ఈ ప్రపంచం నిత్య పరిణామ శీలి.మార్పు చైతన్యానికి నిదర్శనం.మార్పు జీవనం.మారక పోవటం మరణ సదృశం.కాబట్టి మార్పు అనేదాన్ని అర్ధం చేసుకోవాలి.స్వీకరించాలి.అందుకే,ఇకపయిన సంగీత్ సినిమా థియేటర్ వుండదన్న వార్త విని,ప్రస్తుతం సమాజంలో వస్తున్న మార్పులలో ఇది భాగం అని అనుకున్నా,సంగీత్ తో వున్న అనుబంధాన్ని,అనుభూతులను తలచుకోకుండా వుండలేక పోతున్నాను.ఒకింత బాధ పడకుండా వుండలేక పోతున్నాను.
సికిందెరాబాద్ తో ఏమాత్రం పరిచయం వున్న వారికయినా సంగీత్ సినిమా తప్పకుండా తెలుస్తుంది.ఎందుకంటే,సికిందెరాబాద్ లో ఎక్కడికి వెళ్ళాలన్నా సంగీత్ గుండానే వెళ్ళాలి. సంగీత్ చౌరస్తా అత్యంత ప్రాధాన్యం కల చౌరస్తా.సంగీత్ సినిమా చుట్టూ పాఠశాలలే.కీస్,అన్న్స్,సెవెంథ్ డే,ఎస్పిజి,ఇలా బోలెడన్ని స్కూల్స్ వున్నా,సంగీత్ లో సినిమా కు వెళ్ళి మా పిల్లలు పాడవుతారన్న ఫిర్యాదు ఎప్పుడూ రాలేదు.ఎందుకంటే,సంగీత్ లో ఎప్పుడూ ఇంగ్లీష్ సినిమాలే వచ్చేవి.
సంగీత్ వెనుక కీస్ స్కూల్.దాన్ని ఆనుకుని మా స్కూల్ వుండేది.అది ప్రభుత్వ పాఠశాల.తెలుగూ మీడియం.అందుకే,చిన్నప్పటి నుంచీ సంగీత్ అంటే నాకు అదోరకమయిన ఆరధన,అద్భుతమయిన భావన వుండేది.ఆ సినిమా లోంచి బయటకు వచ్చేవారిని గొప్ప వాళ్ళని చూసినట్టు చూసేవాడిని.
సంగీత్ లో నేను చూసిన మొదటి సినిమా,”ది టవెరింగ్ ఇంఫెర్నో” .ఆ సినిమాకు అన్నయ్య తీసుకు వెళ్ళాడు. మేము అంతగా ధన వంతులం కాదు.లోయెస్ట్ క్లాసులోనె సినిమా చ్ ఊసేవాళ్ళం.అంటే,తెరకు అతి దగ్గరగా!
నా జీవితంలో 70ఎం ఎం తెర ను చూడటం అదే ప్రధమం.నెమ్మదిగా తెర కొంచెం కొంచేం పయికి వెళ్తూంటే ఒక అద్భుతమయిన నూతన ప్రపంచానికి తెర తొలగుతున్న భావన కలిగింది.ఇప్పటికీ నాకు వెల్కం నుంచి సినిమా చూస్తేనే సంతృప్తి.సినిమా ఆరంభమయితే చూడబుద్ధి కాదు.ఇందుకు బహుషా బీజం ఆ రోజు తెర పయికి లేస్తూంటే కలిగిందేమో!ఇక ఆ తరువాత రాబోయే సినిమా ట్రైలర్స్ చూపాడు.ఇప్పటికీ నాకు సినిమా కన్న ఈ ట్రైలర్స్ చూస్తేనే ఆనందం.టీవీలో కూడా,బ్రేక్ సమయంలో ంవచ్చే ట్రైలర్లను కన్నార్పకుండా చూస్తాను.ట్రైలర్ చూసి సినిమా ఎలా వుంటుందో వూహించి,ఆ సినిమా చూడాలని కలలు కనటం ఆ రోజు నుంచీ అలవాటుగా మారింది.
ట్రైలర్లు అవుతూనే విశ్రాంతి ఇచ్చాడు.అప్పటి ఆశ్చర్యం నాకు ఇప్పటికీ గుర్తుంది. ఇక ఆ తరువాత సినిమా ఆరంభమయింది.ఆ సినిమా గురించి ఏమి చెప్పను.నా నోరు కొన్నేళ్ళు మూత పడలేదు. ఆ భవనం కాలటం,నీళ్ళు పొంగి పొర్లటం.వాళ్ళు తప్పించుకోవటం….ఒకటేమిటి ప్రతి దృష్యం గుర్తుంది.ముఖ్యంగా ఆరంభంలో వుండే ముద్దులు ఎంతో సంచలనం కలిగించాయి.నా జీవితంలో పెదిమల ముద్దు నాకు తెలిసిందీ,చూసిందీ అప్పుడే.ఇప్పటికీ ముద్దు దృశ్యాలు లైంగిక దృశ్యాల కన్న నాలో ఎక్కువ సంచలనం కలిగిస్తాయి.అతి మధురమయిన తొలి ముద్దు అనుభవ ప్రభావం అది.ఈ సినిమా తరువాత స్టీవ్ మెక్ క్వీన్ నా ఫేవరేట్ హీరో అయ్యాడు.అప్పటి వరకూ నచ్చిన శోభన్ బాబు,కాంతా రావు,రాజనాలలంతా గతంలోకి జారుకున్నారు.ఈ సినిమా తరువాత నేను తెలుగు సినిమాలు చూడటం మానుకున్నాను.సినిమా రివ్యూలు రాసిన 1991-95 లో తప్పించి నేను చూసిన తెలుగు సినిమాలు వేళ్ళ మీద లెక్కించవచ్చు.నేను పదో తరగతి పాసయిన తరువాత అన్నయ్య “జంగ్లీ”అనే హిందీ సినిమా చూపించి శమ్మీ కపూర్,రఫి,లత,శంకర్-జైకిషన్ లను పరిచయం చేసిన తరువాత మరో ప్రపంచ ద్వారం తెరుచుకుంది.
అయినా,నా మొదటి ప్రాధాన్యం ఇంగ్లీష్ సినిమాలకే,సంగీత్ కే!ఇంటెర్ చదివేటప్పుడు కాలేజీ ఎగ్గొట్టి సంగీత్ లో దూరి మరో ప్రపంచంలో విహరించేవాడిని.ప్రతి వారం శుక్రవారం సంగీత్ కె నాం!టికెట్టు చించే కాపలా వాడు నన్ను గుర్తు పట్టి నవ్వేవాడు.నేను లోపలకు పోకముందే సినిమా రివ్యూ చెప్పేవాడు.
నాకు బాగా గుర్తు,మేక్కన్నాస్ గోల్డ్ సినిమా ట్రైలెర్ చూసి దాన్ని చూడాలని కలలు కన్నాను.కానీ సినిమా వచ్చేసరికి జ్వరం వచ్చింది.పరీక్షలు రాయలేనన్న బాధకన్న సినిమా చూడలేనన్న బాధ ఎక్కువయింది.అది అర్ధం చేసుకున్న అమ్మ ఆ జ్వరంలోనే నన్ను సినిమాకు తీసుకు వెళ్ళింది.సంగీత్ లో అప్పెర్ క్లాసుకు వెళ్ళటం అదే ప్రధqమం.ఇప్పుడు టీవీలో డివిడి లో ఆ సినిమా చూస్తే ఇదే గుర్తుకు వస్తుంది.
ఉద్యోగం రాగానే చేసిన పనుల్లో సంగీత్ లో అప్పెర్ క్లాసులో సినిమా చూడటం.ఆఫీస్ ఎగ్గొట్టి,అమ్మయిలతో సినిమా చూసే అనుభవానికీ సంగీతే సాక్షి.పెళ్ళయిన తరువాత నా భార్య తో సంగీత్ లో బోలెడన్ని సినిమాలు చూశాను.ఆమెకు విసుగొచ్చేది,”ఎప్పుడూ సంగీతేనా?”అనేది.కానీ,హైయెస్ట్ క్లాసులో కూచుని,మొదటి వరుసలో వారిని చూస్తూ గతాన్ని నెమరువేసుకుంటూ,ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చానో ఆలోచించటం లోని ఆనందానుభూతి ఒక్క సంగీత్ లోనే దొరుకుంతుంది.అయితే,రాను రాను,థియేటర్లో సినిమాలు చూడటం తగ్గింది.బయటి కన్న ఇంట్లో చూడటమే హాయిగా అనిపించింది.సంగీత్లో కూడా నెమ్మదిగా ఇంగ్లీష్ సినిమాలు తగ్గి తెలుగు,హిందీ ఎక్కువగా వచ్చేవి.దాంతో సంగీత్ కు వెళ్ళటం తగ్గింది.కానీ ఆ థియేటర్ను చూసినప్పుడల్ల బోలెడన్ని ఙ్నాపకాలు ముసురుకుంటాయి.అప్పుడు నేను ఎక్కువగా సినిమాలు చూసిన ప్లాజా,టివోలి(ఇప్పుడు తెలుగు సినిమాలే) డ్రీంలాండ్,లతా,రాయల్,దిల్షాద్,స్కయ్లైన్,స్టెర్లింగ్ అన్నే మాయమయిపోయి ఆనాటి మధుర స్మృతులకు చిహ్నంగా సంగీత్ ఒక్కటి మిగిలింది.ఇప్పుడు సంగీత్ కూడా మల్టిప్లెక్స్ అవుతోంది.మార్పు సహజం.అనుభూతులు మధురం.మార్పును ఆహ్వానించాలి.అనుభూతులను పదిలంగా దాచుకోవాలి.ఇదే జీవితం.
అయితే,ఆనాడు సినిమా చూడటం ఒక అపూర్వమయిన అనుభవం.చిన్ని చిన్ని సంఘటనలే ఎంతో గొప్ప తీపి గురుతులు.అటువంటి తీపి గుర్తుల్లో,అతి సుందరమయిన తీపి గుర్తు సంగీత్.అది భౌతికంగా రూపు మార్చుకోవచ్చు.కానీ నాఎదలో మాత్రం ఎన్నటికీ మారని ఙ్నాపకాల సుందర భవనం సంగీత్.