మీ అమ్మ కధ చాలా బావుంది. కష్టాలకు ఎదురీది, జీవితాలను తీర్చి దిద్దే అమ్మ! మీరు ఎంత అదృష్టవంతులో, అలాంటి అమ్మనూ, అలాంటి భార్యనూ పొందగలిగినందుకు! మీకు అభినందనలు.
వ్యాఖ్య ద్వారా sujata — మే 19, 2008 @ 7:10 పూర్వాహ్నం |
అమ్మ గురించి చెప్పేందుకు ఒక జీవిత కాలం సరిపోదు.
మీకు అభినందనలు.
వ్యాఖ్య ద్వారా జాన్ హైడ్ కనుమూరి — మే 19, 2008 @ 8:05 పూర్వాహ్నం |
అలాంటి అమ్మ మీకు ఉండడం మీ సుకృతం.మీ లాంటి అబ్బాయిని పొందటం మీ అమ్మగారి అదృష్టం. అనిపించింది మీరురాసింది చదువుతూ ఉంటే.
వ్యాఖ్య ద్వారా ramya — మే 19, 2008 @ 1:16 అపరాహ్నం |
మీ అమ్మగారిని తన జీవిత చరిత్ర రాసేందుకు ప్రోత్సహించండి. పలువురికి స్ఫూర్తిదాయకమవుతుంది.
వ్యాఖ్య ద్వారా Chilakapati Srinivas — మే 19, 2008 @ 5:27 అపరాహ్నం |
అమ్మ ఉన్నవారందరూ అదృష్టవంతులు,మీ అమ్మగారి లాంటి వారు ఉన్న మీతోబుట్టువులు అందరూ ఆ దీపపు వెలుగులు.
వ్యాఖ్య ద్వారా రాజేంద్ర — మే 19, 2008 @ 5:46 అపరాహ్నం |
మురళీకృష్ణ గారూ, కదిలించివేశారు.. చెప్పడానికి మాటలేమీ సాయం చేయడం లేదు.. అమ్మా నాన్నలు ఇద్దరూ అంటే సమానమైన ప్రేమ, గౌరవం ఉన్నా ఒక్కోసారి అనిపిస్తుంది, అమ్మ చేశినన్ని త్యాగాలు నాన్న చేసి ఉండరని! లేదా ఆ అవకాశం అమ్మ నాన్నకు ఇవ్వదేమో!! మీ అమ్మగారికి పాదాభివందనాలు..
వ్యాఖ్య ద్వారా నిషిగంధ — మే 19, 2008 @ 5:57 అపరాహ్నం |
మీ టపా చదువుతున్నంతసేపు నాలుగైదు సార్లు నామదిలో ఎప్పుడో విన్న ఒక పద్యం పదే పదే వచ్చిపోతూండేది. పద్యమైతె పూర్తిగా గుర్తులేదుకానీ, భావం మాత్రం ఇలా ఉంటుంది. అది ఈశ్వరుని గురించి చెపుతూ అన్యాపదేసంగా అమ్మ గొప్పతనాన్ని వర్ణించటం జరుగుతుంది.
నీకు అమ్మ ఉంటే,
వంటినిండా బూడిద రాసుకోనిచ్చేదా,
పాములను మెడలో వేసుకోనిచ్చెనా,
జంతు చర్మాన్ని వంటిపై కట్టుకోనిచ్చేనా,
కాష్టాలమ్మట అలా తిరగనిచ్చేనా ….. అంటూ సాగుతుంది.
అమ్మ ఔన్నత్యానికి కొలబద్దలు ఉండవేమో?
బొల్లోజు బాబా
వ్యాఖ్య ద్వారా bollojubaba — మే 20, 2008 @ 3:31 అపరాహ్నం |
“AMMA” IT IS A MOST SWEET WORD IN THE UNIVERSAL.”AMMA” there is no equal word.
“AMMA” never ending defination.
“AMMA” Most happiest word.
వ్యాఖ్య ద్వారా V.Sesha Sai Das — ఫిబ్రవరి 18, 2010 @ 6:53 పూర్వాహ్నం |