రాతలు – కోతలు

మే 7, 2008

హైదరాబాద్ అదృష్టం.బెంగళూరు బాడ్ లక్!

ప్రచురించిన వర్గము క్రికెట్-క్రికెట్ — కస్తూరి మురళీకృష్ణ @ 1:56 పూర్వాహ్నం

ఐ.పి.ఎల్. క్రికెట్ రెండో దశలో ప్రవేశించింది.ఈ దశలో పరిణామాలు ఆసక్తి కరంగా వుంటున్నాయి.ఆట తీరులో కూడా మార్పు వచ్చింది.ఆట ఆరంభమయిన కొన్ని ఓవర్లలోనే విజేత ఎవరో ఊహించగలుగుతున్నా కొందరు ఆటగాళ్ళు తమ నైపుణ్యంతో ఆటను అతంత ఆసక్తి కరంగా మలుస్తున్నారు.
ఓటమి ఎరుగని చెన్నై సూపర్ స్టార్లు హఠత్తుగా గెలవటం మరచిపోయారు.ఒకరిద్దరు విదేశీ ఆటగాళ్ళు లేకపోవటం వీళ్ళ ఓటమికి కారణం కాదు.బహుషా మనం ఎలాగో గెలుస్తాములే అన్న ధీమా వీరి ఆట తీరుకు కారణం కావచ్చు.అలాగే మంచి బాటింగ్ లైన్ అప్ గా కనిపిస్తున్న డిల్లీ జట్టు,ముంబై వారి చేతిలో ఓడి పోవటం కాస్త ఆశ్చర్యం కలిగించినా జరగ వలసిన పరిణామమే.గంభీర్ మీద పూర్తిగా ఆధారపడిన జట్టు ఉలిక్కిపడి నిద్ర లేవాల్సి వచ్చింది.మొదటి ఆటలో ధాటిగా ఆడినా కలకత్త జట్టు కుంటు పడింది.గంగూలీ పయిన అలవాటయిన రీతిలో ఆరోపణలు,అతడి అహంకార పూరిత ప్రవర్తన ఇందుకు కారణం కావచ్చు.గొప్ప ఆటగాళ్ళు వుండికూడా వారిని వుపయోగించుకోలేకపోవటం నాయకుడి వైఫల్యానికి నిదర్శనం.
ఇక్కడే మనకు శేన్ వార్న్ గొప్ప తనం తెలుస్తుంది.గొప్ప స్టార్లు లేకపోయినా జట్టులో గెలవాలన్న పట్టుదలను నిలపగలగటం,గెలవగలమన్న విశ్వాసం కలిగించటం వార్న్ ప్రత్యేకతలు.గమనిస్తే వార్న్ కెప్తెన్సీ నుంచి బోలేడంత నేర్చుకోవచ్చు.
వార్న్ ఆటలో ప్రణాళిక కనిపిస్తుంది.మొదటి ఆటగాళ్ళలో స్మిత్ నెమ్మదిగా ఆడతాడు.పరుగులు వేగంగా తీయక పోయినా వికెట్ పడకుండా చూసుకుంటాడు.ఇందువల్ల బాటింగ్ కు ఒక రకమయిన స్థిరత్వం వస్తుంది.శేన్ వాట్సన్ అటు బౌలింగ్లోనూ ఇటు బాటింగ్ లోనూ కీలకమయిన పాత్ర పోశిస్తున్నాడు.అయితే,యూసుఫ్ పఠాన్ మాత్రం ఇంత బాటింగ్ రాక్షసుడు అనుకోలేదు.ఇలా ఆడగలడని ఇంత వరకూ తెలియదు.అతడిని సరిగ్గా వాడుకుంటున్నాడు  వార్న్.బౌలింగ్ లో కూడా వార్న్ తన అనుభవంతో సలహాలిస్తున్నాడు.మొదటి వికెట్లు త్వరగా పడకపోతే తాను బంతి వేసి వికెట్లు సాధిస్తున్నాడు.త్వరగా పడితే చివరి వరకూ ఆగి చివరలో త్వరగా పరుగులు తీయాలన్న ఆత్రంలో వున్న వారి పని పడుతున్నాడు.  ఒక వేళ ఎవరయినా పరుగులు తేస్తే వెంటనే బౌలింగ్ మార్చి వేరే వారికి ఇస్తున్నాడు.వీరి ఆట తీరు చూస్తే ఇవాళ్ళ ముంబయి మీద సులభంగా నెగ్గుతారనిపిస్తుంది.
హైదరాబాదు జట్టు మొత్తానికి గెలిచింది.అయితే ఈ గెలుపులో లక్ష్మణ్ లేక పోవటం కాస్త బాధాకరం.లక్ష్మణ్ లేనప్పుడు ఆఫ్రిదితో సహా అందరూ బాధ్యతాయుతంగా ఆడటం గమనార్హం.ఈ జట్టులో రోహిత్ శర్మ చాలా బాగా ఆడుతునాడు.గిబ్స్ నిరాశ పరుస్తున్నాడు.హైదరాబాదు జట్టు తమ శక్తిని గుర్తిస్తే ఇప్పటికీ ముందుకు సాగ గలదు.
గెలిచే శక్తి వుండీ,మంచి అవకాశాలను చేజార్చుకున్న దురదృష్ట వనతమయిన జట్టు ద్రావిడ్ బెంగలూరు జట్టు.ఎందుకో మన ఇండియన్ జట్టులో కనిపించే దుర్లక్షణాలన్నీ ఈ జట్టులో కనిపిస్తున్నాయి.ఆటగాళ్ళంతా అనుభవఙులూ,నిపుణులూ.కానీ అవసరమొచ్చినప్పుడు ఒక్కరూ సరిగా ఆడరు.గుంపులు గుంపులుగా ఔట్ అవుతారు.ఒకారూ స్థిరంగా నిలబడి చివరి వరకూ ఆడాలన్న ప్రణాలికా బద్ధులు కారు.ఎవరికి వారు ఒక 50 పరుగులు తీసి జట్టు స్థితితో సంబంధం లేకుండా వెనుతిరుగుతున్నారు.చందెర్పాల్,కాలిస్.మిస్బాఉల్ వంటి ఆటగళ్ళు వ్యర్ధం అవుతున్నారు.ఇక్కడే మనకు ద్రావిడ్ పరిమితులు తెలుస్తాయి.
మొన్న పంజాబ్ తో ఆటలో ద్రావిడ్ అద్భుతమయిన ఆట ప్రదర్శించాడు.ఎటువంటి పిచ్చి కొట్టుడు లేకుండా,అతి వేగంగా పరుగులు తీసి చూపించాడు.అతని ఆట చూస్తూంటే ఎద ఉప్పొంగుతుంది.డిస్కో పాటల నడుమ శాస్త్రీయ సంగీతం వింటున్నట్టు వుంటుంది.ద్రావిడ్ మంచి ఆలోచనా పరుడు.కానీ ఆ ఆలోచనను ఆచరణలో పెట్టటంలో విఫలమవుతున్నాడు.జట్టుకు స్ఫూర్తి నివ్వలేకపోతున్నాడు.ఒకరు ఔటయిన వెంటనే మరొకరు జాగ్రత్తగా ఆడాలన్న ఆలోచనను నేర్పలేక పోతున్నాడు.మొన్నటి ఆటలో అప్పటికే ఒక సిక్సెర్ కొట్టిన ద్రావిడ్ వికెట్లు లేని సమయంలో వెంటనే మరో సిక్సెర్ కోసం ప్రయత్నించాల్సిన పని లేదు.జాగ్రత్తగా అడుతూ అవకాశం దొరికినప్పుడు బౌండరీ కోసం ప్రయత్నించాల్సివుంది.ఎందుకంటే ఇంకా రెండు ఓవర్లు ఆడాల్సివుంది.కానీ ఎప్పుడూ జాగ్రత్తగా ఆడే ద్రావిడ్,ఆ విచక్షణను చూపలేదు.దాంతో జట్టు ఓడటమే కాదు,రన్ రేట్ లో కూడా వెనుకపడింది. చందెర్పాల్ లాంటి వారిని సరిగ్గా వాడుకోవటం లేదు.ద్రావిడ్ లాంటి వారు నాయకుడికి సలహాలివాగలడు.అద్భుతంగా ఆడగలడు.జట్టుకు నాయకత్వం వహించలేడు.తత్వవేత్తలు మంచి నాయకులు కాలేరు.
ఈ 20-20 పోటీలు ఒక విశయం స్పష్టం చేశాయి.మన నలుగురు దిగ్గజాల పని అయిపోయింది.వీరిలో ఇంకా కొన్నాళ్ళు ఆడగలిగే సత్త ద్రావిడ్ కే వుంది.కానీ అతడు ఎంత వేగంగా పరుగులు తీసినా,అతడి ఇమేజీ వల్ల దాన్ని ఎవరూ గుర్తించరు.
ఈ పోటీల వల్ల విదేశీ ఆటగాళ్ళకూ మనకూ వున్న తేడాలు కూడా తెలుస్తున్నాయి.వాళ్ళు ప్రణాళికలు వేయటం,పట్టు దలగా ఆడటం,బంతులు వేయటంలో నైపుణ్యం చూపటం తెలుస్తున్నాయి.ఇవి మన యువ ఆటగాళ్ళు గమనించి నేర్చుకుంటే మన ఆటతీరు మారుతుంది.ఇంతవరకూ లేని కిల్లెర్ ఇన్స్టింక్ట్ మన ఆటలోకి కూడా వస్తుంది. 

WordPress.com లో Blog పెట్టుము.