రాతలు – కోతలు

మే 15, 2008

సచిన్ కోసం వస్తే సనత్ దొరికాడు.

ప్రచురించిన వర్గము క్రికెట్-క్రికెట్ — కస్తూరి మురళీకృష్ణ @ 6:58 పూర్వాహ్నం

భోజ రాజుకు కవిత్వం రాయాల్సిన అవసరం లేదు.అతడిని చూస్తేనే  స్ఫూర్తి పొంది ఇతరులు అమోఘమయిన కవిత్వం రాస్తారట.ఇది ఎవరయిన నమ్మక పోతే,నిన్న ముంబాయి,చెన్నాయ్ ల  మధ్య జరిగిన ఆట చూస్తే వాళ్ళ సందేహాలు తీరిపోతాయి.నిన్న జయ సూర్య ఆడిన తీరు అమోఘం.అద్భుతం.అచింత్యం.అమేయం.అసలు అతడు బలంగా,కష్టపడి షాట్లు కొడుతున్నట్టే అనిపించలేదు.అలవోకగా,బంతిని సుతిమెత్తగా స్పృశించినట్టు అనిపిస్తోంది.తీరా చూస్తే బంతి గాల్లో ఎగిరి లంక వైపు పరుగిడుతోంది.అసలౌ ఏమి ఆట అది!శివతాండవంబట!అన్న పుట్టపర్తివారి కవిత మనసులో మెదిలింది అతని ఆట చూస్తూంటే.క్రికెట్ జట్టు కలిసి సమిష్టిగా ఆడే ఆట అంటారు కానీ నిన్న జయసూర్య ఒక్కడే జట్టుని గెలిపించాడు.స్కోరు ఇంకో వంద ఎక్కువ అయినా సులభంగా ఆడుతూ పాడుతూ బంతిని బౌండరీ దాటిస్తూ గెలిచి పోయేవారనిపిస్తుంది.
అసలు ఎవరు ఎల్లంటి బంతి వేసినా అది ‘నన్ను కొట్టూఅన్నట్టు అతని బాట్ దగ్గరకు వచ్చి గారాలు పోతూ కులుకుతూంటే,కొనగోటి స్పర్శతో దాన్ని ఆనంద తరంగాల ఆకాశంపయిన నటింపచేసినట్టు అనిపిస్తుంది. నిజంగా,సచిన్ ఆట చూడాలని ఆశపడితే,సచిన్ తో పాటూ బాటింగ్ చేస్తున్న ఆనందంతో జయసూర్య చేసిన శివతాండవం చూసే భాగ్యం కలిగింది.అందుకే సచిన్ కోసం వచ్చిన,సనత్ దొరికితే మహదానందం కలిగింది తప్ప ‘అయ్యో’అనిపించలేదు.సచిన్ త్వరగా ఔట్ అయిపోయినా బాధ కలగలేదు.జయసూర్య ఇలా ఆడితే చాలు మనకే కాదు,అంబానీకీ పైసా వసూల్ అనిపించింది.అదీగాక,జయసూర్య ఇలా ఆడటానికి కారణం సచినేకదా!

WordPress.com లో Blog పెట్టుము.