తొలి సెమి ఫైనల్ ఆట అనుకున్న రీతిలోనే సాగింది.టాస్ గెలవటం ఒక్కటే ఈ ఆటలో సెహ్వాగ్ చేసిన సరయిన పని.20-20 లో మంచి బాటింగ్ జట్టు ఎప్పుడూ ముందు బాటింగ్ చేయటం మంచిది.ఎందుకంటే,ఎంత గొప్ప ఆటగాళ్ళు వున్న జట్టయినా,ఎదురుగా,200 పరుగుల లక్ష్యం వుంటే తడబడక తప్పదు.మొదలు ఆడే జట్టు ఒక రెండు వికెట్లు పడ్డా చూసుకుని ఆడి వీలుచిక్కగానే స్కోరు పెంచవచ్చు.రెండోసారి ఆడే జట్టుకు ఆ సౌలభ్యం వుండదు.ఒక వికెట్ పడి,రెండు బంతులలో పరుగులు తీయక పోతే,ఒత్తిడి పెరిగి పోతుంది.దాంతో తొందర పడాల్సి వస్తుంది.ఆ తొందరలో మరొక వికెట్ పడితే,అంతా గోవిందా.నిన్న డిల్లీ విషయంలో జరిగింది ఇదే.
192 పరుగులు లక్ష్యం.సెహ్వాగ్ త్వరగా ఔట్ అయ్యాడు.దాంతో మిగతా వారి మీద ఒత్తిడి పెరిగింది.ఎదురుగా భారీ లక్ష్యం కనిపిస్తోంది.దాంతో ప్రతి బంతినీ బాదిపారెయాలన్న తొందర చూపారు.ఫలితంగా వెంట వెంటనే వెనుతిరిగారు.ఓడి ఇంటి దారి పట్టారు.
రాజస్థాన్ రాయల్స్ కూడా టాస్ గెలిచివుంటే ముందు బౌలింగ్ తీసుకునే వారు.కానీ ముందు బాటింగ్ చేయాల్సి వచ్చింది.గమనిస్తే,మొదటి మూడు ఓవర్లలో వాళ్ళు తొందర పడి బాదేయలేదు.జాగ్రత్తగా ఆడారు.వీలు చిక్కినప్పుడు పరుగులు తీసారు.అంతే తప్ప మొదతి బంతినుంచే బాదుడు ఆరంభించలేదు.కాస్త అలవాటవగానే విజృంభించారు.మూడు ఓవర్లలో 30 పరుగులు కూడా లేని వారు,6 ఓవర్లయ్యేసరికి 60 పరుగులు దాటారు.గ్రేం స్మిథ్ ఆట,అస్నోద్కర్ ఆట తీరు పరసోర విరుద్ధ మయినా,ఇద్దరి నడుమ మంచి సమన్వయం వుంది.సెహ్వాగ్.గంభీర్ లిద్దరూ మంచి జోడీ అయినా విఫలం కాకుండా నిలకడగా ఆడటంలో వీరిద్దరే ఉత్తములు.షేన్ వాత్సన్ ఆట రూపు రేఖలను మార్చేశాడు.యౌసుఫ్ పఠాన్ జాతీయ టేంలో ఈన్నికను సిక్సులు కొట్టి సంబరాలు జరుపుకున్నాడు.దాంతో,రాజస్థాన్ వారు హాయిగా,ఎటువంటి తొందరలు లేకుండా 192 సాధించగలిగారు.గమనిస్తే,ఆన్ని జట్ల లోకీ పూర్తిగా 20-20 ఆట తత్వాన్ని అర్ధం చేసుకున్నది ఈ జట్టే అనిపిస్తుంది.ప్రతి ఒక్క ఆటగాడికీ తాను చేయవలసింది తెలుసు.ఒకరు విఫలమయితే వెంటనే ఆ బాధ్యతను మరొకరు భుజానికి ఎత్తుకుంటున్నారు.కొందరు విఫలమన్న మాట తలపెట్టక జట్టు విజయానికి కారకులవుతున్నారు.మొన్న పంజాబ్ వారితో ఓడటంతో దిష్టి తీసేసినట్టయింది.మళ్ళీ ఫైనల్లో పంజాబ్ తో జరిగే ఆటలో రాజస్థాన్ వారు అసలు ఆట ఆడతారు.కప్పు గెలుచుకుంటారు అనిపిస్తోంది.
ఇవాళ్ళ జరిగే మరో ఆటలో చెన్నై జట్టుకు గెలవాలన్న పట్టుదల వుంది.గెలిచే శక్తి వుంది.కానీ రాజస్థాన్ వారు కూడా 20-20 ఆటను బాగా ఆకళింపు చేసుకున్నారు.మార్ష్ కనక బాఘా ఆడితే,సెహ్వాగ్,సంగకార,జయవర్దనేలు నిలబడితే-చెన్నై ఎదురు నిలబడటం కష్టం.పంజాబ్ జట్టు క్రమం తప్పకుండా ఉత్తమ స్థాయి ఆట ప్రదర్షిస్తూ ఈ స్థాయికి వచ్చారు.చెన్నై జట్టు ఇందుకు భిన్నంగా అప్పుడప్పుడే మంచి ఆట చూపింది.కాబట్టి పంజాబ్ గెలిస్తేనే న్యాయం జరిగినట్టు అవుతుంది.అయితే,దేవుడి కొలబద్దలు వేరు.కాబట్టి ఏమవుతుందో ఎదురుచూడటం తప్ప మార్గం లేదు.అయితే,అందాల ప్రీతి జింటా ఆనందంగా,బుగ్గలు సొట్టలు పడేలా నవ్వుతూ.నృత్యం చేస్తూంటే చూడాలని వుంది.కాబట్తి నా వోటు పంజాబ్ కే.ఎంతయినా,అందమే ఆనందం అన్నారు పెద్దలు.అదీగాక,ఎటువంటి భేషజాలు లేక హాయిగా ఆనందించగలిగేవారు ఎందరున్నారు.అలా ఆనందించేవారిని మరింత ఆనందింపచేయటంలో ఇంకెంతో ఆనందం వుంది.అవునా?
మే 31, 2008
ఫైనల్స్ లో రాయల్స్.నీ గతేమిటి చెన్నై?
మే 29, 2008
నిన్న నేను గంధర్వుడి గానం విన్నాను!
నిజం!నిన్న నేను గంధర్వుడి గానం విన్నాను.నాకు గంధర్వుడి గానం ఎలా వుంటుందో తెలియదు.కానీ మనకు తెలియని విశయాలు,అనుభవానికి రాని అంశాలు,అనుభవించిన వారి ద్వారా గ్రహించవచ్చంటుంది శాస్త్రం.అలాంటి పెద్దవారి అనుభవాలు విని,చదివి గంధర్వ గానం ఎల్లా వుంటుందో ఒక అభిప్రాయానికి వచ్చాను.అయితే,నిన్న నేను విన్న గానం నా ఊహలను మించింది.గంధర్వ గానం గురించి నేను ఏర్పరచుకున్న అభిప్రాయాలన్నిటినీ తుడిచి పెట్టి నూతన నుభూతినీ,అనుభవాన్నీ మిగిల్చింది.
నిన్న నేను సికింద్రాబాద్ లో జరిగిన బాల మురళీ కృష్ణ గాన కచేరీకి వెళ్ళాను!
నిజానికి,నా మితృడు పిలిచినప్పుడు వెళ్ళకూడదనే అనుకున్నాను.టీవీలో చూస్తూంటాను.కాసెట్లో,సీడీలో వింటూంటాను.అంతదూరం వెళ్ళి చూడాలా,అనుకున్నాను.కానీ రాస్తున్న నవల ఒక మెలిక కదలకపోవటంతో మార్పు వుంటుందని వెళ్ళాను.నా జీవితానికి ఒక అమూల్యమయిన,అపురూపమయిన, అద్వితీయమయిన అనాందానుభూతిని సంపాదించుకున్నాను.
సముద్రాన్ని బొమ్మల్లో చూడటం వేరు.సినిమాలో చూడటం వేరు.అనంత నీలి ఆకాశం నీడలో,అప్రతిహతంగా ఎగసిపడే అలలతో నిత్య సంచలనాలతో,కనిపించే అనంత పాథోరాశిని ప్రత్యక్షంగా చూడటం వేరు.
సముద్రం ఎదురుగా కూచుని,ఉవ్వెత్తున తాకే అలల తాకిడికి ఉక్కిరిబిక్కిరి అవుతూ కూడా,ఇంకా ఇంకా సముద్ర లోతులలోకి వెళ్ళి ఆ అనంత శక్తి విరాట్స్వరూపాన్ని అనుభవించాలన్న ఆతృత కలిగినట్టే,బాల మురళీ గాన అనంత రస ప్రవాహంలో లోతులలోకి వెళ్ళి అద్భుతాలను అనుభవించాలన్న కోరిక కలిగింది.ఆయన సృజించిన రస ప్రవాహంలో ఉక్కిరి బిక్కిరయి,తీయ తెనియ మాధుర్యము అనుభవిస్తూ నా ప్రాణాలు విడవటాన్ని మించిన ఆనంద్మ్ మరొకటి లేదనిపించింది.
హిమాలయాల్లో,14000 అడుగుల ఎత్తున మంచు తుఫానులో ఇరుక్కున్నప్పుడు సృష్టి అపరిమిత శక్తి గ్రహింపుకు వచ్చి నేనెంత అల్పుడనో అర్ధమయింది.అనంత పాథోరసిముందూ అలాంటి భావనే కలిగింది.ఇప్పుడు బాల మురళీ గానం వింటూంటే అలాంటి భావన కలిగింది.
నేను సంగీతాన్ని అనుభవించగలవాడనే తప్ప శాస్త్రీయంగా తెలిసిన వాడను కాదు.రాగాల మాధుర్యాన్ని అనుభవించగలను తప్ప రాగాలు తెలియదు నాకు.స్వరాల తీయదనం గుర్తించగలను తప్ప స్వర స్వరూపం గ్రహించలేను.కానీ నిన్న ఆయన గానం ప్రత్యక్షంగా వింటూంటే నా ఇంద్రియాల పరిథి విస్తృతమయిన భావన కలిగింది.నాలో నాకే తెలియని రాగాల స్పందనలు నిర్దిష్ట రూపం ధరించాయి. స్పష్టమయిన ఆకారంతో నన్ను చేయి పట్టుకుని వింత వింత లోకాలకు తీసుకు పోయాయి.నాలో ఇంత గాఢమయిన భావనుభూతి వుందని నాకు అప్పుడే అర్ధమయింది.
ఇంతకాలం నాకు సంగీతమంటే చిన్న చూపు వుండేది.సంగీతం అస్పష్ట కళ.కేవలం రాగంతో వ్యక్తి సంపూర్ణ భావానుభూతి పొందలేడు.దానికి సాహిత్యం తోడవకుంటే సంగీతానికి నిర్దిష్ట స్వరూపం లేదు అనుకునే వాడిని.కానీ ఆ అభిప్రాయం పటాపంచలయింది.ఒక పదాన్ని మానవ కంఠ స్వరం ఎన్ని విధాలుగ పలుక గలదో,ఎన్ని చిత్ర విచిత్ర పోకడలు పోగలదో,ఎన్నెన్ని వింత వింత అనుభూతులు సృజించగలదో,ఆత్మ లోతులలో ఎన్నెన్ని విభిన్న స్పందనలు కలిగించగలదో నిన్న తెలిసింది.అనుభవమయింది.మానవ స్వరమే కాదు,దానితో పోటీగా మానవ కళా నైపుణ్యం,జీవం లేని వాయిద్యాలను సజీవం చేసి మానవ స్వరానికి దీటుగా రాగాలు పలికించగలగటం తెలిసింది.ఆ కళాకారుల కళ ఆత్మ అర్ధమయింది.
భారతీయ ధర్మంలో కళ ఏదయినా అది భగవంతుడిని చేరే మార్గం.కళ ద్వార కళాకారుడు తన ఆత్మలోని లోలోతు స్పందనలను బహిర్గత పరుస్తాడు.ధన్యుడవుతాడు.ఆ కళను అనుభవించటం ద్వారా వ్యక్తి కళాకారుడి భావావేశంతో తాదాత్మ్యం చెందుతాడు.తానూ తరిస్తాడు.తనలో నిలచివున్న ఆత్మ స్వరూపాన్ని గ్రహిస్తాడు.ఆధ్యాత్మిక జ్యోతిని దర్శిస్తాడు.సాహిత్యమయినా,చిత్రలేఖనమయినా,గానమయినా,కళ పరమార్ధం ఇదే.అందుకే కళలు సరస్వతీ స్వరూపాలు.ఆ సరస్వతీ వీణా నాదానికి మానవ కంఠ రూపం బాల మురళీ కృష్ణ.
నిన్నటితో సంగీతం పయిన నా అభిప్రాయం మారిపోయింది.గంధర్వ గానం రాయిని కూడా కరగిస్తుంది.మోడును చిగురింప చేస్తుంది.ఎడారిలో వసంతాన్ని చిగురింపచేస్తుంది.మనిషి ఆత్మకు రెక్కలిస్తుంది.శారీరక పరిథిని దాటి వినీల విశాల విహాయసంలో వీర విహారం చేసే శక్తినిస్తుంది. అందుకే బాల మురళీది గంధర్వ గానం.ఆయన గాన గంధర్వుడు.ఆయన గానం విన్న నేను ఇంకా గంధర్వ లోకమ్నుంచి మానవ లోక్లోకి రాలేదు.దిగిరాను దిగిరాను దివినుంచి భువికి అని అక్కడే ఆలోకంలోనే వుండిపోవాలనుంది.
మే 28, 2008
ఐ.పి.ఎల్ కప్పు ఎవరిది?
మొత్తానికి ఐ.పి.ఎల్ క్రికెట్ పోటీల్లో సెమి ఫైనల్ ఆడే జట్లేవో తెలిసిపోయింది.రాజస్థాన్,చెన్నై,పంజాబ్,డిల్లీ జట్లు ఓడితే ఇంటి దారి పట్టే సెమి ఫైనల్ లో తలపడతాయి.ఒక్క బంతి,ఒక్క ఓవరు,ఒక్క షాట్ మొత్తం ఆట స్వరూపాన్ని మార్చి,అదృష్టాన్ని తల్ల క్రిందులు చేసే పోటీల్లో ఎవరు తప్పకుండా గెలుస్తారో చెప్పటం సాహసమే కాదు,మూర్ఖత్వం కూడా అవుతుంది.కానీ,ముందు జరిగే దాన్ని ఊహించటం మానవుడి బలహీనత.ఊహించినట్టు జరిగితే గొప్ప అనుకోవటం,ఊహించిన దానికి వ్యతిరేకంగా జరిగితే,తలచినదే జరిగినదా దైవం ఎందులకు?అనుకోవటం మనకొక అలవాటు.
సెమీస్ లోకి రావటానికి చెన్నై జట్టు చాలా కష్ట పడటమే కాదు,మంచి పట్టుదలను ప్రదర్శించింది.రాజస్థాన్ వారితో రెండువందల పరుగులను వేటాడిన విధం వారి పట్టుదలను చూపిస్తుంది.చార్గెర్స్ ఎలాగో చార్గి లేక నిర్వీర్యులయి ఉన్నారు.దాంతో గెలుపు మొదటి ఓవర్లోనే చెన్నై దని స్పష్టమయింది.చెన్నై గెలుపు ముంబై వీరులను పూత్రిగా నేల పైకి దించింది.సచిన్ పేరు విజయానికి రాచబాట కాదని,క్రికెట్ 11 మంది కలసి ఆడేదని ఈ పాటికి ముంబయ్ జట్టులోని వారికి అర్ధమయి వుంటుంది.ముంబయ్ జట్టులో అనుభవం ఉన్న వారుండి కూడా చివరి ఓవర్లలో ఉద్విఙ్నతలను తట్టుకోలేకపోవటం వారి పరాజయానికి ప్రధాన కారణం. పంజాబ్ వారితో,రాజస్థాన్ వారితో చివరి బంతిలో ఒక్క పరుగుతో ఓడటం వారి సెమీస్ అర్హతను దెబ్బ తీసింది.
పంజాబ్ జట్టు పట్టుదల,విజయోత్సాహం ముంబయ్ ఆటలో చివరి బంతిలో యువరాజ్ ప్రత్యర్ధిని రనౌట్ చేసిన విధం నిరూపిస్తుంది. విదేశీ స్వదేశీ ఆటగాళ్ళు కలసికట్టుగా,ఒక జట్టులా ఆడుతున్న ఈ జట్టు ఫైనల్ కి వెళ్తుందనిపిస్తుంది.కానీ,యువరాజ్,సంగకార,జయవర్దనేలు ఆడకపోతే జట్టు దెబ్బతింటుంది.
డిల్లీ జట్టుకు గంభీర్,ధవన్,మెక్ గ్రత్,సెహ్వాగ్ లు నాలుగు స్థంభాలు.అయితే,వీరిలో సెహ్వాగ్ ఆట ప్రాణం పోకడా ఎవ్వరూ చెప్పలేరు.రాజస్థాన్ వారితో,ఓడిన విధం వీరి బలహీనతలను స్పష్టం చేస్తుంది.
ఉన్న వారందరిలోకీ పటిష్టమయిన జట్టులా కనిపిస్తోంది రాజస్థాన్ జట్టు.బాటింగ్లోనూ,బౌలింగ్లోనూ ఎటువంటి బలహీనతలూ చూపటంలేదు.గెలవాలన్న పట్టుదలలోనూ ఎక్కడా సడలింపు కనబడటంలేదు.అయితే,సాధారణంగా అన్ని ఆటలూ గెలుస్తూఅ వస్తున్న వాడు అసలు ఆటలో ఓడతాడు.అలా అదృష్టం అడ్డుపడితే తప్ప రాజస్థాన్ వారే గెలుస్తారనిపిస్తుంది.మిగతా జట్లనీ ఏదో ఒక బలహీనతను చూపాయి.రాజాస్థాన్ వారు ఇంకా బలహీనతలను చూపాల్సివుంది.చూపితే,మిగతా ముగ్గురిలో ఎవరయినా గెలవవచ్చు.చూపక పోతే సమస్యే లేదు.
నాకు మాత్రం ఎందుకో రాజస్థాన్ వారు దెబ్బ తింటారనిపిస్తోంది.సాధారణంగా బలవంతుడంటే ఒక రకమయిన వ్యతిరేక భావం వుంతుంది.అందుకేనేమో!కానీ,ఈ ఐ.పి.ఎల్ కప్పు నిజంగా గెలిచే అర్హత మాత్రం వార్న్ కే వుంది.
ఈ పోటీల వల్ల సెలెక్టొర్ల పని కఠినం అయింది.కొత్త ఆటగాళ్ళను విడవలేరు.పాత వారిని వదలలేరు.అయితే,సచిన్ తప్ప మిగతా పాత వారిని ఎలాగో వదిలేశారు.సమస్య అల్ల కొత్త వారిలో ఎవరిని వదలాలన్నది.యూసుఫ్ పఠాన్,అస్నోద్కర్,నాయర్,ధవన్,మిశ్రా,గోస్వామి ఇలా కొత్త కొత్త వారంత మేమున్నాం అంటూ వచ్చేసారు.ఎవరిని వదలాలి?ఎవరిని మరవాలి?
ఇక ద్రావిడ్,సచిన్,గంగూలీ,లక్ష్మణ్ ల జట్టులు ఓడటంలో వాళ్ళ బాధ్యత పెద్దగా లేదనవచ్చు.ఇది 20-20 ఆట.కొట్టు,పట్టు.అంతే!కానీ,ఈ ఆట యువకులదే అన్నది చేదు నిజం.వీళ్ళు ఆడలేరని కాదు కానీ,అదే పనిగా ప్రతి బంతినీ బాదటం వీరికి అలవాటులేదు.20-20లో పెరుగుతున్న యువకులు ఇకపై పుడుతూనే బాదుతూ పుడతారు.వాళ్ళతో 5 రోజుల ఆట ఆడించినప్పుడు అసలు ప్రతిభలు తెలుస్తాయి.అప్ప్టి వరకూ అబంతికో హీరో పుడుతూనే వుంటాడు.ద్రావిడ్,సచిన్,గంగూలీ లు ముసలివారిలానే అనిపిస్తారు.