రాతలు – కోతలు

మే 9, 2008

రచయితలూ-విమర్శకులూ -పాఠకులూ!

ప్రచురించిన వర్గము Uncategorized — కస్తూరి మురళీకృష్ణ @ 11:36 అపరాహ్నం

ఇటీవలే ఒక బ్లాగులోని చర్చకు-రచయితగా,విమర్శకుడిగా,పాఠకుడిగా నా స్పందన ఇది.
ఎలాగయితే రచనలు చేసే హక్కు ప్రతి ఒక్క వ్యక్తికీ వుందో,అలాగే విమర్శించే హక్కు ప్రతి ఒక్కరికీ వుంది.రచయిత ఒకానొక భావావేశంలో రచన చేస్తాడు.పాఠకుడు రచన ద్వారా రచయిత భావావేశంతో స్పందిస్తాడు.ఒకవేళ రచయిత తో పాఠకుడు స్పందించలేకపోతే,ఆ రచనను పాఠకుడు మెచ్చలేడు.ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏమిటంటే,రచయిత తనకు నచ్చింది రాయాలా?పాఠకుడు మెచ్చేది రాయాలా?
తనకు నచ్చింది రాయాటంలో రచయిత తన అంతరంగాన్ని ప్రదర్శిస్తాడు.ఎంతో ఆనందాన్ని అనుభవిస్తాడు.సంతృప్తి పొందుతాడు.కానీ,ఈ సంతృప్తి అత్యంత తీవ్ర మయిన ఆనందంగా,ఇతరుల మెప్పుతోనే మారుతుంది.కళాకారుడు ఎంత తనకోసమే కళను సృజించినా పదిమంది మెప్పు పొందినప్పుడే దానికి సార్ధకత లభిస్తుంది. నేను అద్భుతమయిన కథ రాసి అటక మీద దాచుకోవటం అర్ధరహితం.
అయితే,రచయిత తన స్థాయిలో కథ రాస్తే దాన్ని పాఠకుడు అందుకోలేకపోతే ఆ రచన వ్యర్ధమే అవుతుందికదా అన్న సందేహం  జనిస్తుంది.
కానీ,ఈ రచనా ప్రతి వ్యక్తినీ మెప్పించలేదు.ఇది నిజం.ఒకరి కంట నీరు పొంగించిన కథ మరొకరికి హాస్యాస్పదంగా అనిపించవచ్చు.ఇంకొకరికి విసుగు కలిగించవచ్చు.అటువంటప్పుడు అందరినీ మెప్పించాలని ప్రయత్నించి తన వ్యక్తిత్వాన్ని కోల్పోవాలా?ఎవరు మెప్పుతో సంబధంలేదని తనకు నచ్చినట్టు రాస్తూపోవాలా?నా మటుకు నాకు వందమందిని మెప్పించాలని స్వీయాత్మను కోల్పోవటం కన్నా,రచయిత కనీసం తన ఒక్కడి మనసుకు ఆనందం కలిగించే రచనలు చేస్తూ పోవటమే వుత్తమం అనిపిస్తుంది.ఎందుకంటే అందరినీ మెప్పించటం అసాధ్యం.ఆ తపనలో ఎవరిమెప్పు పొందలేడు.కాబట్టి కనీసం తనకయినా సంతృప్తి కలిగే రీతిలో రచనలు చేయటం మంచిది.వాళ్ళకు నచ్చదేమో,వీళ్ళకు కోపం వస్తుందేమో,ఇంకొకరికి అర్ధం కాదేమో అన్న భయాలతో చేసే రచనలు రచయితను విదూషకుడినో భట్రాజునో చేస్తాయి.మన తెలుగు సాహిత్య ప్రపంచ ప్రస్తుత పరిస్థితి ఇది.అందరికీ అర్ధమయ్యే రచనలు చేయాలన్న పట్టుదలలో,భాష దెబ్బతిన్నది.భావం పాతాళంలో పడింది.సాహిత్యం హాస్యాస్పదమయింది.రచయిత చులకన అయ్యాడు.ఇంత చేసీ పాఠకులు విముఖత చెంది సమకాలీన సాహిత్యాన్ని చదవటం మానేశారు.
ఒక స్థాయిలో వున్న వాడిని పైనుండి కిందకులాగటం కన్నా కిందవారు పై స్థాయికి ఎదిగాలన్న ఆలోచనను పట్టుదలనూ ప్రదర్శిస్తే మంచిది.
అందరికీ అర్ధమయ్యేట్టు రాయాలని ఒక రచయిత తపన పడ్డాడు.ఒక కథ రాసి నలుగురికి వినిపించాడు.దాన్లో అన్నం అన్న పదం రాగానే ఒకడు అభ్యంతరం చెప్పాడు.బువ్వ అంటే నాకు అర్ధమవుతుంది ఆ పదం వాడాలి అన్నాడు.వెంటనె మరొకడు కూడు అంటే నాకు తెలుస్తుంది అన్నాడు.మరొకడు భోజనం అనరాదా బాగుంటుంది అన్నాడు.రచయిత గతి వేరే చెప్పనవసరం లేదుగా?
అందుకే రచయిత రచన చేసేటప్పుడు ఇతరాలను విస్మరించాలి.తాను చెప్పదలచుకున్నది సరిగా చెప్తున్నాదా,తనకు సంతృప్తి కలుగుతోందా అన్నదే దృష్టిలో వుంచుకోవాలి.
ఒక్క సారి రచన పదిమందిలోకి వెళ్ళిన తరువాత ఇక దానిపయిన భిన్నాభిప్రాయాలు వస్తాయి.
వినదగునెవ్వరు చెప్పిన.ఒక వ్యక్తి ఒక వ్యాఖ్య చేయటం వెనుక అనేక అంశాలుంటాయి.అదీగాక తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచే స్వేచ్చ ప్రతి ఒక్కరికీ వుంది.దాన్ని కాదనే హక్కు ఎవ్వరికీ లేదు.పత్రికలలో ఎడిటర్లు అడ్డుపడతారు.బ్లాగుల్లో ఎవరికీ ఆ హక్కు లేదు.ఎదుటి వారి అభిప్రాయాన్ని మన్నించాలి.వీలయితే వారికి వివరించాలి.వారికి రచనను ఏ రకంగా చూడవచ్చో చెప్పాలి.అంతేకానీ,వ్యక్తిగత్ విమర్శలు,హేళణలు అనవసరం.సాధారణంగా రచయితకన్న అతని అభిమానులే ఇటువంటి విశయాల్లో తీవ్రంగా స్పందిస్తారు.అయితే,విమర్శలో కూడా విమర్శకుడి హృదయం ప్రాధాన్యం వహిస్తుంది.కొందరు కావాలని విమర్శిస్తారు.దానికి స్పందించాల్సిన పనిలేదు.కొందరు నిజాయితేగా సందేహిస్తారు.వారికి అంతే నిజాయితేగా వివరణ ఇచ్చుకోవాల్సివుంటుంది.రంధ్రాన్వేశి కుండలో ఎన్ని నీళ్ళు పోసినా వ్యర్ధమే.జిఙ్నాసికి నీటి చుక్క కూడా అమృతమే!
ఒక పత్రికలో ఒక సమీక్షకుడున్నాడు.ఆయనకు నేను వ్యక్తిగతంగా నచ్చలేదు.దాంతో నేను ఏమి రాసినా దాన్ని దూశించటం,తీసిపారేయటమే లక్ష్యంగా ప్రవర్తిస్తాడు.దానికి విలువనిస్తే అనవసరంగా అతడికి విలువనిచ్చినట్టవుతుంది.
ఇందుకు భిన్నంగా కొందరు పాఠకులు ఇలా ఎందుకు రాసారు,ఇలా రాయవలసింది అని నిజయితీగా అడుగుతారు.వారికి వీలయితే వివరించటం,లేక్పోతే ఈ సారి అలా రాస్తానని సంతృప్తి పరచటం చేయాలి.ఇలాంటి వారు నిజమయిన పాఠకులు.వారెంతో సున్నిత స్వభావులు.వారిని నొప్పించటం అంటే అసలు పాఠకుడిని దూరం చేసుకోవటమే.
గమనిస్తే,రచయితలూ,పాఠకులూ,విమర్శకులూ అందరూ విద్యావంతులే.ఒకరి నొకరు గౌరవించుకుంటూ అర్ధం చేసుకుంతూ విచక్షణతో ముందుకు సాగితే అందరికీ ఆనందం.సాహిత్యం అభివృద్ధిచెందుతుంది.సమాజం ముందడుగు వేస్తుంది.
అందరూ అంగీకరించాల్సిన విషయం ఒకటుంది.అమృతం కావాలంటే సాగర మథనం తప్పనిసరి.సాగర మథనంలో హాలాహలం వస్తుంది.ఇవన్ని భరిస్తేనే అమ్ర్తాన్ని స్వీకరించే అర్హత వస్తుంది.రచయితకు,పాఠకుడికీ,విమర్శకుడికీ,అందరికీ, ఇది వర్తిస్తుంది.  

అభిప్రాయములు »

  1. సాంతం బాగుంది. ఏకీభవిస్తున్నాను.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా నాగరాజా — మే 10, 2008 @ 2:12 పూర్వాహ్నం | జవాబు

  2. పళ్ళక్రింద పలుకురాళ్ళులాగ అచ్చుతప్పులు అడ్డం పడుతున్నవి.వాటిని తగ్గించడం ఎలాగో చూడండి.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా నెటిజన్ — మే 10, 2008 @ 4:52 పూర్వాహ్నం | జవాబు

  3. నెటిజెన్ గారూ,తప్పు వొప్పుకుంటాను.అచ్చు తప్పులు వస్తున్నాయి.ఎంత ప్రయత్నించినా వాటిని తగ్గించలేక పోతున్నాను.చేతితో రాయటం అలవాటు నాకు.వేలితో కీ బోర్డ్ మీద తప్పుటడుగులు ఎక్కువగా పడుతున్నాయి.అర్ధం చేఉకుని క్షమించండి.ఇంతకీ మీ అభిప్రాయం తెలపలేదు.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా కస్తూరి మురళీకృష్ణ — మే 10, 2008 @ 7:52 పూర్వాహ్నం | జవాబు

  4. నిజమేనండి. పూర్వం మారోజుల్లో రచయిత ఏంచెప్పారు అని మాత్రమే ఆలోచించుకునేవాళ్లం. ఇఫ్పుడు అభిప్రాయకులు (అభిఫ్రయాలు వెలిబుచ్చేవాళ్లు)తమకెంత తెలుసో తెలియజేయడమే వృత్తిగా పెట్టుకున్నారు. (ఇందులో నాకు ఒకముక్క కూడా అర్థం కాలేదు, ఎందుకు రాయడం-లాటివి ఎందుకు రాస్తున్నారో నాకూ అర్థం కాదు) తన్మూలంగా ఏదీ సద్విమర్సో ఏది కువిమర్శో తెలీకుండా పోతోంది.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా tethulika — మే 10, 2008 @ 1:40 అపరాహ్నం | జవాబు

  5. బాగా చెప్పారు.

    అచ్చు తప్పులు తగ్గించడనికి .. ముందు notepad or Word లాంటి డాక్యుమెంట్ లో టైపు చేసుకుని, బాగోగులు చూసుకుని తరవాత బ్లాగు కిటికీలో అతికిస్తే బెటరు.
    ముఖ్యంగా కొంచెం సీరియస్ విషయాల గురించి లోతుగా ఆలోచించి రాసే మీ వంటి బ్లాగర్లు తప్పక చెయ్యాలి. ఒకలా చూస్తే .. ఇది కూడా మీరన్న క్షీరసాగర మథనంలో భాగమే :-)

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా కొత్తపాళీ — మే 10, 2008 @ 3:38 అపరాహ్నం | జవాబు

  6. తె థులిక గారు,కొత్తపాళి గారు మీ స్పందనకు కృతఙతలు.తె-థులుక గారు బ్రాకెట్ళో రాసినది కాస్త అస్పష్టంగా వుంది.వివరించగలరు.సద్విమర్శను,కువిమర్శను గుర్తించటం చాలా సులభం.ఇందులో విమర్శకుడికన్నా రచయిత అంతరంగం ఎక్కువగా పనికొస్తుంది.పైకి ఒప్పుకోక పోయినా తన రచనలో లోపాలు రచయితకు తెలుస్తాయి.విమర్శకుడు ఎత్తి చూపిన పొరపాట్లు,పాఠకుడి సందేహాలు సబబు అనిపిస్తే దాన్ని సద్విమర్శగా పరిగణించ వచ్చు.అలాకాక కేవలం తన ఆధిక్యాన్ని నిరూపించుకోవటంకోసమో,చిలిపిగానో,ఇబ్బందికలిగించాలనో అడుగుతున్నట్టు అనిపిస్తే దానికి స్పందించకపోవటం ఉత్తమం.అడుసు తొక్కనేల,కాలు కడగనేల!
    కొత్తపాళి గారు మీ సలహా పాటించే ప్రయత్నం చేస్తాను.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా కస్తూరి మురళీకృష్ణ — మే 11, 2008 @ 1:13 పూర్వాహ్నం | జవాబు


ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

WordPress.com లో Blog పెట్టుము.