సాంప్రదాయిక జెంటిల్మాన్ క్రికెట్టు దబ్బు వేటలో పడి కార్పొరేటు క్రికెట్టుగా మారింది.దబ్బు ఆశలో క్రికెట్టు బోర్డులు,ఆటగాళ్ళు,వ్యాపార సంస్థలూ అందరూ క్రికెట్టుకు ఎగబడ్డారు.ఆట స్వరూపాన్ని ఆధునిక సామాజిక మనస్తత్వానికి తగ్గట్టుగా మార్చేసారు.ఆధునిక కార్పొరేట్ క్రికెట్టు అసహ్య రూపం ఇప్పుడిప్పుడే బయట పడుతోంది.
వ్యాపార సంస్థలు క్రికెట్లో వ్యాపారం కోసం అడుగు పెట్టాయి.వాటికి లాభాల భాష తప్ప మరొకటి అర్ధం కాదు.అర్ధం కావాలని అనుకోవటం పొరపాటు.పెట్టుబడికి తగ్గ లాభాలు రాక పోతే వారు తమ నిర్ణయాలను పునస్సమీక్షించుకుంటారు.లాభాలు వచ్చే నిర్ణయాలు తీసుకుంటారు.క్రికెట్ లో అదే జరుగుతోంది.
ఐ.పి.ఎల్ పోటీలలో కార్పొరేట్ సంస్థలు ఆటగాళ్ళని కొనుక్కున్నాయి. గుర్రప్పందేలాడేవాళ్ళు మంచి జాతి శ్రేష్టమయిన గుర్రాలను కొనుక్కుంటారు.వాటికి శిక్షణనిస్తారు.ఆ పై రంగంలో దింపుతారు.ఇక్కడా అదే జరిగింది.అయితే ఇక్కడ శ్రేష్ఠమయిన గుర్రాలుగా నిరూపణ అయిన ఆటగాళ్ళను వేలం లో కొన్నరు.రంగంలో దింపి తడాఖా నిరూపించుకోమన్నారు.గుర్రాలకూ మనుషులకూ తేడాలుంటాయని మరచిపోయారు.
ఆటలో ఆటగాడికి ఎంత ప్రతిభ వున్నా అతడి ఆట తీరును అదృష్టం నిర్ణయిస్తుంది.ఒకసారి బాగా ఆడేడు కాబట్టి ప్రతీసారీ బాగా ఆడాలని అనుకుంటే పొరపాటు.కొందరికి కొన్ని సందర్భాలలో ఎలా ఆడినా అచ్చి వస్తుంది.కొందరికి ఏమి చేసినా అచ్చిరాదు.గమనిస్తే,ఈ పోటీలలో గొప్ప గొప్ప ఆటగళ్ళు కూడా బోల్తా పడ్డారు.గిల్క్రిస్ట్,ఆఫ్రిది,గిబ్స్ లక్ష్మణ్ వంటి మేటి ఆటగాళ్ళున్నా డక్కన్ చార్జెర్లు చార్జి లేనట్టే వున్నారు.లక్ష్మణ్ అంటే వేగంగా పరుగులు తీయలేడు.మరి మిగతా వారికి ఏమయింది?గిబ్స్,ఆఫ్రిది లయితే ఎటువంటి చమత్కారాలూ చూపలేక పోయారు.ఫ్లెమింగ్,స్టయ్రిస్,యువరాజ్,పాంటింగ్, జయసూర్య,కైఫ్ లాంటి వారు వారు పలికిన ధరకు ఏమాత్రం న్యాయం చేయలేక పోతున్నారు.ఒక రకంగా చూస్తే,ఢిల్లీ జట్టు గెలుపు అధికంగా గంభీర్ పయిన ఆధారపడి వుంటోంది.చెన్నై జట్టు ధోనీ పయిన,ఇలా ఎవరో ఒకరి పయిన ఆధరపడి వుంటున్నాయి.బెంగళూరు జట్టు ఇందుకు భిన్నం కాదు.
బెంగళూరు జట్టు మిగతా వారికి ఏమాత్రం తీసిపోదు.కాలిస్,చందెర్పాల్,మిస్బాహ్,లాంటి వారు మంచి ఆటగాళ్ళు.కానీ అందరూ కలసి ఒక జట్టులా ఆడలేక పోతున్నారు.గమనిస్తే,రాహుల్ ద్రావిడ్ స్వతహాగా మంచి ఆటగాడయినా ఏకె-47 తుపాకుల కాలంలో విల్లమ్ములతో యుద్ధానికి దిగేవాడు ద్రావిడ్.ఇది అతనిపయిన పెట్టుబడి పెట్టేటప్పుడే అందరికీ తెలుసు.రాహుల్ అదృష్టం ఎలాంటిదంటే,అతడు బెట్ కడితే గెలిచే గుర్రం కూదా కుంటుతూ ఓడిపోతుంది.అతను,సెహ్వాగ్ కోసం అందరినీ ఎదిరించినంత కాలం సెహ్వాగ్ పరుగులు చేయలేదు.రైనా,కైఫ్ లాంటి వాళ్ళకోసం పోరాడినంత కాలం వాళ్ళు సరిగ్గ ఆడలేదు.ఇది తెలిసి కూడా రాహుల్ ను ఐకాన్ ఆటగాడిని చేసి అతను తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడని అనటంలో అర్ధం లేదు.నిజానికి,రాహుల్ ఆట తీరు 20-20 కి పనికిరాదు.శృతి చూసుకోందే రాగం పలుకలేని వాయిద్యం అతడు.శృతి గతి లేకుండా పంచమంలో ఆరంభించి ఇంకా పైకి పోవాల్సిన ఆట 20-20.మర్యాదగా అతడు పోటీల్లో పాల్గొనక పోతే పరువుదక్కేది.కానీ డబాశ ఏంచేస్తాం!
అయితే,కార్పొరేట్ సంస్థలు పెట్టుబడి పెట్టేముందు బోలెడంత రీసెర్చ్ చేస్తాయని విన్నాం.మాల్యా ఈ విషయంలో పూర్తిగా రాహుల్ పయిన ఆధారపడ్డడనటం నమ్మశక్యం కాదు.తాను కోరిన ఆటగాళ్ళు వేరే అని ఆయన అనటం ఈ విశయాన్ని స్పష్టం చేస్తుంది.అయితే,డబ్బు పెడుతున్న మాల్యా తన మాట నెగ్గించుకోలేక పోవటం అతని వ్యక్తిత్వాన్నే ప్రశ్నార్ధకంలో పడేస్తుంది.ఇదే ఆయన ముందే అనివుంటే బాగుండేది.ఇప్పుడు జట్టు దెబ్బ తింటున్నప్పుడు దోశం వేరే వారిపయిన నెట్టేయటం మాల్యా మేనేజీరియల్ శక్తిని సంశయంలో పడేస్తుంది.
అనుకున్న ప్రతిదాన్లో విజయ సాధించటం కుదరదు.ఓడిపోతున్నప్పుడు నేరాన్ని వేరే వారి పయిన నెట్టేయటం అధికారి సంకుచిత మనస్తత్వాన్ని సూచిస్తుంది.అసలే ఓడి దెబ్బతింటూన్న వారిని మరింత కృంగదీస్తుంది ఇలాంటి ప్రవర్తన.అయితే పెట్టిన పెట్టుబడికి లాభాలు రావాలన్న ఆష వున్న వారికి ఇవన్నీ కనబడవు.ఇలాంటి వ్యాఖ్యలు ఆటగాళ్ళ మనస్తత్వాలను దెబ్బతీస్తాయని,వారి విశ్వాసాన్ని తగ్గిస్తాయని ఆలోచన రాదు.ఇలా బహిరంగంగా నిరసన తెలిపే బదులు రహస్యంగా,ఆటగాళ్ళతో ఆంతరంగికంగా తన నిరసన వ్యక్త పరిస్తే అందరి పరువు దక్కేది. మాల్యా ఈ ప్రవర్తన కాలిస్,చందెర్పాల్,ద్రావిడ్ లాంటి ఆటగాళ్ళకు ఎంతో అవమాన కరం.అయితే డబ్బుకోసం సైతానుకు ఆత్మను తాకట్టు పెట్టిన తరువాత ఇవన్నీ భరించక తప్పదు.
కార్పొరేట్ క్రికెట్ వికృత రూపం ఇప్పుడిప్పుడే స్పష్టమవుతోంది.ఇక్కడ నైపుణ్యం తో పనిలేదు.వ్యక్తుల గౌరవంతో పనిలేదు.కావలసింది ఫలితం.రావలసింది డబ్బు.గుర్రంపై పెట్టిన పెట్టుబడికి ఫలితం రావాలి.లేకపోతే గుర్రాన్ని తరిమెయ్యి.కొత్త గుర్రం తెచ్చుకో.తమని తాము గుర్రాల స్థాయికి దిగజార్చుకున్న దోషం మాత్రం క్రీడా కారులదే.ఇకపై క్రికెట్ ఆట గాళ్ళకు ఒక విషయం అర్ధమయి వుంటుంది.గత ఖ్యాతి గాలిలో కలసిన ధూళి.ఇకపయిన అంతా,ఆడితే నోటు,అడకుంటె వేటు.ఇదే కార్పొరేటు క్రికెట్టు.
సచిన్ రంగంలో దూకుతున్నాడు.కనీసం అతడయినా పరువు నిలిపుకుంటాడని ఆశిద్దాం!